యాగండ్ల దీప
జగిత్యాల: కులం వేరైనా నచ్చిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు సవ్యంగా సాగిన వారి దాంపత్య జీవితానికి కూతురు కూడా పుట్టింది. కూతురు కాపురం సజావుగా సాగుతుందని భావించి ఆ యువతి తల్లిదండ్రులు రూ.10లక్షల కట్నం ముట్టజెప్పారు. ఇంతలోనే ఆమెకు అదనపు కట్నం వేధింపులు ప్రారంభమయ్యాయి. భర్తతోపాటు అత్తామామలు పోరుపెడుతున్నారు. వాటిని తాళలేక ఆ యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన కథలాపూర్ మండలం దూలూర్ గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణానికి చెందిన యాగండ్ల దీప అలియాస్ పిల్లి దీప, దూలూర్ గ్రామానికి చెందిన యాగండ్ల ప్రదీప్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు అన్యోన్యంగా ఉండడంతోపాటు కూతురు (3) కూడా జన్మించడంతో దీప తల్లిదండ్రులు కొద్దిరోజుల క్రితం రూ.10 లక్షలు ముట్టజెప్పారు.
ఈ క్రమంలో ప్రదీప్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. ఆయన వెళ్లినప్పటి నుంచి అత్తమామలు దీపను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నారు. ఇదే విషయాన్ని భర్త ప్రదీప్‌కు చెబితే అతడు కూడా ఫోన్‌లో వేధించడం ప్రారంభించాడు. అటు కట్టుకున్న భర్త.. ఇటు అత్తామామలు వేధిస్తుండడంతో తట్టుకోలేని దీప మంగళవారం అర్ధరాత్రి తర్వాత తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సంఘటన స్థలాన్ని మెట్‌పల్లి డీఎస్పీ రవీందర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నికోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దీపను ఆమె భర్తతోపాటు అత్తమామలు అదనపు కట్నంకోసం వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పిల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్పీ వెంట కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్, కథలాపూర్ ఎస్సై కిరణ్‌కుమార్ ఉన్నారు. తల్లి చనిపోవడం.. తండ్రి గల్ఫ్‌లో ఉండడంతో దీప కూతురు అనాథగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment