జగిత్యాల: ‘ఉదయం ఇంటి నుంచి వెళ్లిన ఆయన.. సాయంత్రమైనా తిరిగి రాలేదు.. పనుల్లో నిమగ్నమైన భార్య.. ఆటపాటల్లో ఉన్న పిల్లలు.. ఆయన గురించి అంతగా ఆలోచించలేదు.. ఎప్పటిలాగే రాత్రివరకూ ఇంటికొస్తారని అనుకున్నారు.. అంతలోనే ఆయనకు బదులు ఓ చేదు వార్త ఇంటికి చేరింది.. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ఉన్నాడని సమాచారం అందింది.
అంతే.. ఒక్కసారిగా ఆందోళనకు గురైన భార్య.. భర్త కోసం పరుగులు తీసింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను చూసి కన్నీరు పెట్టుకుంది.. భర్తను బతికించాలని మొక్కుకున్నా.. దేవుని మనసు కరగలేదు.. శాశ్వతంగా ఈలోకం నుంచి దూరం కావడంతో ఆమెకు, పిల్లలకు అంతులేని దుఃఖమే మిగిలింది'. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రజాక్(37)పై ఈనెల 16న గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.
కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడిగా సేవలు అందిస్తున్న రజాక్.. నిజామాబాద్‌లో గత బుధవారం జరిగిన బీసీ గర్జన సదస్సుకు వెళ్లడానికి ఉదయం మెట్‌పల్లిలోని కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పార్టీ నాయకులతో కలిసి నిజామాబాద్ వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చిన ఆయన.. ఓ పని నిమిత్తం రేగుంట వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకొని దాడి చేశారు. ఈ సంఘటనలో బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిజామాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
బంధువులతో గొడవలే కారణమా?
► రజాక్‌కు తమ సమీప బంధువులతో ఓ విషయంలో గొడవలు ఉన్నట్లు తెలిసింది.
► ఈ క్రమంలోనే పలుసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగినట్లు సమాచారం.
► ఈ వివాదం ఇంకా సమసిపోలేదు. దీంతో అవతివారు కక్ష పెంచుకొని పక్కా వ్యూహంతో రజాక్‌పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
► ఈ వ్యవహారంలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ నాయకుల ఆందోళన..
రజాక్‌పై దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు కొమొరెడ్డి కరం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై శనివారం నిరసన తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన తర్వాత స్వగ్రామానికి తరలిస్తుంగా.. మార్గమధ్యంలో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, పోలీసులకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. అనంతరం పూలు పట్టుకుని నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యే నివాసానికి బయలుదేరి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment