కరీంనగర్: ఏడాదిక్రితం సింగరేణిలో బదిలీపిల్లర్ (ఆర్జీ–ఏఎల్‌పీ)గా ఉద్యోగం పొంది భవిష్యత్తును ఆనందంగా గడపాల్సిన పల్లె వంశీకృష్ణ(26) ప్రాణాలను ఆన్‌లైన్ యాప్ బలిగొంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన వంశీకృష్ణ తండ్రి రాయమల్లు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా.. ఆ ఉద్యోగాన్ని ఏడాదిక్రితం పొందిన వంశీ మకాం పెద్దపల్లికి మార్చాడు.
పట్టణంలోని చీకురాయి రోడ్డులో నివాసముంటున్న సమయంలో గుర్తుతెలియని ఆన్‌లైన్ యాప్ నుంచి కొంత రుణం పొందాడు. ఆ తర్వాత తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉన్నావంటూ నిర్వాహకులు వంశీకృష్ణపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత తన ఫొటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో బంధు, మిత్రులందరికీ షేర్ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారని కుటుంబీకులు ఆరోపించారు. ఆన్‌లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్‌నేరంగా కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులకు బదిలీ చేస్తున్నామని ఎస్సై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment