సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్.. పోలీసు ఉద్యోగ పరీక్షల శిక్షణ కేంద్రాలకు ఫేమస్. రాజధానివ్యాప్తం గా ఉన్న శిక్షణ కేంద్రాల్లో ఏటా లక్ష మందికిపైగా శిక్షణ తీసుకుంటున్నారు. కాని వాటిలో పూర్తి సదుపాయాలున్న ఇన్‌స్టిట్యూట్లు ఎన్ని? అంటే వేళ్ల మీద లెక్క పెట్టుకునేన్ని కూడా లేవు. పాఠశాల పెట్టాలంటే విద్యాశాఖ అను మతి, కాలేజీ పెట్టాలంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్, యూనివర్సిటీ నుంచి అనుమతి ఉండాలి. పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రం పెట్టాలంటే మాత్రం అనుమతి అక్కర్లేదు. దీంతో పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పేరుతో కొన్ని ఇన్‌స్టిట్యూట్లు భారీగా ఫీజులు దండుకుంటున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులందాయి.
2 వేల మందికి ఒకే క్లాస్
హైదరాబాద్‌లోని కోచింగ్ సెంటర్లలో కానిస్టేబుల్ శిక్షణకు రూ.5 వేల నుంచి రూ.7,500 వసూలు చేస్తుండగా, ఎస్‌ఐ శిక్షణకు రూ.12 వేల నుంచి రూ.15 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదల సమయం లో కానిస్టేబుల్ ప్రిపరేషన్‌కు రూ.10 వేలు ఎస్‌ఐకి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఇన్‌స్టిట్యూట్లు ఇలా ఏటా రూ.100 కోట్లకు పైగా దండుకుంటున్నట్టు విద్యాశాఖ గుర్తిం చింది. ఒక్కో బ్యాచ్‌లో 1,500 మంది నుంచి 2 వేల మందికి ఏకకాలంలో క్లాసులు నిర్వహిస్తున్నాయి.
గంటకు ఇంత..
డిమాండ్ సబ్జెక్టులుగా ఉన్న అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లిష్ బోధించే ట్యూటర్లు గంటకు రూ.600 నుంచి రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. మొత్తం కోర్సులో ఒక్కో సబ్జెక్టుకు 150 గంటల చొప్పున శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక సబ్జెక్టు ట్యూటర్ రోజుకు ఆరు ఇన్‌స్టిట్యూట్ల లో బోధిస్తాడు. అతడికి గంటలపై ఉన్న శ్రద్ధ అభ్యర్థులు ఉద్యోగం సాధించాలనే అంశంపై ఉండటం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ శిక్షణ కేంద్రాలను కూడా విద్యా శాఖ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు.
సదుపాయాల్లేవు..
పదిహేను రోజుల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లో చేరా. ఎస్‌ఐ పరీక్ష కోసం రూ.15 వేలు ఫీజు తీసుకున్నారు. కేవలం థియరీ క్లాసులు మాత్రమే చెబుతున్నారు. ఔట్‌డోర్ ట్రైనింగ్ గురించి అడిగితే ప్రత్యేకంగా ఫీజు చెల్లించాలని అన్నారు. అంతేకాకుండా సరూర్‌నగర్ స్టేడియం లేదా విక్టోరియా గ్రౌండ్‌లో తమతో లింకున్న పీఈటీలు, నిపుణులు ట్రైనింగ్ ఇస్తారని, వాళ్లకు నెలకు రూ.3 వేల చొప్పున ఇవ్వాలని చెబుతున్నారు.
– రాజ్‌కుమార్, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment