ఇంటర్‌ వరకు యూనిఫారాలు! | Uniforms till the inter | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ వరకు యూనిఫారాలు!

Published Thu, Feb 1 2018 1:23 AM | Last Updated on Thu, Feb 1 2018 1:23 AM

Uniforms till the inter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫారాలను అందిస్తున్న ప్రభుత్వం ఇకపై ప్రభు త్వ కళాశాలల్లో ఇంటర్మీడియెట్‌ వరకు ఈ సదుపాయాన్ని వర్తింపజేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను వెచ్చించే ఈ పథకం కింద ప్రస్తుతం ఒక్కో విద్యార్థికి ఏటా రెండు జతల యూనిఫారాల కోసం రూ. 400 కేటాయిస్తున్న కేంద్రం...ఆ మొత్తాన్ని రూ. 600కు పెంచాలని నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకే కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్‌ వరకు చదివే విద్యార్థులకు కూడా యూనిఫారాల పథకాన్ని వర్తింపజేయాలని అన్ని రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించాయి. మంగళవారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగ్గా దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం 8వ తరగతి విద్యార్థుల వరకు ఇస్తున్న యూనిఫారాల వల్ల 25 లక్షల మంది లబ్ధి పొందుతుండగా ఈ సదుపాయాన్ని ఇంటర్‌ వరకు వర్తింపజేస్తే మరో 14 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ బూట్లు కూడా ఇవ్వాలని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరగా ఈ అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించినట్లు తెలిసింది. 

స్కూల్‌ గ్రాంటు పెంపు కోసం పట్టు... 
పాఠశాలల నిర్వహణ కోసం స్కూల్‌ మెయింటెనెన్స్‌ గ్రాంట్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలకు రూ. 5 వేల చొప్పున ఉన్న కనీస గ్రాంటును రూ. 25 వేలకు పెంచేందుకు కేంద్రం ఓకే చెప్పినట్లు తెలిసింది. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల గ్రాంటును కూడా పెంచాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. 100 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ. 25 వేలు, 100 నుంచి 250 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ. 50 వేలు, 250 నుంచి వెయ్యి లోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లకు రూ. 75 వేలు, వెయ్యి కంటే ఎక్కువ మంది ఉన్న స్కూళ్లకు కాంపోజిట్‌ గ్రాంటుగా రూ. లక్ష ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పగా, ఆ మొత్తాన్ని మరింత పెంచాలని రాష్ట్రాలు కోరాయి. ఇందుకు కేంద్ర అధికారు లు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది. 

1,038 అదనపు టాయిలెట్ల మంజూరుకు ఓకే 
రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు టాయిలెట్లను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఓకే చెప్పారు. ప్రతి వంద మంది విద్యార్థులకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,038 అదనపు టాయిలెట్లను మంజూరు చేసేందుకు ఓకే చెప్పింది. అయితే స్వచ్ఛ విద్యాలయ పథకం కింద ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్‌ చొప్పున 3 వేలకుపైగా అదనపు టాయిలెట్లు మంజూరు కానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement