ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారు | TS EAMCET Conducted In September | Sakshi
Sakshi News home page

9 నుంచి ఎంసెట్‌

Published Tue, Aug 11 2020 1:32 AM | Last Updated on Tue, Aug 11 2020 7:05 AM

TS EAMCET Conducted In September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అగ్రికల్చర్‌ ఎంసెట్‌ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్‌ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్‌ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 2020–21 విద్యా సంవత్సరంలో అకడమిక్‌ వ్యవహారాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసు కున్నారు. ఈ నిర్ణయాలను హైకోర్టుకు తెలిపి కోర్టు ఆమోదంతో అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి చిత్రా రామ్‌చంద్రన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఈ సెట్‌ మినహా మిగిలిన పరీక్షలను వచ్చే నెలలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. అనంతరం వారు మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.

  • ఈ నెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు (వీడియో పాఠాలు) ప్రారంభమవుతాయి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు దూరదర్శన్, టీశాట్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. అవకాశం ఉన్న చోట ఆన్‌లైన్‌ తరగతులు చేపడతారు.
  • ప్రభుత్వం జారీ చేసే నిబంధనలను ప్రైవేటు స్కూళ్లు అమలు చేయాల్సిందే. డిజిటల్, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఆన్‌లైన్‌ తరగతులను కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఉన్నత తరగతులకు 3 గంటలకు మించడానికి వీల్లేదు. నాలుగు పీరియడ్లు ఉంటాయి.
  • ప్రాథమిక తరగతులకు 2 గంటలకు మించి ఉండానికి (3 పీరియడ్లు) వీల్లేదు. అయితే వీటికి ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.
  • సెప్టెంబర్‌ 1 నుంచి 3–5 తరగతుల వరకు విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు నిర్వహిస్తారు.
  • ఈ నెల 17 నుంచి 50 శాతం మంది టీచర్లు పాఠశాలలకు హాజరు కావాల్సిందే. డిజిటల్‌ తరగతులు, ఇతరత్రాకార్యక్రమాలను పర్యవేక్షించాలి. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయాలి. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక్కో తరగతికి ఒక రోజును కేటాయించాలి. ప్రాథమిక స్థాయి వారికి అవసరమైన సహకారం అందించాలి.
  • ఈ నెల 17 నుంచి ఇంటర్‌ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు డిజిటల్, ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి. 
  • సెప్టెంబర్‌ 1 తరువాత ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల ప్రక్రియ చేపడతారు.
  • అగ్రికల్చర్‌ ఎంసెట్‌కు సంబంధించిన తేదీలను వచ్చే నెల 13న నీట్‌ పరీక్ష తరువాత ఖరారు చేస్తారు. 
  • ఈ నెల 20 నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement