విలువైన విద్యా.. విలువల విద్యా? | Importance And Need Of Value Education | Sakshi
Sakshi News home page

విలువైన విద్యా.. విలువల విద్యా?

Published Sun, May 20 2018 2:16 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Importance And Need Of Value Education - Sakshi

లక్షలు ఖర్చుపెట్టి కార్పొరేట్‌ కాలేజీల్లో అధిక శాతం మార్కులు, ర్యాంకులు సాధించడం అవసరమా? నైతిక విలువలు, మానవీయ వ్యక్తిత్వం, సృజనాత్మకతతో కూడిన విద్య అవసరమా అంటే ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నేటి సగటు విద్యార్థిది. కేవలం ర్యాంకులు, మార్కులు, ఆంగ్ల భాషా నైపుణ్యాలుంటే ఐదంకెల ఉద్యోగం దొరుకుతున్న ఈ రోజుల్లో వ్యక్తిత్వం, విలువల గురించి మాట్లాడటం అమాయకత్వమే అవుతుందేమో!
మనందరం మర్చిపోతున్న విషయమిది. తెలివి తేటలకు, ప్రతిభకు కొలమానం ఏంటి? సంపన్నులైన తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి అంతర్జాతీయ పాఠశాలలు/కళాశాలల్లో చదివిస్తూ, ట్యూషన్లు, పాఠ్య పుస్తకాలు, మెటీరియల్‌ వంటి అన్ని మౌలిక వసతులు కల్పిస్తే చదివి అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థి ప్రతిభావంతుడా? ఏ అవకాశాలు లేకుండా.. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ అరకొర వసతులతో, ఓ మోస్తరు మార్కులతో ఉత్తీర్ణులైన వారు ప్రతిభావంతులా? దేశంలో రెండో వర్గపు దురదృష్టవంతులే ఎక్కువ.

ఈ ర్యాంకుల గొడవ ఈనాటిది కాదు. బ్రిటిష్‌ వారు మన దేశంలో విద్యావ్యవస్థను స్థాపించినప్పటినుంచి కేవలం రెండు తరగతులే ఉండేవి. ఫస్ట్‌ క్లాస్, సెకండ్‌ క్లాస్‌. ఫస్ట్‌ క్లాసులో పాసవ్వాలంటే ఆంగ్లేయ వలస విధానాలకు అనుగుణమైన పాఠ్యాంశాలను బట్టీపట్టాలి. ఈ విధానాలను అందుకోలేక వెనుకబడిన భారతీయుల కోసం ధర్డ్‌ క్లాస్‌ అనే మరో తరగతిని సృష్టించారు. చదువుకునే కూలీలను తయారు చేసి వారి అవసరాలకు అనుగుణంగా వాడుకోవడానికే ఈ మూడో తరగతి పనికొచ్చేది. నేటికీ ఇదే విధానం కొనసాగుతూ చదువుకున్న కూలీల సంఖ్యే  దేశంలో ఎక్కువగా ఉంది. వీరెవ్వరికీ సృజనాత్మకత, స్వీయ ఆలోచనా సామర్థ్యం, విలువలు, నైతికత, నిజాయితీ, సామాజిక బాధ్యత వంటివి తెలీవు.

అందుకే మనలో లేని విలువలను, నైతికతను, నిజాయితీని, మానవీయ గుణాలను మనపిల్లల్లో చూడాలనుకోవడం అవివేకం కాదా? ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను చూశాం. అత్యధిక ర్యాంకులను సాధించిన విద్యా సంస్థలను చూశాం. అత్యున్నత బోధనతో అత్యధిక మార్కుల సాధనకు కృషి చేసే ఉపాధ్యాయులను చూశాం. కానీ మంచి వ్యక్తిత్వం, విలువలు, సృజన, బాధ్యత గల విద్యార్థులను రూపొందించే ఉపాధ్యాయులూ, విద్యాసంస్థలూ, తల్లిదండ్రులు నేడు అరుదుగా కనబడుతున్నారు.

ఇవాళ సమాజంలో జరుగుతున్న అనేక అకృత్యాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులే ఎక్కువగా దోషులుగా నిలబడుతున్నారు. ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలలో అధికశాతం వీరిదే. మన పిల్లల్లో నేర, హింసా ప్రవృత్తి పెరగడానికి కారణం వీరికెక్కడా విలువలు గురించి ఆలోచించే సమయం, అవసరం లేకపోవడమే. ఉమ్మడి కుటుం బాలు కనుమరుగవడంతో పిల్లలను కనిపెట్టుకుని సరైన దారిలో నడిచేటట్టు చూసేవారు లేకుండా పోయారు. నేడు పిల్లలు తప్పుదోవ పట్టడానికి ప్రధాన కారణం పెద్దల పర్యవేక్షణ లేకపోవడమే. 

ఇటీవల హర్యానాలో 16 ఏళ్లున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థి.. పాఠశాల ప్రిన్సిపల్‌ని తుపాకీతో కాల్చి చంపాడు. కారణం హాజరు తక్కువగా ఉన్నం దుకు ప్రిన్సిపల్‌ హెచ్చరించటంవల్ల, అందరి ముందూ పరువు పోయిందని భావించటం. గుర్‌గావ్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థి తన తరగతి ఉపాధ్యాయురాలిపై లైంగిక దాడికి ప్రయత్నించి, ఆ మొత్తం సంఘటనను ఫేస్‌బుక్‌లో ఉంచటం అతనిలో భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నేటి తరం విద్యార్థుల్లో పెద్దవారి పట్ల గౌరవ భావం, ఉపాధ్యాయులపట్ల భక్తిశ్రద్ధలు, తోటివారితో సంతోషంగా మెలగటం వంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియక పోవటం దురదృష్టం. స్మార్ట్‌ఫోన్ల శకంలో తామొక మానవ సమూహంలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు.

నేటి తరానికి అనేక ఎలక్ట్రానిక్‌ పరికరాలు అందుబాటులోకి రావటంవల్ల చూడకూడనివి చూస్తున్నారు. నేర్వకూడనివి నేర్చుకుంటున్నారు. ఇటువంటి పరిణామాలను నియంత్రించటం భౌతి కంగా అయ్యే పని కాదు. కేవలం విలువల ప్రాధాన్యత తెలియ చెప్పటం ద్వారా పరిణతి చెందిన ఆలోచనలతో స్వీయ నియంత్రణను అలవర్చుకుంటారు.

ముఖ్యంగా నేటి తరానికి కష్టం అంటే ఏమిటో తెలియదు. విలాసవంతమైన, సుఖమయ జీవనం వీరి సొంతం. ఒకసారి సౌకర్యవంతమైన జీవన పరిధి దాటి బయటకొచ్చినప్పుడు విలువల్ని కాపాడుకోవటం చాలా కష్టం. ఆ కష్టాన్ని ఓర్చుకోవాలంటే గొప్ప వ్యక్తిత్వ నిర్మాణం అవసరం. విలువలు లేని విద్యతో వాటిని నాశనం చేసుకుంటే మున్ముందు మనిషనేవాడు కనపడడు. ఇప్పటికే ఎటు చూసినా మృగయా వినోదపు ఘీంకారాలు నలుదిశలా మ్రోగుతున్నాయి. వాటికి చరమగీతం పాడాలంటే విలువలతో కూడిన విద్యను మన ముందు తరాలకు అందించటానికి నడుం బిగించాలి.
 


వ్యాసకర్త ప్రిన్సిపాల్, యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 
మొబైల్‌ : 78931 11985 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement