విద్యార్హతల వివరాలు రహస్యమా?
ప్రతి పట్టభద్రుడికి వచ్చిన మార్కుల వివరాలు, డిగ్రీలో చేరిన తేదీ, పూర్తి చేసిన తేదీ, మొదలైన వివరాలన్నీ ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఇది శాశ్వత రికార్డుగా యూనివర్సిటీలో ఉంటుంది. ఇది రహస్య రికార్డు కాదు.
చదువు సంగతి వ్యక్తి స్వవిషయమా లేక బహిరంగ సమాచారమా? పట్టభద్ర, స్నాతకోత్తర విద్య (పీజీ)లకు సంబంధించిన పట్టాల వివరాలు వ్యక్తుల సొంత సమా చారం కనుక రహస్యమంటూ ఎవరికీ చెప్పకూడదా? లేదంటే పదిమందికీ తెలియాలా?
త్యాగి 1999లో ప్రైవేటు అభ్యర్థిగా పరీక్ష రాసి పట్టా సాధించాడు. అతని పట్టా వివరాలు అడుగుతూ సుభాష్ స.హ. దరఖాస్తు పెట్టుకున్నాడు. అది మూడో వ్యక్తి సొంత సమాచారమని కనుక ఇవ్వలేమని జవాబిచ్చాడు పీఐఓ. మొదటి అప్పీలులో కూడా సీబీఎస్‌ఈ వారు సమాచారం ఇవ్వలేదు. అతను కాలేజీకి వెళ్లకుండానే పరీక్ష రాసి ఉంటాడని సుభాష్ అనుమానిస్తున్నాడు. కాని ప్రైవేటు అభ్యర్థి అంటే అర్థం-పాఠాలు వినకుండా వెళ్లవచ్చనే. అయితే స.హ. చట్టం కింద చదువు వివ రాలు ఇవ్వవచ్చా? ఇవ్వకూడదా? అనే ప్రశ్న ముఖ్య మైంది. మార్కుల పత్రం ఇవ్వడానికి పేజీకి 250 రూపాయల చొప్పున ఇవ్వాలని పీఐఓ అడిగాడనీ ఇది సమాచారహక్కు నియమాలకు వ్యతిరేకమని సుభాష్ విమర్శించారు. మూడో వ్యక్తికి చెందిన సమాచారమే అనుకున్నా, అతని అభిప్రాయం తెలుసుకొనడానిక నోటీసులు ఇవ్వాలని చట్టం సెక్షన్ 11 నిర్దేశిస్తున్నది. ఆయనకు అభ్యంతరం లేకపోతే ఇవ్వవచ్చు. ఒకవేళ వద్దని అంటే, ఆ సమాచారం వెల్లడించడంలో ప్రజా ప్రయోజనం ఏదన్నా ఉందా లేదా అని ఆలోచించే బాధ్యత సమాచార అధికారి మీద ఉంది.
ఎందుకంటే ప్రైవేటు అభ్యర్థి తరగతులకు హాజరు కానవసరం లేదనేది సౌకర్యం. కనుక వ్యక్తిగత విషయాలని అనుకుంటే అందుకు ప్రజాప్రయోజనం లేదని తిరస్కరించవచ్చు.
కాని అసలు సమస్య చదువుల సమాచారం సొంతమా కాదా అనేది. ఏడో తరగతి పాసైతే ఎనిమిదో తరగతిలోకి, పది పాసైతే ఇంటర్ మీడియెట్‌లోకి, అందులో ఉత్తీర్ణుడైతే డిగ్రీ చదువుకు అర్హత లభిస్తుంది. ప్రవేశించిన నాటి నుంచి విద్యాలయంలో ఉత్తీర్ణులయ్యే దాకా రిజిస్టర్‌లో నమోదు చేయడం, రిజల్ట్ ప్రకటించడం, మార్కుల శాతం, ఫస్ట్, సెకండ్ క్లాస్, డిస్టింక్షన్ వర్గీకరణ, ర్యాంకులు బంగారు పతకాలు ఉంటే ఆ వివరాలు, ఇవన్నీ ఎక్కడా సొంతం అని దాచుకోరు, ప్రతిచోటా చెప్పుకుంటారు, ర్యాంక్ అవసరమైతే పోల్చి చూసుకోవడానికి అడుగుతారు. పై చదువులకోసం, ఉద్యోగాల కోసం బయోడేటాలో విద్యార్హతలు ఏమిటో చెప్పుకోక తప్పదు. విద్యార్థులే స్వయంగా విద్యార్హత ప్రతులు, మార్కుల జాబితాలు ఇస్తూనే ఉంటారు. ఫొటోకాపీ సౌకర్యం లేనపుడు టైప్ చేయించి విద్యాధికుని సంతకాలు చేయించి ఇవ్వవలసి వచ్చేది.
డిగ్రీ పూర్తికాగానే స్నాతకోత్సవం ఉంటుంది. కాన్వొకేషన్‌లో జరిగే పని పట్టాల ప్రదానమే. చదువులు ముగిసిన వారు ఆ చదువుల ఆధారంగా ఆ పట్టాలు ఎక్కుతారు. చదువుకున్న చదువు ఇచ్చే సంస్కారానికి తగ్గట్టుగా బతుకుతాం అని ప్రతి పట్టభద్రుడు ప్రమాణం చేయాలి. రాష్ర్ట ప్రభుత్వాధినేత అయిన గవర్నర్, విశ్వ విద్యాలయం ఛాన్స్‌లర్ హోదాలో విద్యార్థుల చేత ఆ ప్రమాణాలు చేయిస్తారు. పట్టాల పండుగ నాడు రాలేని విద్యార్థి అటువంటి ప్రమాణం ప్రతిమీద సంతకం చేసి ఇన్ ఆబ్సెన్షియా ఫారం నింపితేనే అతనికి పట్టా గైర్హాజరీలో ఇస్తారు.
నిర్ణీత ఫీజు చెల్లించాలి. అంటే ఉత్సవంలో హాజరైనా కాకపోయినా ప్రమాణం తప్పదు. ప్రైవేటు హోదాలో చదివినా, తరగతులకు హాజరుకాక పోయినా పాఠాలు వినకపోయినా, పరీక్ష రాసి ఉత్తీర్ణుడైన ప్రతి పట్టభద్రుడు ప్రమాణం చేయాల్సిందే. విద్యార్హతలకు తగిన విధమైన జీవనం సాగిస్తామని బాస చేసిన విద్యావంతులు తమ విద్యార్జన వివరాలు రహస్యమని దాచుకుంటామంటే అది ఎంతవరకు చెల్లుతుంది? విచిత్రమేమంటే చాలా మంది విద్యార్థులకు ఈ వాగ్దానం గుర్తుండదు. తాము గైర్హాజరీ ఫారంలో కూడా వాగ్దానాన్ని రాసి కింద సంతకం చేసిన విషయం గుర్తుండదు. కనుక ఆ వాగ్దానాన్ని పాటిస్తున్నారా లేదా అనే ప్రశ్నే తలెత్తదు. కాని ఆ చదువులు, అర్హతలు, పట్టాలు బహిరంగ వ్యవహారాలనీ, దాచుకునే రహస్యాలు కాదనీ అర్థం చేసుకోవలసి ఉంటుంది.
ప్రతి పట్టభద్రుడికి వచ్చిన మార్కుల వివరాలు, డిగ్రీలో చేరిన తేదీ, పూర్తిచేసిన తేదీ, మొదలైన వివరాలన్నీ ఒక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఇది శాశ్వత రికార్డుగా యూనివర్సిటీలో ఉంటుంది. ఇది రహస్య రికార్డు కాదు. వివాహాల రిజిస్టర్ వలె, స్థిరాస్తి క్రయవిక్రయాల నమోదు రిజిస్టర్ వలె, ఇవి విశ్వవిద్యాలయ కార్యాలయాలలో కాపాడుకోవలసిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. దీని ఆధారంగానే పట్టాల ప్రతులను ఇస్తారు. పోగొట్టుకున్న వారికి మళ్లీ పట్టా తయారుచేసి ఇస్తారు. ఈ రిజిస్టర్‌ను పరిశీలించడానికి, కావలసిన పేజీ ప్రతిని తీసుకోవ డానికి వీలుంది. ఈ హక్కు సమాచార హక్కు చట్టం రాకముందు కూడా ఉంది.
(సుభాష్ చంద్రత్యాగి వర్సెస్ సీబీఎస్‌ఈ కేసు CIC/SA/2016/001451 లో సమాచార కమిషన్ 2016 జూలై27న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com