కార్పొరేట్‌ గుప్పిట్లో కన్వీనర్‌ ఆఫీసు! | Corporate Colleges Lobbying In JNTU Convenor Office In Telangana | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 11 2018 2:39 AM | Last Updated on Wed, Jul 11 2018 4:14 AM

Corporate Colleges Lobbying In JNTU Convenor Office In Telangana - Sakshi

సాక్షి ప్రత్యేక ప్రతినిధి–హైదరాబాద్‌: విద్యను వ్యాపారమయం చేసిన కార్పొరేట్‌ కాలేజీలు.. ఆ దందాను విస్తృతం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కాయి. ఎంసెట్‌ మెడికల్‌ ర్యాంకుల కోసం దొడ్డిదారిలో ప్రశ్నపత్రాలను సంపాదించేందు కు ఆరాటపడ్డాయి. ఇందుకు కార్పొరేట్‌ శక్తులు చేసిన లాబీయింగ్‌ అంతా ఇంతా కాదు. 2 దశాబ్దాలకు పైగా ఎంసెట్‌ నిర్వహించిన చరిత్ర ఉన్న జేఎన్‌టీయూ, ఆ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసే కన్వీనర్‌ కార్యాలయాన్నీ వదల్లేదు. ఈ ఆఫీసులో సీనియర్‌ అధికారి మొదలు నాలుగో తరగతి ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరికీ లంచాల ఎర చూపారు. సంవత్సరాల తరబడి సొమ్ము ముట్టజెప్పి సమాచారం కాజేసే యత్నాలకు ఒడిగట్టారు. దరఖాస్తులు స్వీకరించడం మొదలు, ఫలితాలు ప్రకటించేదాకా ఏ నిర్ణయం తీసుకున్నా మొదట తెలిసేది కార్పొరేట్‌ కాలేజీలకే! 

పేపర్‌ సెట్టింగ్‌ నుంచి మొదలు.. 
వేలాది మంది పోటీ పడే ఎంసెట్‌లో ప్రశ్నపత్రాల రూపకల్పన అత్యంత కీలకం. ప్రశ్నపత్రాలకు ఎవరు రూపకల్పన చేయాలన్నది కన్వీనర్‌కు తప్ప మరొకరికి తెలిసే అవకాశం లేదు. అందుకే కార్పొరేట్‌ కాలేజీల ఏజెంట్లు కన్వీనర్‌ కార్యాలయంలోనే తిష్ట వేసేవారు. కన్వీనర్‌ ఎవరితో మాట్లాడుతున్నారు? అవతలి వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఎంత? ఆయన ఏ మెడికల్‌ కాలేజీలో పని చేస్తున్నారు? వంటి విషయాలకు అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నించేవారు. కన్వీనర్‌ ఆఫీసులో మామూలుగా విశ్వసనీయత కలిగిన వారినే నియమిస్తారు. అయినా భారీ స్థాయిలో సొమ్ము ఆశ జూపి వారిని ప్రలోభపెట్టేందుకు యత్నించేవారు.

కన్వీనర్‌ అనేక విషయాలను రహస్యంగా ఉంచాలనుకున్నా కొన్నిసార్లు ఇతర సిబ్బందికి కొన్ని పనులు అప్పగించేవారు. కార్పొరేట్‌ శక్తులు దీన్నే తమకు అనుకూలంగా మలుచుకునేవి. మొదట ప్రశ్నపత్రాలను సెట్‌ చేసేవారిని గుర్తించి, తర్వాత వారి నుంచి ప్రశ్నలు సేకరించడానికి కోట్లలో ఖర్చు చేసేవారని జేఎన్‌టీయూలో పదవీ విరమణ చేసిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఒకరు చెప్పారు. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఆయన జేఎన్‌టీయూలో పని చేసిన సమయంలో తన దృష్టికి వచ్చిన అనేక విషయాలను సీనియర్‌ పోలీసు అధికారి ఒకరికి లేఖ ద్వారా తెలియజేశారు. 

ప్యానల్‌ నుంచి ప్రశ్నలు బయటకు.. 
ప్రశ్నపత్రం రూపొందించేందుకు జేఎన్‌టీయూకు ఒక ప్యానల్‌ ఉంటుంది. ఆ ప్యానల్‌లో ఉన్న వారు రూపొందించే ప్రశ్నల్లో కొన్నింటిని మాత్రమే తీసుకుంటారు. అయితే ప్యానల్‌ తయారు చేసే వెయ్యి ప్రశ్నలు లీక్‌ అయితే చాలు కొంచెం తెలివైన విద్యార్థి 160కి 150కి పైగా మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. దీన్ని కార్పొరేట్‌ కాలేజీలు సొమ్ము చేసుకున్నాయి. ‘‘నాకు తెలిసి ఈ కాలేజీలు పేపర్‌ సెట్టింగ్‌ ప్యానల్‌ నుంచే ప్రశ్నలు సంపాదించేవి. అందుకు కోట్లు ఖర్చు చేసేవారు. గతంలో చాలాసార్లు ఇలా జరిగినా బయటకు రాలేదు. ఒకవేళ ఎవరైనా బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే భారీగా డబ్బు ముట్టజేప్పేవారు’’ అని ఆ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు.

‘‘ఇదేం మామూలు స్కాం కాదు. ఇది ఇప్పుడే జరిగిందని అనుకోవడం కూడా పొరపాటే. ప్యానల్‌ నుంచి ప్రశ్నలు సేకరించడం ఇబ్బంది అనుకున్న ప్రతీసారి వారు ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రశ్నపత్రం సంపాదించేవారు. మెడికల్‌ కోసం భారీగా డబ్బు ఖర్చు చేస్తే, ఇంజనీరింగ్‌ కోసం తక్కువ ఖర్చుతో ప్యానల్‌ నుంచి ప్రశ్నలు అందేవి’’ అని ఆ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వివరించారు. తెలివైన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సహా అన్ని ప్రైవేట్‌ కాలేజీల్లో ఉంటారు. కానీ రెండు కాలేజీలకే ర్యాంక్‌లు ఎందుకు వస్తున్నాయన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదని, పట్టించుకొని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగి ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. 

వారంతా ఆ రెండు కాలేజీల విద్యార్థులే..! 
లీకైన ఎంసెట్‌ ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థులు ఆ రెండు కాలేజీలకు చెందినవారేనని సీఐడీ విచారణలో బయటపడింది. పేపర్‌ లీకేజీలో అరెస్టయిన శ్రీచైతన్య మాజీ డీన్‌ వాసుబాబు, నారాయణ కాలేజీ ఏజెంట్‌ శివనారాయణలను విచారిస్తున్న సీఐడీ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులు 136 మంది విద్యార్థులను విచారించారు. వీరిలో 86 మంది ఒక కార్పొరేట్‌ కాలేజీకి చెందిన వారు కాగా, ఇంకో 28 మంది మరో కార్పొరేట్‌ కాలేజీకి చెందిన వారే! దీంతో స్కాం పూర్తిగా ఈ రెండు కార్పొరేట్‌ సంస్థల కనుసన్నల్లోనే జరిగి ఉంటుందా అన్న కోణంలో సీఐడీ విచారణ వేగవంతం చేస్తోంది. ఈ కేసులో అరెస్టయిన బ్రోకర్లు సైతం ఇదే కార్పొరేట్‌ కాలేజీల్లో చదువుకొని ప్రస్తుతం మెడిసిన్‌ చేస్తుండటం గమనార్హం. 

తెరపైకి మరో 13 మంది బ్రోకర్లు 
ఎంసెట్‌ కేసులో అరెస్టయిన వాసుబాబు, శివ నారాయణ, శ్రీచైతన్య మాజీ విద్యార్థి గణేశ్‌ ప్రసాద్‌ల విచారణలో తెరపైకి మరికొన్ని కొత్త ముఖాలు వచ్చినట్టు సీఐడీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 90 మందిని నిందితులుగా గుర్తించిన దర్యాప్తు అధికారులు తాజాగా మరో 13 మంది బ్రోకర్లు కూడా స్కాంలో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. వీరు రెండు కార్పొరేట్‌ కాలేజీలకు చెందిన విద్యార్థులను బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, భువనేశ్వర్, పుణె క్యాంపులకు తరలించి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. అటు డాక్టర్‌ ధనుంజయ్, సందీప్‌లకు ప్రశ్నపత్రం ఇచ్చిన బ్రోకర్ల లింకుపై కూడా క్లారిటీ రావాల్సి ఉందని సీఐడీ అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 13 మంది బ్రోకర్లలో ఎనిమిది మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారేనని, మిగిలిన ఐదుగురిలో ఇద్దరు యూపీ, ఒకరు ఢిల్లీ, మరో ఇద్దరు కర్నాటకకు చెందిన వారున్నారని సీఐడీ అనుమానిస్తోంది. వీరిలో కొందరు స్కాం ప్రధాన సూత్రధారి కమిలేష్‌కుమార్‌ సింగ్‌తో పదేపదే టచ్‌లో ఉన్నారని, అక్కడ్నుంచి వీరి ద్వారానే కార్పొరేట్‌ కాలేజీలకు ప్రశ్నపత్రం అందినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో వాసుబాబు, శివనారాయణ, గణేష్‌ ప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకోవాలని సీఐడీ యోచిస్తోంది. ఈ ముగ్గురిని ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లిలోని సీఐడీ ప్రత్యేక కోర్టులో దర్యాప్తు అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. రెండు రోజుల్లో ఈ పిటీషన్‌పై వాదనలు జరుగనున్నాయని తెలిసింది. మొత్తంగా చార్జిషీట్‌ దాఖలుకు రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement