హైదరాబాద్, సాక్షి: సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ మెస్‌లో చట్నీలో ఎలుక ఘటన మరువక ముందే.. హైదరాబాద్ జేఎన్టీయూ మెస్‌లో పిల్లి ఆహారాన్ని ముట్టినట్లు ఓ వీడియో చక్కర్లు కొట్టింది. ఇది మీడియాకు ఎక్కడంతో.. జేఎన్టీయూ అధికారులు ఘటనపై విచారణ జరుపుతున్నారు. అయితే ఈ ఘటనపై అనుమానాలు ఉన్నాయని, ఇది ఎవరో కావాలని చేసిన పని అయ్యి ఉంటుందని ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి అంటున్నారు.
‘‘నిజానికి హాస్టల్‌లో కిటికీ తెరిచిన కారణంగానే పిల్లి లోపలికి వచ్చింది. ఒకవేళ పిల్లి వచ్చినా.. తినే టైంలో అక్కడ విద్యార్థులు, స్టాఫ్ ఉంటారు కాబట్టి భోజనం దగ్గరకు అవి వచ్చే అవకాశం ఉండదు. విద్యార్థులు భోజనం చేశాకే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ వీడియో తీసి ఉంటారు. లేకుంటే.. వార్డెన్‌కో, ప్రిన్సిపాల్‌కో ఫిర్యాదు చేయకుండా నేరుగా నెట్‌లో పెడతారా?. సోషల్ మీడియా ప్రచారాల కోసమే అలా చేసి ఉంటారని భావిస్తున్నాం. ఘటనపై విచారణ చేస్తున్నాం. బాధ్యులెవరైనా సరే చర్యలు మాత్రం కఠినంగా ఉంటాయి అని ప్రిన్సిపాల్ అన్నారు.
జేఎన్‌టీయూ కళాశాల మంజీరా వసతిగృహం భోజనశాలలోని ఆహార పదార్థాల గిన్నెల్లో పిల్లి మూతి పెట్టిన దృశ్యాలు ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఈ అంశంపై పరిశీలన కోసం కూకట్‌పల్లి గవర్నమెంట్ ఫుడ్ వెరిఫికేషన్ కమిటీ అధికారులు హాస్టల్లో పరిశీలనలు జరిపారు. ఎలాంటి వంటకాలను పిల్లి ముట్టుకోలేదని ప్రకటించారు. అయితే..
వంటగది, నిత్యావసరాల స్టోర్‌రూమ్‌ను తనిఖీ చేయగా.. అపరిశుభ్రంగా నీరు నిలిచి ఉండడాన్ని గమనించారు. కొన్ని కూరగాయలు పాడైపోవడంతో పారబోయించారు. వంటపాత్రలపై మూతలు, కిటికీలకు మెష్‌లు లేవు. కేర్‌టేకర్లు మెస్‌లో 24గంటలూ ఉండాలన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నామని, వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలుంటాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment