‘కార్పొరేటు’ సేవలో ఇంటర్‌ బోర్డు! | Criticisms on Intermediate board | Sakshi
Sakshi News home page

‘కార్పొరేటు’ సేవలో ఇంటర్‌ బోర్డు!

Published Mon, Jul 30 2018 12:57 AM | Last Updated on Mon, Jul 30 2018 2:04 AM

Criticisms on Intermediate board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల సేవలో ఇంటర్మీడియెట్‌ బోర్డు తరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది బోర్డు అధికారులు కార్పొరేట్‌ కాలేజీలకు తొత్తులుగా మారారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే అనేక మినహాయింపులను బోర్డు ఇస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అయినా సంతృప్తి చెందని సదరు యాజమాన్యాలు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు బోర్డు అధికారులపై ఇంకా ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. కాలేజీల అనుబంధ గుర్తింపు వ్యవహారంలో బోర్డు తీరుపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తినా పట్టించుకోని అధికారులు..  హాస్టళ్ల గుర్తింపు విషయంలోనూ అదే ధోరణి తో వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.  

50 కాలేజీలే దరఖాస్తు: రాష్ట్రంలో 600 వరకు కాలేజీల్లో విద్యార్థులకు హాస్టళ్లు ఉండగా, అందులో రెండుసార్లు అవకాశం ఇచ్చినా 50 లోపు కాలేజీలే దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా హాస్టళ్ల ఇన్‌స్పెక్షన్‌ ఫీజు, అనుమతి ఫీజు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విషయంలో ఓ విధానం అంటూ లేకుండా, శాస్త్రీయ అంచనాలు లేకుండా, యాజమాన్యాల ఒత్తిడికి ఇంటర్‌ బోర్డు తలొగ్గుతూనే ఉంది. ఆ ఫీజుల విషయంలో యాజమాన్యాల డిమాండ్లకు ఇప్పటికే ఓసారి తలొగ్గిన బోర్డు మరోసారి తలొగ్గి ఫీజులను భారీగా తగ్గించింది. అయినా ఫీజులను ఇంకా తగ్గిస్తేనే తాము కోర్టులో ఉన్న కేసును విత్‌డ్రా చేసుకుంటామంటూ ఒత్తిడి చేస్తుండటంతో ఏం చేయా లో తెలియని గందరగోళంలో బోర్డు పడింది.

నెలాఖరుకు ముగియనున్న గడువు
రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీల హాస్టళ్లలో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. వాటిలో సరైన సదుపాయాలు ఉండేలా చేసేందుకు, వాటిని గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. హాస్టళ్లను బోర్డు పరిధిలోకి తెచ్చి నియంత్రించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు ఇన్‌స్పెక్షన్, అనుమతి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఫీజులను నిర్ణయించారు.

అంత మొత్తం తాము చెల్లించబోమంటూ యాజమాన్యాలు మొండికేయడం, పైగా బోర్డుకు ఆ అధికారం లేదంటూ కోర్టును ఆశ్రయించడంతో ఫీజులను తగ్గించాల్సి వచ్చి ంది. ఆ తగ్గింపు కూడా సరిపోదని, మరింత గా తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. ఆ మేరకు తాజాగా కూడా ఫీజులను తగ్గించినా.. హాస్టళ్ల గుర్తింపు కోసం కాలేజీలు దరఖాస్తు చేసుకోవడం లేదు.

మరింతగా తగ్గించాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. కాలేజీల హాస్టళ్లకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు ఈనెల 6 నుంచి అవకాశం కల్పించింది. కానీ ఇప్పటివరకు పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 20తోనే దరఖాస్తు గడువు ముగియగా, రూ.5 వేల ఆలస్య రుసుముతో బుధవారంతో గడువు ముగిసింది. రూ.10 వేల ఆలస్య రుసుముతో ఈనెల 31తో గడువు ముగియనుంది.

ఇంకా తగ్గించాల్సిందే..
ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను భారీగా తగ్గించినా ఇంకా తగ్గించాలంటూ యాజమాన్యాలు పట్టుపడుతున్నాయి. 200 మంది వరకు ఉంటే రూ.లక్ష, 201 నుంచి 500 లోపు ఉంటే రూ.2 లక్షలు, 501 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.3 లక్షలు మాత్రమే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా చెల్లిస్తామని పట్టుపడుతున్నాయి.
కార్పొరేషన్‌ పరిధిలో ఇన్‌స్పెక్షన్‌ ఫీజు ఏటా రూ.80 వేలుగా, అనుమతి ఫీజు రూ.లక్షగా ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. యాజమాన్యాల డిమాండ్‌ మేరకు తర్వాత వరుసగా రూ.55 వేలు, రూ.65 వేలకు తగ్గించింది. అయినా యాజమాన్యాలు ఒప్పుకోకపోవడంతో తాజాగా ఇన్‌స్పెక్షన్‌కు రూ.30 వేలుగా, అను మతికి రూ.40 వేలు ఫీజుగా నిర్ణయించింది. అయినా తగ్గించాలని, ఇన్‌స్పెక్షన్‌కు రూ.25 వేలు, అనుమతి ఫీజు రూ.30 వేలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొదట ఇన్‌స్పెక్షన్‌కు రూ.60 వేలు, అనుమతి ఫీజు రూ.80 వేలు ఉండగా తర్వాత దాన్ని రూ.40 వేలు, రూ.50 వేలకు బోర్డు తగ్గించింది. తాజాగా ఇన్‌స్పెక్షన్‌కు రూ.25 వేలు, అనుమతికి రూ.30 వేలుగా నిర్ణయించింది. వాటిని వరుసగా రూ.20 వేలు, రూ.25 వేలుగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
గ్రామ పంచాయతీల్లో ఇన్‌స్పెక్షన్‌కు రూ.50 వేలు, అనుమతికి రూ.60 వేలుగా నిర్ణయించగా తర్వాత ఇన్‌స్పెక్షన్‌కు రూ.30 వేలు, అనుమతికి రూ.40 వేలకు తగ్గించింది. తాజా గా ఇన్‌స్పెక్షన్‌కు రూ.20 వేలుగా, అనుమతి ఫీ జు రూ.25 వేలుగా నిర్ణయించింది.  వాటిని రూ.10 వేలు, రూ.15 వేలకు తగ్గించాలని యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement