హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు ఉద్యోగి. ఆయన కుమారుడు ధీరజ్ ఓ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ధీరజ్‌ను ఇంటర్మీడియట్‌లో చేర్చేందుకు శ్రీనివాస్ ఎల్‌బీనగర్ వైపున్న ఓ కార్పొరేట్ కాలేజీని (రెసిడెన్షియల్) సంప్రదించారు. ఏడాదికి రూ.2.10 లక్షల ఫీజు అని చెప్పడంతో నోరెళ్లబెట్టాడు. చేసేదేం లేక సమీపంలోని మరో కార్పొరేట్ యాజమాన్యానికి చెందిన కాలేజీలో సంప్రదించారు. అక్కడ ఏడాదికి రూ.2.20 లక్షలని చెప్పడంతో అవాక్కయ్యారు. డిసెంబర్, జనవరి సమయంలోనే వస్తే రూ.1.90 లక్షలకే సీటు ఇచ్చేవారమని, ఇప్పుడు సీట్లు నిండిపోతుండటంతో ఫీజు పెరిగిందని సదరు కళాశాలల సిబ్బంది చెప్పడం గమనార్హం.
కరీంనగర్ జిల్లాకు చెందిన సుబ్రమణ్యం సింగరేణిలో చిన్న ఉద్యోగి. తన కుమార్తె మీనాక్షి కోసం షామీర్‌పేట ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో సంప్రదించగా.. ఫస్టియర్‌కు రూ.2.40 లక్షలు, సెకండియర్‌కు రూ.2.60 లక్షలు ఫీజు ఉందని చెప్పారు. ఆలోచించుకొని రెండు రోజుల్లో వస్తానని సుబ్రమణ్యం చెప్పివచ్చారు. రెండు రోజుల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లేసరికి సీట్లు లేవన్నారు. వస్తానని చెప్పాను కదా ఎలాగైనా సీటు కావాలని కోరగా.. సిబ్బంది సార్‌తో మాట్లాడతామని చెప్పి వెళ్లారు. కాసేపటికి వచ్చి ఫస్టియర్‌కు రూ.2.60 లక్షలు, సెకండియర్‌కు రూ.2.80 లక్షలు ఫీజుకు ఓకే అంటే సీటు ఇస్తామని తెగేసి చెప్పారు.
-సాక్షి ప్రతినిధి, నల్లగొండ
.. ఇది ఆ రెండు, మూడు కాలేజీల్లోనో, ఇద్దరు ముగ్గురు తల్లిదండ్రుల పరిస్థితి మాత్రమేనో కాదు.. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్, ప్రముఖ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజుల బాగోతం, లక్షల కొద్దీ ఫీజులు కట్టడం కోసం సతమతం అవుతున్న తల్లిదండ్రుల ఆందోళన.
ఆశనే బలహీనతగా మార్చుకొని..
ఫలానా కాలేజీలోని ఫలానా బ్రాంచీలో ఇంటర్మీడియట్ చదివిస్తే జేఈఈలో, ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వస్తాయని.. తద్వారా బీటెక్ సీటు మంచి కాలేజీలో వస్తుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్, ప్రముఖ ప్రైవేటు కాలేజీల్లో చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆశను కాలేజీలు సొమ్ము చేసుకుంటున్నాయి. నోటికే వచ్చిందే ఫీజు అన్నట్టుగా అడ్డగోలుగా నిర్ణయించి, రూ.10వేలు అడ్వాన్స్‌గా తీసుకొని రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నాయి. అసలు పదో తరగతి పరీక్షలైనా జరగకముందే.. సీట్లు అయిపోతున్నాయంటూ తల్లిదండ్రులను ఆందోళనలోకి నెట్టేసి, అధిక ఫీజులను దండుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అడిగేవారు లేరని, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడమే లేదని విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్ పరిసరాల్లోనే అత్యధిక కాలేజీలు
రాష్ట్ర ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ శాఖల పరిధిలోని 850 వరకు ఉన్న గురుకుల కాలేజీలతోపాటు 1,550 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ఐదు కార్పొరేట్, ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన కాలేజీలే 300 వరకు ఉండగా.. వీటిలో 220 కాలేజీల దాకా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఏటా ఇంటర్ చదివే దాదాపు 5లక్షల మంది విద్యార్థుల్లో సగం మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఆయా కాలేజీల్లో చదివిస్తే తమ పిల్లలకు మంచి చదువు వస్తుందని, మంచి ర్యాంకు వస్తుందన్న ఆశలతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు.
ఫీజు విధానం ఊసే లేక..
ఇంటర్ బోర్డు నిర్ణీత ఫీజుల విధానాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ వ్యవస్థ ఏర్పాటైనప్పుడు నిర్ణయించిన ఫీజు రూ.3 వేలలోపే. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం సాధారణ ప్రైవేటు కాలేజీలు స్థాయిని బట్టి రూ.20 వేల వరకు వసూలు చేస్తుండగా.. కార్పొరేట్ కాలేజీలు హాస్టల్ వసతి కలుపుకొని రూ.1.50 లక్షల నుంచి రూ.2.70 లక్షలవరకు తీసుకుంటున్నాయి. 2009లో లవ్ అగర్వాల్ ఇంటర్ విద్య కమిషనర్‌గా ఉన్న సమయంలో ఫీజుల విధానానికి చర్యలు చేపట్టినా ముందుకు సాగలేదు. 2013లో ఐఏఎస్ అధికారి జేఎస్‌వీ ప్రసాద్ కమిటీ.. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా రూ.3,500, పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా రూ.6,500 ఫీజు నిర్ణయించాలని సూచించింది. ఆ సిఫార్సులు ఆచరణలోకి రాలేదు. తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ కూడా ఇంటర్మీడియట్ ఫీజుల విధానాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వానికి నివేదించినా స్పందన లేదు.
Comments
Please login to add a commentAdd a comment