విద్య వ్యాపారమైపోయింది. డిస్కౌంట్లు.. ఆఫర్లు.. ఇలా రకరకాల ప్రలోభాలతో విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలు గాలం వేస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునుపే తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాయి. బాగా చదివే విద్యార్థుల వివరాలు కనుక్కొని వారి తల్లిదండ్రుల చుట్టూ యాజమాన్యాలు తిరుగుతున్నాయి. కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోయినా అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయి.
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: జిల్లాలో గత ఏడాది ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పది విద్యార్థుల ఫలితాల శాతం బాగా మెరుగయ్యింది. ఈ ఏడాది సైతం ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని మెరికల్లాంటి విద్యార్థులను వలలో వేసుకునేందుకు ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ మేరకు పీఆర్‌వోలను రంగంలోకి దింపాయి.
వారి ద్వారా ఆయా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల సబ్జక్టు టీచర్లతో పాటు పలువురు హెచ్‌ఎంలనూ ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఒక్కో విద్యార్థికి రూ.2వేల నుంచి రూ.4వేల వరకు నజరానా ప్రకటిస్తున్నాయి. పీఆర్‌వోలతో పాటు ఆయా ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లు సైతం విద్యార్థుల వేటలో పడ్డారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు తీసుకుని కలుస్తున్నారు. తమ కళాశాల గొప్పతనమిదంటూ మాయమాటలు చెబుతున్నాయి. ఇప్పుడే సీటు రిజర్వు చేసుకుంటే అడ్మిషన్ సమయంలో ఫీజు రూ.5వేల నుంచి రూ.10వేల దాకా తగ్గుతుందని బుకాయిస్తున్నారు. డే స్కాలర్‌కింత, రెసిడెన్సియల్‌కు అయితే ఇంత అంటూ రేట్లను వివరించి బుట్టలో వేసుకుంటున్నాయి. దీంతో కాస్త ఆర్థిక స్తోమత ఉండే విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులను చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రైవేటులో కనీస వసతులు కరువు
జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో 90 శాతం ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న కళాశాలు వారికి సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మంచి మార్కులు, ర్యాంకుల పేరుతో విద్యార్థులను తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి.
జిల్లాలోని ఏ ఒక్క కాలేజీల్లో క్రీడల ఊసేలేదు. ప్రభుత్వ ఆటస్థలాలనే క్రీడామైదానాలుగా చూపుతూ అనుమతులు తెచ్చుకుంటున్నాయి. విశాలమైన ప్రాంగణాలలో క ళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అపార్ట్‌మెంట్ వంటి భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ సబ్జక్టులకు విడివిడిగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికశాతం కాలేజీలో అన్నీ ఒకే చోట నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ల్యాబ్‌ల్లో విద్యార్థులచే ప్రాక్టికల్స్ నిర్వహించాలి. విద్యాసంవత్సరం మొత్తంగా థియరీకి ప్రాధాన్యం ఇస్తూ పరీక్షల ముందు మాత్రమే ప్రాక్టికల్స్ చేయిస్తున్నాయి. ఈ కారణంగా విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై కనీస అవగాహన ఉండటం లేదు.
భారీ ఫీజు వసూలుకు రంగం సిద్ధం
ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో భారీగా ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ గ్రూపులకు డిమాండ్ అధికంగా ఉంది. బైపీసీ చేస్తే డాక్టర్ అవుతారని, ఎంపీసీ చేస్తే ఐఐటీ ర్యాంకుతో ఇంజనీరై లక్షలాది రూపాయలు సంపాదించవచ్చని, ఎంఈసీ చేస్తే సీఏగా మారి కంపెనీలకు వెన్నుదన్నుగా ఉండేలా మారతారని ఆయా కాలేజీలు ఊదరగొడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వారి కళాశాలల్లో వచ్చిన ర్యాంకులను చూపుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నాయి. గత సంవత్సరం కార్పొరేట్ కాలేజీల్లో డే స్కాలర్‌కు బైపీసీ, ఎంపీసీ గ్రూపులకు రూ.28వేల నుంచి రూ.35వేల వరకు వసూలు చేశారు. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.30వేల నుంచి రూ.40వేలకు పెంచారు. ఇక రెసిడెన్సియల్(హాస్టల్) విద్యార్థులకైతే రూ.60వేల నుంచి రూ.70వేల వరకు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఎంసెట్, ఏఐఈఈఈ, ఐఐటిలకు కేవలం కొన్ని కార్పొరేట్ కాలేజీలు మాత్రమే కోచింగ్ ఇస్తున్నాయి. అడ్మిషన్ సమయంలోనే ఈ కోచింగ్‌కు కలిపి ఫీజులు వసూలు చేస్తున్నా పరీక్ష ప్రారంభంలో షార్ట్‌టర్మ్ కోచింగ్ అంటూ మరో రూ.5వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.
అనుమతి లేకున్నా హాస్టల్ నిర్వహణ
రెసిడెన్సియల్(హాస్టల్) విధానంలో ఇంటర్ మీడియట్ బోధించేందుకు జిల్లాలోని ఏ ఒక్క కాలేజికి అనుమతి లేదు. అయినా హాస్టల్ పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలే కాదు స్థానిక ప్రైవేటు కాలేజీలు సైతం ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఇంటిని మరిపించే భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఊదరగొట్టే ప్రకటనలు ఇచ్చే కళాశాలలు తీరా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోతున్నాయి.
రండిబాబు.. రండి!
Published Sat, Feb 22 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 3:57 AM
Advertisement
Advertisement