‘ఇస్కాన్’కు ఇవ్వాల్సిందే! | iskcon | Sakshi
Sakshi News home page

‘ఇస్కాన్’కు ఇవ్వాల్సిందే!

Published Sun, Feb 15 2015 3:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

iskcon

సాక్షి ప్రతినిధి, కర్నూలు: మధ్యాహ్న భోజన నిర్వహణ పథకాన్ని ఇస్కాన్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న నిర్వాహకులను కాదని ఇస్కాన్ సంస్థకు అప్పగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులపై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇస్కాన్‌కు అప్పగిస్తే బాగుంటుందంటూ ఒక నివేదికను పంపించాలంటూ.. దస్త్రాన్ని సిద్ధం చేయాలంటూ సదరు విద్యాశాఖ అధికారిపై రోజువారీగా ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోవైపు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా తప్పించే ఎత్తుగడలు జరుగుతున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. మొత్తం మీద మధ్యాహ్న భోజన నిర్వాహకుల పొట్ట కొట్టేందుకు పథక రచన జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  
 
 3 వేల మంది పొట్టకొట్టే ప్రయత్నాలు...!
 కర్నూలు జిల్లాలో ప్రస్తుతం స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ఆధ్వర్యంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణ నడుస్తోంది. కర్నూలు జిల్లాలో మొత్తం సుమారు 3 వేల మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు, కార్మికులు ఉన్నారు. వీరికి వాస్తవానికి గత ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కావడం లేదు. అంతేకాకుండా వీరికి ఆరు నెలలుగా వేతనాలు అందడం లేదు. మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం వీరంతా ఇప్పుడు అప్పులు చేసి మరీ విద్యార్థులకు వడ్డించి భోజనం పెడుతున్నారు. కానీ తాజాగా ఇస్కాన్ (అక్షయపాత్ర)కు అప్పగించడం ద్వారా వీరి పొట్టగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఇస్కాన్‌కు ఇస్తే బాగుంటుందనే విధంగా నివేదిక ఇవ్వాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారిపై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు తెస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి మధ్యాహ్న భోజన నిర్వాహకుల కడుపు కొట్టేందుకు వీలుగా భోజనం సరిగ్గా ఉండటం లేదన్న అభిప్రాయాన్ని ప్రభుత్వమే కల్పిస్తోంది. భోజన నిర్వాహకులకు కనీస సౌకర్యాలను ప్రభుత్వం కల్పించలేదు. ఒక గదిని కూడా ప్రభుత్వం నిర్మించి ఇవ్వలేదు. దీంతో ఆరుబయటే వీరంతా వంట చేయాల్సి వస్తోంది. దీనిని సాకుగా చూపెడుతూ.. భోజన నిర్వహణ హైజీనిక్‌గా లేదనే ప్రచారం చేసి.. దీనిని ఇస్కాన్‌కు అప్పగించే కుట్ర జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 సలహాలు అడిగారు
 మధ్యాహ్నా భోజన నిర్వహణ గురించి పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ నుంచి సలహాలు ఇవ్వమని కోరారు. మధ్యాహ్న భోజన నిర్వహణను కేంద్రీకృతం చేస్తే ఎలా ఉంటుందని కోరారు. దీనిపై అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. ఇంకా నివేదిక ఇవ్వలేదు. ఈ అభిప్రాయాలు వచ్చిన వెంటనే నివేదిక అందజేస్తాము. నాపై ఎటువంటి ఒత్తిళ్లు లేవు. దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే.
 - సుప్రకాష్, డీఈవో
 
 కార్మికుల పొట్టగొట్టేందుకే
 అమెరికాకు చెందిన ఇస్కాన్ సంస్థకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోంది. వంటశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినప్పటికీ ఇప్పటివరకు కేవలం 9 శాతం వంటశాలలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా మధ్యాహ్న భోజన నిర్వహణను దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి కాదని అమెరికా సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.                
 - ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం
 (ఏఐటీయూసీ అనుబంధం) జిల్లా అధ్యక్షుడు- పి. మురళీ ధర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement