ఇప్పటివరకు తాత్కాలిక ఉద్యోగుల తొలగింపు చేపట్టిన ప్రభుత్వం దృష్టి ఇప్పుడు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై పడింది. వారిని తొలగించి పథకం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు పరం చేయడానికి నిశ్చయించింది. ఈ మేరకు జిల్లాలోని 15 మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. పూర్తిస్థాయిలో అమలైతే పథకం ద్వారా ఉపాధి పొందుతున్న సుమారు 6వేల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు రోడ్డున పడనున్నారు.
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచడం, విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని గత ప్రభుత్వం నిర్ధేశించింది.పథకం అమలును స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించారు. అయితే నిధులు దుర్వినియోగం అవుతున్నాయనే సాకుతో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ఆందోళనలు చేశారు. ఆందోళనల సమయంలో మాత్రం అలాంటిదేమీ లేదని ప్రకటిస్తూ వచ్చింది. అయితే గతేడాది చివరిలో ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా కేంద్రీయ వంటశాలలు నిర్మించి, ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మొదట్లో ఇస్కాన్ సంస్థకు ఇవ్వాలని నిర్ణయించగా విద్యాశాఖలోని అధికారులు కొందరు ఈ సంస్థను వ్యతిరేకించడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇటీవల ప్రభుత్వం మరోసారి పథకం నిర్వహణకు టెండర్లు అహ్వానించగా ఢిల్లీకి చెందిన ‘‘నవ ప్రయాస’’ అనే సంస్థ జిల్లాలో పథకం నిర్వహణ హక్కులు దక్కించుకుంది. మొదటగా జిల్లాలోని 15 మండలాల్లోని స్కూల్ కాంప్లెక్స్ కేంద్రాల్లో ఐదు చోట్ల కేంద్రీయ వంటశాలలను ఏర్పాటు చేసి, ఆయా స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని 814 పాఠశాలల్లో అమలు చేసేందుకు పైలెటు ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ సైతం పూర్తయ్యింది. త్వరలో పనులు మొదలు పెట్టనున్నారు.
నిర్వాహకులు వ్యతిరేకించినా...
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, మదరసాలు, ఆదర్శ పాఠశాలలు 2,930 ఉన్నాయి. ఇందులో 2,758 వంట ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 6వేల మందికి పైగా కుకింగ్ హెల్పర్స్ పనిచేస్తున్నారు. ఈ పథకానికి సివిల్ సప్లయ్స్ వారు బియ్యం సరఫరా చేస్తున్నారు. వంట చేయడంతో పాటు, ప్రభుత్వం ఇచ్చిన మెనూ పాటించాలి. ఇందుకు ఒక్కో విద్యార్థికి ప్రైమరీలో రూ.6.48, ప్రాథమికోన్నత,ఉన్నత పాఠశాలల్లో రూ.8.53 ప్రకారం ఇస్తున్నారు.
15మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు..
నవ ప్రయాస అనే సంస్థ జిల్లాలోని 15 మండలాల్లో ఐదు చోట్ల కేంద్రీయ వంటశాలలు ఏర్పాటు చేయనుంది. కల్లూరు మండలంలోని పెద్దపాడు బాలికల ఉన్నత పాఠశాల, నంద్యాల మండలం పొలూరు గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, ఎమ్మిగనూరు మండలం సోగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాల(బాలురు), పత్తికొండ మండలం హోసూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, డోన్ మండలంలోని ఉడుములపాడు (ఏపీ మెడల్ స్కూల్)కు సమీపంలో కేంద్రీయ వంటశాలలు నిర్మించేందుకు ఇప్పటికే ఒక్కోచోట 2 ఎకరాల భూమిని సేకరించారు. ఈ వంటశాలల నుంచి 20 కి.మీ. పరిధిలోని స్కూళ్లకు భోజనం సరఫరా చేస్తారు. కర్నూలు మండలంలోని 161 పాఠశాలలు, కల్లూరు మండలం 50 పాఠశాలలు, నంద్యాల అర్బన్, రూరల్ మండలాల పరిధిలోని 120, గడివేముల 37, పాణ్యం 41, ఎమ్మిగనూరు 90, నందవరం 41, పత్తికొండ 44,దేవనకొండ 55, మద్దికెర 26, తుగ్గలి 28, డోన్ 69, క్రిష్ణగిరి 18, వెల్దుర్తి 23, ప్యాపిలి మండల పరిధిలో 11 స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేసి 1,25,492 మంది విద్యార్థులకు వడ్డించనున్నారు. ఇక్కడ విజయవంతమైతే జిల్లా అంతా అమలు చేస్తారు. మొత్తం 814 స్కూళ్లలో 2,140 మంది హెల్పర్స్ ఉపాధి కోల్పోనున్నారు.
మధ్యాహ్న భోజనం‘నవ ప్రయాస’కు అప్పగించనున్నారు
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ఈ ఏడాది నుంచి ‘నవ ప్రయాస’కు అప్పగించనున్నారు. ప్రభుత్వంతో ఇంకా ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. అయితే ఎక్కడ కూడా కుకింగ్ హెల్పర్లను తొలగించడం లేదు. జిల్లాలో మొదట పైలెట్‌గా 814 స్కూళ్లకు ఐదు కేంద్రీయ వంట శాలల నుంచి భోజనాన్ని సరఫరా చేయనున్నారు. రెండు నెలల్లో ప్రైవేటు ఏజెన్సీ ద్వారానే అమలు కానుంది. ఈ లోపు వారు కేంద్రీయ వంటశాలలను ఏర్పాటు చేసుకోవాలి. – తాహెరా సుల్తానా, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment