
రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల పైచిలుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 21 నుంచి నూతన మెనూ అమలవుతుందని వెల్లడించారు. అన్నిచోట్ల ఒకే రకమైన నాణ్యత, రుచి ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మధ్యాహ్న భోజన పథకం అమలులో నాలుగు అంచెలుగా తనిఖీలు ఉంటాయని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల కమిటీ, గ్రామ సచివాలయ సిబ్బంది, సెర్ప్ నుంచి తనిఖీలు ఉంటాయని అన్నారు. నాడు-నేడు, జగనన్న మధ్యాహ్న భోజన పథకం, మౌలిక వసతుల కల్పన ప్రతిష్టాత్మకంగా చేపడుతామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. పులిహోరా,కిచిడి, వేరుశనగ చిక్కీ, గుడ్డు వంటి పౌష్టికాహారం అందిస్తామని మంత్రి అన్నారు.