అక్షరాలా హత్యలే! | special story to Corporate College students suicides | Sakshi
Sakshi News home page

అక్షరాలా హత్యలే!

Published Mon, Oct 16 2017 11:43 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

special  story to Corporate College students suicides - Sakshi

పొట్టలోంచి అక్షరాలను తీసుకుని.. తాడుగా పేని.. ఆ కొసను ఫ్యానుకు, ఈ కొసను గొంతుకు బిగించి పుస్తకాలను ఒక్క తన్ను తన్నేస్తే.. అది సూయిసైడ్‌ ఎలా అవుతుంది?! అక్షరాలు చేసిన హత్య అవుతుంది. అక్షరాలా... హత్య అవుతుంది! ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే పాటను వినే ఉంటారు. ‘నేను పోను అమ్మా..  కార్పోరేట్‌ కాలేజీలకు’ అని ఇప్పుడు పాడుతున్న పిల్లల గోడు ఎవరు వినాలి? ప్రభుత్వాల్లో ఉన్న మంత్రులే చదువు మాఫియాను నడుపుతుంటే... ఈ ‘హత్య’లను ఎవరు ఆపాలి?! ఛీ.. ఈ ఉసురు ఊరికే పోదు. పాపమై చుట్టుకుంటుంది. అమ్మానాన్నలను తప్పెక్కడుందో ఆలోచించమంటుంది.

ఒక చిలుక ఉండేది. చక్కగా పాడేది. స్వేచ్ఛగా ఎగిరేది. కానీ చదవలేకపోయేది. అది రాజుగారి తోటలోని చిలుక. ఓ రోజు అది ఆయన కంట్లో పడింది. వెంటనే మంత్రిని పిలిచి ‘ఎడ్యుకేట్‌ ఇట్‌’ అని ఆదేశించాడు. దాన్ని ఎడ్యుకేట్‌ చేసే బాధ్యతను రాజుగారి మేనల్లు   మీద ఉంచాడు మంత్రి. ఎలా ఆ చిలుకను ఎడ్యుకేట్‌ చెయ్యడం? విద్యావేత్తలు కూర్చొని తీవ్రంగా ఆలోచించారు. చిలక్కి చదువు చెప్పాలంటే.. మొదట అది కుదురుగా ఉండాలి. అంటే.. ఎగరకూడదు. వెంటనే ఒక మంచి పంజరం చేయించారు. చిలకను అందులో కూర్చోబెట్టారు. కోచింగ్‌ ఇవ్వడానికి ఒక పండితుడు వచ్చాడు. చిలకను చూశాడు. ‘ఈ చిలక్కి ఒక పుస్తకం సరిపోదు’ అన్నాడు. గుట్టల కొద్దీ పుస్తకాలు వచ్చేశాయ్‌ గంటల కొద్దీ చదువు మొదలైంది. పంజరం చూడ్డానికి వచ్చిన వాళ్లెవ్వరూ ‘అబ్బ.. భలే చిలక’ అనడం లేదు. ‘అబ్బ ఏం పంజరం!’ అంటున్నారు. లేదంటే.. ‘అబ్బ.. ఎంత చదువు!’ అంటున్నారు. రాజుగారిని మెచ్చుకుంటున్నారు. మంత్రిగారిని ప్రశంసిస్తున్నారు. రాజుగారి మేనల్లుడిని, పంజరం తయారు చేసిన ఆస్థాన కంసాలీని, చదువు చెప్పడానికి వచ్చిన పండితుడిని ‘ఆహా.. ఓహో’ అని కీర్తిస్తున్నారు.

రాజుగారు మంత్రిగారికి మళ్లీ ఒకసారి చెప్పారు.. ఎన్ని లక్షల వరహాలు ఖర్చయినా పర్వాలేదు. చిలక్కి బాగా చదువు రావాలని. మంచి మేనర్స్‌ కూడా రావాలని. ‘అలాగే’ అని లక్షల వరహాలు దఫాలు దఫాలుగా కోశాగారం అకౌంట్‌లోంచి తెప్పించాడు మంత్రిగారు. సెమిస్టర్లు గడుస్తున్నాయి. ఓ రోజు రాజుగారికి చిలకెలా చదువుతోందో చూడాలనిపించింది. వెంటనే ఏర్పాట్లు జరిగాయి. ‘చిలకను చూడ్డానికి రాజుగారో వస్తున్నారహో’ అని తప్పెట్లు, తాళాలు, పెద్ద శబ్దాలు చేసే బూరలతో ఒకటే హోరు. రాజపరివారం అంతా రాజు కన్నా ముందే చిలక దగ్గరికి చేరుకుంది. అయితే పంజరంలోని చిలకను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ దాని వైపే చూడడం లేదు. పండితుడు ఒక్కడే  చూస్తున్నాడు. ఆయనైనా చిలక సరిగ్గా చదువుతోందా లేదా అని చూస్తున్నాడు తప్ప, చిలకెలా ఉందో చూడ్డం లేదు. చిలక బాగా నీరసించి పోయింది. మానసికంగా బాగా నలిగిపోయి ఉంది. ఆ రోజైతే.. రాజుగారి సందర్శన ధ్వనులకు చిలక సగం చచ్చిపోయింది. తర్వాత కొద్దిరోజులకే పూర్తి ప్రాణం విడిచింది! ఆ సంగతి ఎవరికీ తెలియదు. తెలిసినవాళ్లు ఎవరికీ చెప్పలేదు. ముఖ్యంగా రాజుగారికి చెప్పలేదు.

రాజుగారు మళ్లీ మేనల్లుడిని పిలిచి, ‘చిలక ఎలా చదువుతోంది?’ అని అడిగాడు. ‘చిలక స్టడీస్‌ కంప్లీట్‌ అయ్యాయి’ అన్నాడు మేనల్లుడు. రాజుగారు సంతోషించారు. తన కృషి ఫలించిందన్నమాట. ‘ఇప్పటికీ అల్లరి చిల్లరిగానే ఎగురుతోందా?’ ‘ఎగరదు’ ‘ఏ పాట పడితే ఆ పాట పాడుతోందా?’ ‘పాడదు’ ‘సరే, ఒకసారి చిలకను నా దగ్గరికి తీసుకురా’ తీసుకొచ్చాడు మేనల్లుడు. చిలక నోరు తెరవడం లేదు. ఒక్క మాట కూడా మాట్లాడ్డం లేదు. చిలక కడుపు ఉబ్బెత్తుగా ఉంది. చిలక అసలు కదలనే కదలడం లేదు. ‘‘ఆ కడుపులోనిది ఏమిటీ!’ అని అడిగాడు రాజుగారు. ‘జ్ఞానం మామయ్యా’ అని చెప్పాడు మేనల్లుడు.‘చిలక చనిపోయినట్లు ఉంది కదా’ అన్నారు రాజుగారు. చిలక చదివిందా లేదా అన్నదే నా బాధ్యత. చచ్చిందా బతికిందా అని కాదు అన్నట్లు చూశాడు రాజుగారి మేనల్లుడు. నూరేళ్ల క్రితం విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన చిలక కథ ఇది. కథ పేరు ‘చిలక చచ్చిపోయింది’.

ఇప్పుడు ఇంకో చిలక కథ. ఈ కథ పేరు ‘చిలక పారిపోయింది’. పారిపోయిన చిలక పేరు సాయి ప్రజ్వల. ఆ చిలకను ఉంచిన పంజరం పేరు..‘నారాయణ కాలేజ్‌’. పంజరంలోంచి ఎగిరి పోతూ పోతూ ప్రజ్వల ఒక లేఖ కూడా రాసింది. ‘... సారీ మమ్మీ.. సారీ డాడీ.. ఐ మిస్‌ యు సో మచ్‌. నా కోసం వెతకొద్దు ప్లీజ్‌. నారాయణ కాలేజ్‌ కిల్లింగ్‌ ద స్టూడెంట్‌. సో ప్లీజ్‌ హెల్ప్‌ ద స్టూడెంట్స్‌. దే ఆర్‌ సఫరింగ్‌ ఇన్‌ దిస్‌ కాలేజ్‌..’ సాయి ప్రజ్వల అమ్మానాన్నల గురించే కాదు, మిగతా అమ్మాయిల గురించి కూడా ఆలోచించింది. అమ్మానాన్నలే పిల్లల గురించి ఆలోచించడం లేదు. ఆలోచించి ఉంటే.. ఈ మూడేళ్లలో ఇప్పటివరకు 60 మంది కార్పోరేట్‌ కాలేజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉండేవారా?

ఎక్కడైతే భయం ఉండదో.. అక్కడ చైతన్యం వెల్లివిరుస్తుందన్నాడు విశ్వకవి టాగోర్‌. అందుకే ఆయన శాంతినికేతన్‌ పెట్టి చదువు చెప్పారు. కార్పోరేట్‌ కాలేజీలు ఇందుకు రివర్స్‌లో ఉన్నాయి. చైతన్యం వెల్లివిరియడం కోసం విద్యార్థులను భయపెట్టి మరీ చదివిస్తున్నాయి. సరస్వతీదేవిని వాళ్ల అమ్మానాన్న భూమ్మీదికి తీసుకొచ్చి వీళ్లకు అప్పగించి వెళ్లలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఉంటే అమెకూ.. ‘సరస్వతీ నమస్తుభ్యం’ స్తోత్రంతో కాకుండా.. ఫిజిక్సు, మేథ్స్, కెమిస్ట్రీలతో మేల్కొలుపు పాడేవారు. మేల్కొలుపా?! అసలు ఆమెను నిద్రపోనిచ్చేవారే కాదేమో! ‘నువ్వు నిద్రపోతే, పిల్లలకూ నిద్రవచ్చేస్తుంది కూర్చో’ అని ఏ లెక్చరర్‌ కమ్‌ వార్డెనో కర్ర పట్టుకుని ఆమె ఎదురుగా నిలుచునేవాడేమో! సాయి ప్రజ్వల కరీంనగర్‌ జిల్లా అమ్మాయి. హైదరాబాద్‌లోని బండ్ల గూడ నారాయణ కాలేజ్‌లో బైపీసీ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. కాలేజి స్ట్రెస్‌ను తట్టుకోలేకపోతున్నానని కొద్ది రోజుల క్రితమే తల్లిదండ్రులకు ఉత్తరం కూడా రాసింది. ఈ విషయం ఆదివారం బయటికి వచ్చింది. ఈ మధ్య ఇలాగే కడప నారాయణ కాలేజీలో పావన అనే విద్యార్థిని స్ట్రెస్‌తో ఆత్మహత్య చేసుకుంది. గత పదిరోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 8 మంది కార్పొరేట్‌ కళాశాలల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. స్టడీతో స్ట్రెస్, స్టడీ అవర్స్‌తో స్ట్రెస్‌. కాలకృత్యాలు కూడా తీర్చుకునే టైమ్‌ దొరక్క స్ట్రెస్‌. ఇవే కాదు.. ఫుడ్డు బాగుండదు, ఉండే గదులు బాగుండవు. వారానికో, నెలకో వచ్చే అమ్మానాన్నలతో నింపాదిగా మాట్లాడే వీలుండదు. మరెందుకు పిల్లల్ని చేర్పిస్తున్నారు? మంచి భవిష్యత్తు కోసం. ‘మంచి భవిష్యత్తు కోసం అయితే ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా?’ అన్నది కాలేజీ యాజమాన్యాల వాదన.  ‘నిజానికి బాగా చదవమని మేము పెట్టే స్ట్రెస్‌ కన్నా, చదివించడానికి మేము పడే స్ట్రెస్సే ఎక్కువ’ అనే కాలేజీలూ ఉన్నాయి.

ఎవరి వాదన ఎలా ఉన్నా.. చదువు కన్నా ప్రాణం ముఖ్యమైనది. కేవలం చదువుల ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారంటే మన చదువుల విధానాలు ఎంత క్రూరంగా ఉన్నాయో ప్రతి తల్లీతండ్రీ ఆలోచించాలి. ఇటీవలి కాలంలోనే నారాయణ, చైతన్య, ఎన్‌.ఆర్‌.ఐ. ఇంకా ఇతర కార్పోరేట్‌ కళాశాలల్లో  45 మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ పిల్లల తల్లిదండ్రుల వేదన.. శోక సముద్రపు ఉప్పెన.   లక్షలు ఖర్చుపెట్టి కార్పోరేట్‌ కాలేజీలలో చేర్పించేది పిల్లల కోసమే కావచ్చు. పిల్లలకు ఇష్టం లేకుండా చేర్పించి, ఆ ఒత్తిడిని భరించలేక వారు ఆత్మహత్య చేసుకుంటే లక్షలు కాదు, ఎన్ని కోట్లు పోసినా వారిని తెచ్చుకోలేం.

డియర్‌ పేరెంట్స్‌.. ‘అమ్మా నేను వచ్చేస్తా’ అని ఫోన్‌ చేస్తే, ‘నాన్నా నన్ను తీసుకెళ్లు’ అని ఉత్తరం రాస్తే ‘కష్టపడరా బంగారం’ అనకండి. వారికి కష్టమేంటో అడిగి తెలుసుకోండి. అప్పుడు మీకు కడుపుకోత ఉండదు. మన చిలకలు పారిపోవు. మన చిలకలు చచ్చిపోవు.
 

తల్లిదండ్రులూ... ఇవి గుర్తుంచుకోండి...
పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. వారు ఓపెన్‌ అయి మాట్లాడేందుకు ఆస్కారమివ్వాలి. పిల్లల వైపు వాదననూ, వారు చెప్పేది వినే ఓపిక కలిగి ఉండాలి. ఈ మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితం కాదనే ఆలోచనను వారిలో ఎప్పుడూ కలిగిస్తూ ఉండాలి. వారిని మార్కులు, ర్యాంకుల దిశగా పరిగెత్తించకూడదు. ఇష్టపడి చదివేలా చేయాలి. హార్డ్‌వర్క్‌ కూడా ఇష్టంగా చేసేలా వారిని ప్రోత్సహించాలి. అలా స్ఫూర్తినింపాలి తప్ప... హార్డ్‌వర్క్‌ చేయాలంటూ ఒత్తిడి చేయకూడదు. వారి అపజయాలకు ఎప్పుడూ వారిని అవమానించకూడదు. చిన్నబుచ్చకూడదు. ఈసారి కాకపోతే మరోసారి ఉత్తీర్ణత సాధించగలమనే భరోసా నింపాలి. హాయిగా ఆడుకోవడానికి, వినోదం పొందడానికి అవకాశం ఇవ్వాలి. చదువుకోవాలంటూ లేకపోతే జీవితంలో వెనకబడిపోతారంటూ బెదిరించడం, మీరు చదవకపోతే మేము చచ్చిపోతామంటూ తల్లిదండ్రులు ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి ధోరణులు సరికాదు.  పిల్లలు తల్లిదండ్రులతో ఏదైనా చెప్పబోతుంటే, వారు చెప్పే అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ... తాము చెప్పేదానికంటే, తమ లెక్చరర్లు చెప్పేదానికే తమ తల్లిదండ్రులు ప్రాధాన్యమిస్తున్నారనే ఆలోచనను పిల్లల్లో కలిగించేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండకూడదు.

►జీవితం ఎంతో విలువైనదనీ, ఈ మార్కులు, ర్యాంకులూ జీవితం ముందు చాలా చిన్నవనే ఆలోచన పిల్లల్లో నింపేలా తల్లిదండ్రుల ప్రవర్తన ఉండాలి.
►తమ పిల్లల చదువుకంటే తమ పిల్లల నిండు జీవితమే చాలా ప్రధానమని తమ తల్లిదండ్రులు భావిస్తున్నారనే ఆలోచనను తమ పిల్లలకు కలిగేలా తల్లిదండ్రుల మాటలు, చేష్టలు ఉండాలి.
►జీవితంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయనీ, ఎప్పుడూ ఉంటాయని... వాటిలోని దేనిలోనైనా ఉన్నత స్థానం అధిరోహిస్తే చాలనీ, ఒక స్థాయి తర్వాత అన్నీ రంగాల్లోని ఉన్నత స్థానం ఒకేలా  ఉంటుందనే తల్లిదండ్రులు పిల్లలకు చెబుతూ ఉండాలి. ఇక అవకాశాలు కూడా ఒకదాని తర్వాత మరొకటి పరంపరగా వస్తుంటాయనీ, ఫలానా అవకాశం మాత్రమే గొప్పదనే ఆలోచన సరికాదని కూడా తల్లిదండ్రులే పిల్లలకు చెబుతూ ఉండాలి.
►పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చనే కూడదు. ఏ పిల్లవాడికి ఆ పిల్లవాడే ప్రత్యేకం.
►చదువుతోపాటు పిల్లలు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి కావాల్సినవీ చేయాలి. అలా ఉండే పిల్లలే మొదటిర్యాంకునైనా... ఇంకదేన్నైనా సాధించగలరు. ఈ విషయాన్ని అటు కాలేజీల యాజమాన్యాలు, ఇటు పిల్లల తల్లిదండ్రులు గుర్తించాలి. 
– డాక్టర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్,
లూసిడ్‌ డయాగ్నస్టిక్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

 

నూజివీడులో ట్రిపుల్‌ ఐటీలో ఇటీవల మృతిచెందిన సాగిరెడ్డి పూర్ణ లక్ష్మీ నర సింహమూర్తి(16) తల్లి సత్యవతి, బం«ధువు (రాజోలు, తూర్పు గోదావరి జిల్లా)

విజయవాడ శ్రీచైతన్యలో ఈ నెల 12న మృతిచెందిన అరమాటి భార్గవ రెడ్డి తల్లిదండ్రులు నారాయణ రెడ్డి, మల్లమ్మ, చిన్న కుమారుడు భానుప్రసాద్‌ రెడ్డి (రాయచోటి, వైఎస్‌ఆర్‌ జిల్లా)

నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ఈ నెల 14న ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని డబ్బాడ రమాదేవి తల్లిదండ్రులు వరలక్ష్మి, అప్పలనాయుడు (రేగిడి, శ్రీకాకుళం జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement