కార్పొ‘రేటు’.. 'తల్లిదండ్రులకు పోటు' | Colleges charge fees that are heavily In Corporate Colleges | Sakshi
Sakshi News home page

కార్పొ‘రేటు’.. 'తల్లిదండ్రులకు పోటు'

Published Mon, Feb 8 2021 5:30 AM | Last Updated on Mon, Feb 8 2021 5:30 AM

Colleges charge fees that are heavily In Corporate‌ Colleges - Sakshi

నవీన్‌చంద్‌ అనే విద్యార్థి విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీలో 2019–20లో ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌లో చేరాడు. హాస్టల్, కాలేజీ ఫీజులన్నీ కలిపి రూ.1.70 లక్షలు చెల్లించాడు. ఇప్పుడు సెకండియర్‌కు వచ్చేసరికి ఆ ఫీజు రూ.2 లక్షలకు పెరిగింది.

వంశీకృష్ణ విజయవాడలోని ఓ కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థి. గత ఏడాది ఫస్టియర్‌ ఫీజు రూ.1.80 లక్షలు. ఈ ఏడాది సెకండియర్‌లో అది కాస్తా 2.30 లక్షలకు పెరిగింది. లైబ్రరీ, ల్యాబ్, బుక్స్‌ కోసం అదనంగా డబ్బు వసూలు చేశారు. హాస్టల్‌లో ఉండే వారికి దోబీ చార్జీల కింద రూ.7 వేల వరకు వీటికి అదనం.

కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవనప్పుడు ఇంతలా ఫీజులు అన్యాయం అని తల్లిదండ్రులు అడిగితే, నచ్చితేనే మీ పిల్లాడిని ఉంచండి.. లేదంటే తీసుకుపోండి.. అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు తగ్గించమని చెప్పింది కదా.. అంటే మాకు హెడ్డాఫీసు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు కనుక పూర్తి ఫీజు కట్టాల్సిందేనంటూ కాలేజీల సిబ్బంది సమాధానమిస్తున్నారు. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కార్పొరేట్‌ కాలేజీల తీరు విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు.. ఇలా ఎక్కడ చూసినా ఈ కాలేజీల వ్యవహారం ఇదే రీతిలో ఉంది. ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలోని పరిస్థితులపై చేపట్టిన పరిశీలనలో అనేక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్‌ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌ విభాగానికి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నందున గత ఏడాది ఫీజులను 30 శాతం మేర తగ్గించి, మిగతా మొత్తం మాత్రమే ఈ ఏడాది వసూలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా ప్రయివేటు కార్పొరేట్‌ కాలేజీలు దీన్ని అమలు చేయడం లేదని కమిషన్‌ సభ్యుల పరిశీలనలో తేలింది. ఫీజులు తగ్గించకపోగా కొన్ని కాలేజీలు గత ఏడాది కన్నా భారీగా పెంచి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్ని ఫీజులు పెంచి ఆపై 30 శాతం తగ్గిస్తున్నట్లు డ్రామాలకు తెర తీశాయి. కొన్ని ఏడాదికి కొంత మంది నుంచి 1.50 లక్షలు తీసుకొంటే, మరికొంత మంది నుంచి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలైతే రెండేళ్లకు కలిపి రూ.5 లక్షలు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందని కమిషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ విజయ శారదా రెడ్డి వెల్లడించారు.

వసూళ్లకు లెక్కాపత్రాల్లేవు 
► ఆయా కార్పొరేట్‌ కాలేజీలు వసూలు చేస్తున్న ఫీజులకు ఎక్కడా లెక్క పత్రాలు, ఫీజుల వివరాలు, అకౌంట్సు బుక్స్‌ ఆ విద్యా సంస్థల్లో ఉండడం లేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా, ఆ ఫీజులో దేనికెంత అనే వివరాలు లేవు. 
► ఆయా సంస్థల్లో పరిశీలనకు వెళ్తున్న కమిషన్‌ బృందాలు ఫీజులు, ఇతర వివరాల రికార్డుల గురించి అడిగితే అవన్నీ సెంట్రల్‌ ఆఫీసులో ఉంటాయని, కేవలం తాము అకడమిక్‌ వ్యవహారాలే చూస్తామంటూ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. కమిషన్‌ బృందాలు పరిశీలనకు వచ్చినప్పుడు అకౌంట్సు సిబ్బందిని అందుబాటులో లేకుండా చేస్తూ కార్పొరేట్‌ సంస్థలు ఫీజుల లెక్కలు చూపకుండా తప్పించుకుంటున్నాయి. 
► కరోనా సమయంలో కాలేజీలు, హాస్టళ్లు నడవలేదు. పాఠాల బోధన లేనేలేదు. నిర్వహణ ఖర్చులు కూడా చాలా తగ్గాయి. అయినా సరే కాలేజీలు గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ తరగతుల కోసం ప్రతి విద్యార్థికి నెలకు రూ.10 వేలు ఖర్చంటూ లెక్క చెబుతున్నాయి. ఈ ఏడాదిలో సెకండియర్లోకి వచ్చిన విద్యార్థుల ఫీజులను భారీగా పెంచాయి. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడికి దిగడం, విద్యార్థులను తీసుకుపొమ్మని చెబుతుండడంతో పిల్లల భవిష్యత్తు దెబ్బ తింటుందేమోనన్న ఆందోళనతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోంది.

ల్యాబ్‌లు, లేబ్రరీలు లేకున్నా అదనపు ఫీజులు 
► ఇటీవల కమిషన్‌ బృందాలు వరుసగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని కార్పొరేట్‌ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాయి. కాలేజీల్లో లైబ్రరీ, ల్యాబ్‌ వంటి వసతులు లేకపోయినా వాటి పేరిట అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు తేలింది.
► హాస్టళ్లలో పరిస్థితులు మరీ అధ్వానంగా ఉన్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. అయినా హాస్టల్‌ విద్యార్థుల ఫీజులను భారీగా పెంచారు. గతంలో ఒక్కో గదిలో ఆరుగురు విద్యార్థులను ఉంచే వారమని, ఇప్పుడు ముగ్గురు లేదా నలుగురినే ఉంచుతున్నందున అదనంగా కొంత మొత్తం వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. 
► హాస్టళ్లలో పిల్లలకు సరైన సదుపాయాలు కూడా లేవని కమిషన్‌ తనిఖీల్లో బయట పడింది. పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలు నాసిరకంగా ఉండడంతో వాటిని తినలేక వారు నానా అవస్థలు పడుతున్నారు. మరోపక్క కరోనాతో ఇళ్లలోనే ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా హాస్టల్‌లోని పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నారు. 

ఉదయం నుంచి రాత్రి వరకు రుద్దుడే.. 
► కరోనా సమయంలో ఆన్‌లైన్‌ పాఠాలతో విద్యార్థుల చదువులు తాపీగా సాగాయి. కాలేజీలు, హాస్టళ్లను తెరచిన యాజమాన్యాలు సిలబస్‌ను పూర్తి చేసేందుకు తొందర తొందరగా బోధన సాగిస్తున్నాయి. పిల్లలకు అర్థమవుతోందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదు. 
► ఉదయం ఏడు గంటల నుంచి తరగతులు ప్రారంభించి.. రాత్రి 9 గంటల వరకు పాఠాలు చెబుతున్నారని, లంచ్‌ ఇతర విరామ సమయాలు కొద్ది నిముషాలు కూడా ఉండడం లేదని విద్యార్థులు కమిషన్‌ సభ్యుల దృష్టికి తెచ్చారు. స్టడీ అవర్‌లో కనీసం మూత్ర విసర్జనకూ అనుమతించడం లేదని విద్యార్థులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. కరోనా సమయంలో కార్పొరేట్‌ కాలేజీలు అనేక మంది సిబ్బందిని తొలగించాయి. వారికి వేతనాలు కూడా చెల్లించలేదు. గత్యంతరం లేక వారంతా వేర్వేరు ఉపాధి మార్గాలు వెతుక్కున్నారు. ఇప్పుడు కాలేజీలు తెరచినా వారెవ్వరూ తిరిగి రాక యాజమాన్యాలు అరకొర సిబ్బందితోనే నడిపిస్తున్నాయి. 
► పలు కాలేజీల్లో సరైన బోధనా సిబ్బంది కూడా లేరు. ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ కాకుండా, వారు రూపొందించిన మెటీరియల్‌తో బోధన సాగిస్తున్నాయి. కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికాకుండా వారికి ఆటపాటలు కూడా ఉండాలని ప్రభుత్వం సూచించినా ఏ ఒక్క యాజమాన్యమూ పట్టించుకోవడం లేదు. 
► 30 మంది పట్టే తరగతి గదిలో ఏకంగా 80 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్న దృశ్యాలు అన్ని కార్పొరేట్‌ కాలేజీల్లో మామూలైపోయింది. దీంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement