ఇక యాజమాన్యాలదే బాధ్యత
విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
– నవీన్ మిత్తల్, కాలేజీ విద్య కమిషనర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులను వేధింపులకు గురిచేసే ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం హెచ్చరించింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించడం, శారీరకంగా హింసించడం వంటివి చేసే లెక్చరర్‌ను రాష్ట్రంలోని ఏ కాలేజీలోనూ బోధించకుండా అనర్హుడిగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్య ఘటనల నేపథ్యంలో.. సోమ వారం ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు.
కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీ సతీశ్‌తోపాటు 14 కాలేజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోవడానికి కారణాలు, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో నిబంధనల ఉల్లంఘనలు, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి తదితర అంశాలపై చర్చించారు. వీటిని అదుపు చేయడానికి అనుసరిస్తున్న చర్యలపై కాలేజీల యాజమాన్యాలను అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..
మళ్లీ ఆత్మహత్య ఘటనలు జరగొద్దు..
సమీక్ష సందర్భంగా ప్రైవేటు కాలేజీల తీరుపై నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని, ఆదేశాలను కాలేజీల ప్రతినిధులకు వివరించారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సాత్విక్ ఘటనే ఆఖరిది కావాలి. ఇది పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితిని మీరే పరిష్కరించుకుంటారా? లేకపోతే 33 జిల్లాల అధికారులను రంగంలోకి దించాలంటారా? అధికారులు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అని నవీన్ మిత్తల్ హెచ్చరించారు. ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ చేస్తున్నామంటూ యాజమాన్య ప్రతినిధులు చెప్పడాన్ని మిత్తల్ తోసిపుచ్చారని.. వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారని తెలిసింది.
గీత దాటితే వేటే..
ప్రైవేటు కాలేజీలకు నిబంధనల ఉల్లంఘన అలవాటుగా మారిందని.. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారి బోధన వేరేచోట ఉండటం ఏమిటని నవీన్ మిత్తల్ ప్రశ్నించారు. ఇక మీద ఇలా చేస్తే ట్రెస్‌పాస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాల్సిందేనని, కాలేజీల్లో బోధించే అధ్యాపకుల నాణ్యత ఏమిటో దీనితో తెలుస్తుందని పేర్కొన్నారు.
ఇంటర్ బోర్డు పనీపాటా లేకుండా సమావేశాలు పెడుతుందనే భ్రమల నుంచి కార్పొరేట్ కాలేజీలు బయటపడాలని.. ఇక మీద ఎప్పుడు మీటింగ్‌కు పిలిచినా కాలేజీల ప్రిన్సిపాళ్లు మాత్రమే సమావేశానికి రావాలని తేల్చిచెప్పారు. విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రైవేటు కాలేజీలు ఇస్తున్న ప్రకటనలపైనా ఇక నుంచి పరిశీలన ఉంటుందని తెలిపారు. ర్యాంకు వచ్చిన విద్యార్థిని మూడు చోట్ల చూపించి గొప్పలు చెప్పుకునే విధానాలకు స్వస్తి పలికేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
చైతన్య గుర్తింపు రద్దు: నవీన్ మిత్తల్
కాలేజీల ప్రతినిధులతో సమావేశం అనంతరం నవీన్ మిత్తల్ ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన శ్రీచైతన్య నార్సింగి బ్రాంచి అనుబంధ గుర్తింపు రద్దు చేస్తున్నామని.. దీనిపై మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. విద్యార్థులను దూషించే, హింసించే లెక్చరర్లపై కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని.. తమ దృష్టికి వస్తే సదరు లెక్చరర్లను డీబార్ చేస్తామని చెప్పారు.
స్టడీ అవర్స్ పేరిట వేధించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. మనోవేదనతో ఉన్న విద్యార్థులను ముందే గుర్తించి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని కాలేజీలకు సూచించామన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, క్రీడలను ప్రోత్సహించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల ఆగడాలను ఇక మీదట ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. గ్రేడింగ్ విధానంపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు.
అరెస్ట్ చేయకుండా చర్చలా?: పీడీఎస్‌యూ
కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కాలేజీల యాజమాన్యాలను అరెస్ట్ చేయకుండా, చర్చలు ఎలా జరుపుతారని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. సోమవారం కాలేజీల యాజమాన్యాలతో భేటీ జరిగిన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వద్ద నిరసనకు దిగారు. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment