నల్లగొండ జిల్లా మునుగోడులో పదేళ్లకు పైబడి కొనసాగిన ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ సొసైటీ మార్పునకు దరఖాస్తు చేసుకుంది. విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యలతో కళాశాల నిర్వహణ బాధ్యతల నుంచి ప్రస్తుత సొసైటీ తప్పుకుంటూ హైదరాబాద్‌లోని మరో సొసైటీకి అప్పగించనుంది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ కాలేజీ ఇకపై హైదరాబాద్‌లో కొనసాగనుంది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ ఫైలు త్వరలో ఆమోదం పొందే అవకాశం ఉంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ సైతం సొసైటీ మార్పునకు దరఖాస్తు చేసుకున్నాయి. జూనియర్ కాలేజీని మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన సొసైటీ పేరిట మార్పునకు దరఖాస్తు సమర్పించగా, డిగ్రీ కాలేజీని హైదరాబాద్ జిల్లాలోని మరో సొసైటీ పేరిట మార్చేందుకు అర్జీ పెట్టుకుంది. మార్పు చేయించుకునే సొసైటీలు ఇప్పటికే పలు కళాశాలలను నిర్వహిస్తుండటంతో ప్రక్రియ వేగవంతంగా పూర్తికానుంది.
సాక్షి, హైదరాబాద్: నిర్వహణభారంతో సతమతమవుతున్న గ్రామీణ ప్రాంత కాలేజీలను వదిలించుకునే దిశగా యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. కోవిడ్–19 వ్యాప్తి మొదలైన తర్వాత ఈ విద్యాసంస్థల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఒకవైపు అడ్మిషన్లు కొనసాగుతున్నా విద్యార్థుల నుంచి ఫీజులు పెద్దగా రాకపోవడం, మరోవైపు ప్రభుత్వం కూడా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు ఇవ్వకపోవడంతో ఆ కాలేజీలు ఆర్థికంగా చితికిపోయాయి.
అనుబంధ గుర్తింపునకు పదిశాతం దూరం...
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న 2,400 ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య తాజాగా 1,680కు పడిపోయింది. ప్రతి ఏటా సగటున 50 నుంచి 100 జూనియర్ కాలేజీలు మూతపడుతున్నట్లు తెలుస్తోంది. 2021–22 విద్యాసంవత్సరంలో కేవలం 1,520 కాలేజీలు మాత్రమే అనుబంధ గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. పదిశాతం కాలేజీలు ఇప్పటికీ అనుబంధ గుర్తింపు కోసం ఫీజు చెల్లించకపోవడం గమనార్హం.
బకాయిల భారం...
201–20 ఆర్థిక సంవత్సరం నుంచి సగానికిపైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ముప్పావువంతు కాలేజీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో మూతపడ్డ కాలేజీలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో తెరుచుకోలేదు. ఈ విద్యాసంవత్సరం కూడా ఇంకా ఆన్‌లైన్ తరగతులకే పరిమితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలను నిర్వహించడానికి బదులు తప్పుకోవడమే ఉత్తమమనే ఆలోచనతో పలువురు ఇతర సొసైటీల చేతుల్లో పెడుతున్నారు. ప్రస్తుతం సొసైటీ మార్పు కోసం దాదాపు 42 కాలేజీలకు సంబంధించిన ఫైళ్లు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ప్రోత్సహించకుంటే కష్టం....
ప్రభుత్వ కాలేజీల కంటే ప్రైవేటు జూనియర్ కాలేజీల సంఖ్య ఎక్కువ. గ్రామీణ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు దొరక్క ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. సేవా దృక్పథంతోనే కొనసాగుతున్న గ్రామీణ కాలేజీలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ కాలేజీలు మూతపడితే గ్రామీణ విద్యార్థులు పదో తరగతికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. కోర్సు ఫీజులను కూడా కాస్త పెంచి యాజమాన్యాలకు మరింత ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది.
–గౌరిసతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం
మూతపడితే కాలేజీ విద్యకు నోచుకోరు
రాష్ట్రంలో జూనియర్ కాలేజీలు ఏటా పెద్ద సంఖ్యలో మూతపడుతున్నాయి. విద్యార్థుల నుంచి తీసుకునే ఫీజుల కంటే నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రైవేటు కాలేజీలు సైతం నామమాత్రపు ఫీజులు తీసుకుంటున్నాయి. అవి కూడా ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడుతున్నాయి. ఇలాంటప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసే చర్యలు తీసుకోవాలి.
–ఎం.దుర్గేశ్వర్‌రెడ్డి, టీపీజేఎంఏ, ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మెదక్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment