
కూకట్‌పల్లికి చెందిన ఓ ఉపాధ్యాయుడి కుమారుడు యావరేజ్ విద్యార్థి. కార్పొరేట్ కాలేజీలో వేస్తే బాగా చదువుతాడని ఆశించారు. ఏటా రూ.90 వేలు కట్టి ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. కానీ అక్కడి టీచర్లు ఈ విద్యార్థిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో లక్షలు ఖర్చుపెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆ తండ్రి ఆందోళనలో పడ్డారు.
హబ్సిగూడకు చెందిన రాంరెడ్డి తన కుమార్తెను ఏసీ సదుపాయమున్న ఓ కాలేజీ హాస్టల్‌లో చేర్పించారు. ఏటా రూ.1.5 లక్షల ఫీజు కడుతున్నారు. కానీ అక్కడ సరైన వసతులకే దిక్కులేదు. పోతే పోనీ చదువు బాగా వస్తే చాలనుకున్నారు. కానీ ఆ ప్రయోజనమూ లేదు. దాంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడ్డారు.
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీ, ఏఐఈఈఈ ప్రత్యేక కోచింగ్ అంటూ ఆకర్షణీయ పేర్లతో ఊదరగొడుతున్న కార్పొరేట్ కాలేజీల ప్రచారం మాయలో పడి.. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి మరీ పిల్లలను చేర్చుతున్నారు. కాలేజీలు ఆ కోచింగ్, ఈ ప్రత్యేకత, ఏసీ సౌకర్యాలు అంటూ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నాయి. కానీ చాలా మంది విద్యార్థులకు తగిన బోధన అందడం లేదు. యాజమాన్యాలు అప్పటికే ‘మెరిట్’గా ఉండి, ర్యాంకులు తెచ్చిపెట్టగలిగిన విద్యార్థులపైనే ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాయి. మిగతా విద్యార్థులకు బలవంతపు చదువులే తప్ప నాణ్యమైన బోధన అందించడం లేదు.
వాళ్లను చూపుతూ.. వీరిపై దోపిడీ..
వేలాది మంది విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు.. అందరికీ సమాన విద్య అందించడం లేదు. తీసుకుంటున్న సొమ్ముకు న్యాయం చేయడం లేదు. కేవలం తమకు ర్యాంకులను తెచ్చిపెట్టే విద్యార్థులపైనే ప్రత్యేక దృష్టి సారిస్తూ.. వారికి విడిగా నాణ్యమైన బోధన, శిక్షణ ఇస్తున్నాయి. ఇందుకోసం లక్షల రూపాయలు ఎదురు చెల్లించి మరీ ‘మెరిట్’విద్యార్థులను కొనుగోలు చేస్తున్నాయి. వారు సాధించిన మార్కులు, ర్యాంకులను ప్రచారం చేసుకుంటూ.. వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. అధికారులు ఇంటర్ బోర్డుకు అందజేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు కూడా. రాష్ట్రవ్యాప్తంగా 1,550 వరకు ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. అందులో 18 కార్పొరేట్ మేనేజ్‌మెంట్లకు చెందిన కాలేజీలు 193 ఉన్నట్లు ఇంటర్ బోర్డు లెక్కలు వేసింది. వీటిల్లోనే ఏకంగా 3.4 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అయితే కార్పొరేట్ యాజమాన్యాలు ఈ 3.4 లక్షల మందిలో.. తమకు టాప్ ర్యాంకులు తెచ్చిపెట్టే 10 వేల మంది విద్యార్థులపైనే దృష్టి సారిస్తున్నాయని, మిగతా వారికి అన్యాయం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు.
తాము చెప్పిందే ఫీజు
రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల దందా కొనసాగుతోంది. పిల్లలను బాగా చదివించాలన్న తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని.. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సొమ్ముకు లెక్కా పత్రం లేదు, చెల్లించిన మొత్తానికి రసీదులు ఉండవు. కేవలం కాలేజీ అధికారిక ఫీజు మేరకు నామమాత్రపు మొత్తానికి రసీదులు ఇస్తున్నాయి. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ప్రకారం.. డేస్కాలర్‌కు గరిష్ట ఫీజు రూ.1,940 మాత్రమే. నాలుగేళ్ల కింద నిర్ణయించిన ఈ ఫీజు సరిపోదని, పెంచాలని ప్రైవేటు కాలే జీలు కోరుతున్నాయి. సాధారణ ప్రైవేటు కాలేజీలు ఈ ఫీజుకు అదనంగా రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఆ మొత్తాన్ని చెల్లించలేని విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్‌షిప్ సొమ్మును తీసుకుంటున్నాయి. అదే కార్పొరేట్ కాలేజీలు మాత్రం సదుపాయాలను, ప్రత్యేకతలను బట్టి రూ.40 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అదే హాస్టల్ వసతి కూడా కలిపితే రూ.65 వేల నుంచి రూ. 2.20 లక్షలదాకా దండుకుంటున్నాయి. కార్పొరేట్ యాజమాన్యాలకు చెందిన స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి. టెక్నో, ఈ–టెక్నో వంటి ఆకరణీయ పేర్లతో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
పట్టించుకోని ఇంటర్ బోర్డు
కార్పొరేట్ కాలేజీలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నా ఇంటర్ బోర్డు పట్టించుకున్న దాఖలాలు కానరావడం లేదు. జూని యర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణను చేపట్టాలన్న డిమాండ్ ఉన్నా దానిపై దృష్టి సారించడం లేదు. గతంలో ఒకసారి ఫీజుల నియం త్రణకు కసరత్తు ప్రారంభించినా అలాగే వదిలేశారు. ఫీజుల నియంత్రణ అమలుచేస్తే తమకు నష్టం వాటిల్లుతుందన్న ఆలోచనతో కార్పొరేట్ యాజమాన్యాలు ఇంటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సాధారణ ప్రైవేటు కాలేజీలు మాత్రం.. కొత్తగా ఫీజులను నిర్ణయించి, నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి.
రకరకాల పేర్లతో..
కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు అనేక ఆకర్షణీయ పేర్లతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్‌లో ఏఐఈఈఈ, ఏఐఈఈఈ (ఫాస్ట్ ట్రాక్–ఎఫ్‌టీ) ఐఐటీ, ఏఐఈఈఈ (ఇంటెన్సివ్ జెడ్‌గ్రూప్), ఏసీ క్యాంపస్‌లు, సెంట్రల్ ఆఫీస్, రెండు యాజమాన్యాల భాగస్వామ్యంతో కూడిన బ్యాచ్‌లు, ఐపీఎల్ (ఐఐటీ), నియాన్ (ఏఐఈఈఈ), ఎంపీఎల్, సూపర్–60 వంటి పేర్ల తో ఫీజులు నిర్ణయిస్తున్నాయి. ఇంత భారీగా వసూలు చేస్తున్నా పట్టించుకునేవారే లేకుండా పోయారు.
మండలానికో పీఆర్వోను పెట్టి..
పదో తరగతి ఫలితాలు వస్తున్నాయంటే చాలు.. కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు వాలిపోతారు. వారిలో మండలానికో పీఆర్వో, రెవెన్యూ డివిజన్‌కో ఏజీఎం, జిల్లాకో డీజీఎం (డీన్) ఉంటారు. వారంతా టెన్త్‌లో మంచి గ్రేడ్లు వచ్చిన పిల్లల తల్లిదండ్రులను కలుస్తారు. ఫీజు మినహాయింపు ఇస్తామని, హాస్టల్ కోసం తక్కువ ఫీజు తీసుకుంటామని, ఐఐటీలకు పంపుతామని గాలం వేస్తారు. మరోవైపు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రతిభావంతులైన పిల్లలను తమ కాలేజీలో చేర్పించేలా ఒప్పందాలు చేసుకుంటారు. ఇందుకోసం పాఠశాల యాజమాన్యానికి, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు సొమ్ము చెల్లిస్తారు. ఈ మెరిట్ విద్యార్థులను ప్రత్యేక బ్రాంచీల్లో పెట్టి చదివిస్తారు. వారికి ప్రథమ సంవత్సరంలో టాప్ మార్కులు వస్తే సరే.. లేకపోతే రెండో ఏడాది నుంచి మొత్తం ఫీజు వసూలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment