
సాక్షి, హైదరాబాద్ : నేను కొట్టినట్టు చేస్తా... నువ్వు ఏడ్చినట్టు చెయ్ అన్నట్టుగా ఉంది నారాయణ, శ్రీచైతన్య కాలేజీలతో ఇంటర్మీడియెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు! నిబంధనల ప్రకారం లేనందున ఆ యాజమాన్యాలకు చెందిన 10 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని గొప్పగా ప్రకటించిన బోర్డు.. వాటిని కొనసాగించేందుకు మాత్రం తల ఊపేసింది. ఆ కాలేజీల్లోని విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేందుకు లాగిన్ ఐడీ ఇచ్చేసింది. ఆ కాలేజీలకు గుర్తింపు లేదన్న సంగతి అటు నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు తెలుసు. ఇటు ఇంటర్మీడియెట్ అధికారులకు తెలుసు.
అయినా ఇద్దరూ కుమ్మక్కై వాటిలో చదువుతున్న 8 వేల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారు. గుర్తింపు లేని కారణంగా.. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సమయంలో హాల్‌టికెట్లు రాకపోతే వారంతా రోడ్డున పడే ప్రమాదం ఉంది. గుర్తింపు లేని ఈ 10 కాలేజీల్లో నారాయణ కాలేజీలు 5, శ్రీచైతన్య కాలేజీలు మరో 5 ఉన్నాయి. ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతూ తల్లిదండ్రుల నుంచి కోట్లు దండుకుంటున్నా.. బోర్డు అధికారులు మూముళ్ల మత్తులో జోగుతూ కళ్లు మూసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరుగుతోంది..?
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోనే శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలకు చెందిన 146 కాలేజీల్లో అనేక లోపాలు ఉన్నాయని, వారికి నోటీసులు జారీ చేశామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్ ఇటీవల గొప్పగా ప్రకటించారు. కానీ అవే యాజమాన్యాలకు చెందిన 10 కాలేజీలకు గుర్తింపు లేకున్నా ఆన్‌లైన్ లాగిన్ ఇచ్చారు. అంటే బోర్డు అనుబంధ గుర్తింపు లేకపోయినా ఆ కాలేజీలు కొనసాగించేందుకు పరోక్షంగా అనుమతి ఇచ్చినట్టే. ఇప్పుడు లాగిన్ ఇచ్చి హాల్‌టికెట్లు ఇచ్చే సమయంలో భారీగా దండుకోవచ్చన్న ప్లాన్‌తోనే ఇలా చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇది బెడిసికొడితే ఆ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. గతేడాది వనస్థలిపురంలోని శ్రీవాసవి కాలేజీ విషయంలో ఇలాగే జరిగింది.
మరో ‘శ్రీవాసవి’అయితే..
వనస్థలిపురంలోని శ్రీవాసవి కాలేజీకి ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. కానీ ముడుపులు పుచ్చుకొని బోర్డు అధికారులు ఇలాగే లాగిన్ ఇచ్చేశారు. కానీ పరీక్ష సమయంలో... ఆ కాలేజీకి గుర్తింపు లేనందున విద్యార్థుల హాల్‌టికెట్లు జనరేట్ కాలేదు. బోర్డు అధికారులకు ముడుపులు ఇవ్వనందునే తమ పిల్లలకు హాల్‌టికెట్లు ఇవ్వలేదని ఆ కాలేజీ కరస్పాండెంట్ మీడియా ముందు చెప్పారు. ఏకంగా బోర్డు కార్యదర్శి అశోక్‌పైనే ఆరోపణలు చేశారు. గుర్తింపు లేనపుడు ముందుగా లాగిన్ ఎందుకు ఇచ్చారని కూడా ప్రశ్నించారు. తీరా ఆ కాలేజీ విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతించలేదు. చివరికి హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో వారు మంచి మార్కులు సాధించినా ఎంసెట్‌లో తీవ్రంగా నష్టపోయారు. ఎంసెట్ ర్యాంకుల ఖరారులో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మొదట ర్యాంకులు కేటాయించి.. చివరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో పాస్ అయిన వారికి ఇచ్చారు. దీంతో ఆ విద్యార్థులంతా చివరి ర్యాంకుల్లో నిలిచి మంచి కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పొందలేకపోయారు.
ఈ విద్యార్థులకు అదే పరిస్థితా?
ప్రస్తుతం నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందిన ఆ 10 కాలేజీల్లో 8 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. నారాయణ విద్యా సంస్థలకు చెందిన రెండు కాలేజీలు తార్నాకాలో, మరో రెండు కాలేజీలు కూకట్‌పల్లిలో, ఇంకో రెండు కాలేజీలు మెహిదీపట్నంలోని ఒకే క్యాంపస్‌లలో కొనసాగుతున్నట్లు బోర్డు అధికారులు తేల్చారు. ఈ మూడు చోట్ల ఒక్కో కాలేజీకి అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. అలాగే మరో రెండు కాలేజీలను కూకట్‌పల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌కు మార్చారు. అయితే వాటి రికార్డులను అధికారులకు ఇవ్వకపోవడంతో ఆ రెండింటికి కూడా గుర్తింపు ఇవ్వలేదు. ఇలా మొత్తం ఐదు కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. ఇక కూకట్‌పల్లిలో శ్రీచైతన్య విద్యా సంస్థకు చెందిన రెండు కాలేజీలు ఒకే క్యాంపస్‌లో నడుస్తున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోనూ ఒకే క్యాంపస్‌లో రెండు నడుస్తున్నాయి. వీటిలో రెండింటికి అనుమతి ఉంది. మరో రెండింటికి లేదు. అలాగే నిబంధనల ప్రకారం కాలేజీ భవనాలు లేకపోవడంతో మరో మూడు కాలేజీలకు కూడా అనుమతి ఇవ్వలేదు. ఇలా నారాయణ కాలేజీలు ఐదు, శ్రీచైతన్య కాలేజీలు ఐదింటికి గుర్తింపు లేవు. గతేడాది శ్రీవాసవి కాలేజీ మాదిరే జరిగితే వీటిలో చదివే 8 వేల మంది విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడనుంది. అదే జరిగితే ఆ విద్యార్థులను ఏదో ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అనుమతించాల్సి వస్తుంది. దాంతో వారంతా ఎంసెట్‌లో నష్టపోయే ప్రమాదం ఉంది.
ముందే చర్యలు చేపడితే సమస్యేంటి?
అనుబంధ గుర్తింపు లేని కాలేజీలు ఏంటనేది బోర్డు అధికారులకు తెలుసు. అలాంటపుడు గుర్తింపు లేకపోయినా వాటికి లాగిన్ ఇవ్వడం కంటే.. ఆ విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి పరీక్షల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తే సమస్య ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment