కర్నూలు సిటీ: కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాల వేధింపుల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా సోమవారం జిల్లా విభాగం అధ్యక్షుడు అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కర్నూలులోని పలు కార్పొరేట్ కాలేజీలను బంద్ చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ కాలేజీలు ర్యాంకుల కోసం విద్యార్థులకు తీవ్రమైన ఒత్తిళ్లు తెస్తున్నాయన్నారు. ఫలితంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న వారే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రేమ వ్యవహారాలే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని మంత్రి గంటా వ్యాఖ్యానించడం దారుణమన్నారు. «బంద్‌లో ఆ విద్యార్థి సంఘం నాయకులు శాలీ, ఇమ్రాన్, చైతన్య, అమర్, మహేష్, సుధీర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
నారాయణ, శ్రీచైతన్యను సీజ్ చేయాలి
కర్నూలు సిటీ: విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న నారాయణ, శ్రీచైతన్య జూనియర్ కాలేజీలను సీజ్ చేయాలని పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.భాస్కర్, కె.ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కర్నూలు కొత్త బస్టాండ్ ఎదుట ఆ విద్యాసంస్థల యాజమాన్యాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఆత్మహత్యలపై వేసిన కమిటీ ఇంత వరకు యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు శ్రీదేవి, శశి, ప్రసన్నకుమార్, ఇమామ్, బడెసాహెబ్, ఆనంద్, దావీద్, తదితరులు పాల్గొన్నారు.
సీబీఐతో విచారణ చేయించాలి
కర్నూలు(న్యూసిటీ): నారాయణ విద్యాçసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సీబీఐతో విచారణ చేయించాలని ఏబీవీపీ , ఏఐఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట కార్పొరేట్ యాజమాన్యాల దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థి సంఘాల నాయకులు మహేంద్ర, ప్రతాప్ మాట్లాడుతూ... నారాయణ విద్యాసంస్థలో ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కారణమైన మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఏబీవీపీ కర్నూలు రూరల్ భాగ్ కన్వీనర్ కార్యదర్శి జయసింహ, నగర కార్యదర్శి హర్ష, రాజు, సుధాకర్, బాబ్జీ, హరి, ఏఐఎస్‌ఎఫ్ నగర నాయకులు ఈశ్వర్, మనోజ్, రమేష్, షేక్షావలి, సాయితేజ, అబ్దుల్లా, కుమార్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment