సాక్షి,సిటీబ్యూరో: వేసవి సెలవుల్లోనూ పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. పొటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులను సాకుగా చూపించి ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీ చేసిన అధికారులు ఇప్పటికే ఆయా కాలేజీలకు షోకాజు నోటీసులు అందజేయడం విశేషం. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 323 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. అధికారులు ఇటీవల 27 కాలేజీల్లో తనిఖీ చేసి వీటిలో నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న 12 కాలేజీలకు నోటీసులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో 200పైగా ఉన్న కాలేజీలు ఉండగా, వీటిలో 20 కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత రెండుమూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి.. ఆ తర్వాత షరామా మూలుగా తరగతులు నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇప్పటికే సెకండియర్ పూర్తై.. ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకునేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని కాలేజీలు ఇటీవలే ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకూ గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఒత్తిడి నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నారు.
ఫలితాలు రాకముందే ప్రవేశాలు..
టెన్త్ ఫలితాలు ఇంకా వెలువడక ముందే నగరంలోని పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఫస్టియర్ అడ్మిషన్ల పక్రియను అప్పుడే చేపట్టాయి. ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్మీడియట్ తరగతులను కూడా కొనసాగిస్తుండటంతో ప్రైవేటులో సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం లేకపోలేదు. ఈ అంశాన్ని ముందే పసిగట్టిన పలు యాజమాన్యాలు ఆయా కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు టార్గెట్లు ఇచ్చాయి. అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా పీఆర్‌ఓలను నియమించుకున్నాయి. వీరంతా బస్తీల్లో పర్యటించి ఇటీవల టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం ఇదే పనిలో ఉంటున్నారు. టెన్త్ ఫలితాలు వెలువడిన తర్వాత యాజమాన్యాలు ఫీజులు పెంచే అవకాశం ఉందని, ప్రస్తుతం అడ్మిషన్ చేసుకున్న వారికి ఫీ జులో 20 నుంచి 30 శాతం రాయితీ కూడా ఇస్తుందని ప్రకటిస్తున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా కాలేజీ, హాస్టల్ భవనాలను అందగా తీర్చిదిద్దుతుండటం విశేషం.
తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు
వేసవి సెలవుల్లో ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. హైదరాబాద్ జిల్లాల్లో ఇప్పటికే 12 కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చాం. రెండోసారి పట్టుబడిన కాలేజీలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. అంతేకాదు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దళారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ముందస్తుగా డబ్బులు కట్టి మోసపోవద్దు. ప్రవేశాలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కళాశాలల్లోని వసతులు, సౌకర్యాలు గుర్తించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికే గుర్తింపు ఇవ్వనున్నారు. ఈ జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరిచే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏ కళాశాలలో ఎలాంటి వసతులున్నాయి.. అనుమతి తీసుకున్న భవనం.. తరగతి గదులు..అధ్యాపకుల అర్హ తలు.. తదితర సమగ్ర సమాచారాన్ని ఆ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు సమగ్రంగా పరిశీలించి ప్రవేశాలు చేసుకుంటే మంచిది. – జయప్రద, డీఐఈఓ
Comments
Please login to add a commentAdd a comment