కార్పొరేట్‌ కళాశాలల దందా! | Corporate Colleges Target to Tenth Class Students | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కళాశాలల దందా!

Published Mon, Apr 22 2019 12:46 PM | Last Updated on Mon, Apr 22 2019 12:46 PM

Corporate Colleges Target to Tenth Class Students - Sakshi

ప్రకాశం ,పర్చూరు: రాష్ట్రంలో మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. కానీ కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల కోసం అప్పుడే వేట మొదలు పెట్టాయి. ఫలితాలు వచ్చేందకు ఇంకా సమయం పడుతుంది. అయినా ప్రైవేటు కళాశాలల మధ్య నెలకొన్న తీవ్ర పోటీతో సాధ్యమైనంత వరకు అడ్మిషన్లు ముందే పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు కార్పొరేట్‌ విద్యా సంస్థలు ముందస్తు అడ్మిషన్లు ఇప్పటికే ప్రారంభించాయి. అందుకనుగుణంగా తమ సిబ్బందిని ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల మీదకు వదిలారు. విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్న ఆయా కొర్పొరేట్‌ సంస్థల పీఆర్‌ఓలు.. అడ్మిషన్ల సమయంలోనే ఎంబీబీఎస్‌ ర్యాంకులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అంటూ మభ్యపెడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 42,343 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. 2018 అక్టోబర్, నవంబర్‌ నెలల నుంచే పదో తరగతి విద్యార్థుల జాబితా సేకరించిన కార్పొరేట్‌ విద్యా సంస్థలు అడ్మిషన్లను అడ్వాన్స్‌ బుక్‌ చేసుకుంటున్న వైనం విస్తుగొలుపుతోంది. జిల్లాలోని అన్ని పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం పీఆర్‌ఓలను దించేసి నిర్ణయించిన మేరకు అడ్మిషన్లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పీఆర్‌ఓలు తల్లిదండ్రుల దగ్గర అడ్మిషన్‌ ఫీజు కింద రూ.2 వేలు కట్టించుకుంటున్నారు. కార్పొరేట్‌ సంస్థల పీఆర్‌ఓలు చేరే ముందు ఒక ఫీజు, చేరిన తర్యాత ఇంకో విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షలు విడుదలయ్యాక జూన్‌లో ఇంటర్‌ ప్రవేశాలు ఉంటాయి. ఇందుకోసం ఎలాంటి ప్రచారం చేయకూడదు. కానీ పలు సంస్థల పీఆర్‌ఓల ద్వారా ఆర్భాటపు ప్రచారాలు చేస్తూ తల్లిదండ్రులను విద్యార్థులను అయోమయానికి గురి చేస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యంతో నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక తమ పాఠశాలల్లో పది చదివి పాసైన వారిని ఉపాధ్యాయులు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చేర్పిస్తే రూ.2 నుంచి 5 వేలు వరకు కమీషన్‌ ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement