ఇంటర్‌లో ప్రవేశాలకు కార్పొరేట్‌ వల..! | Corporate Colleges Fees Hikes In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇంటర్‌లో ప్రవేశాలకు కార్పొరేట్‌ వల..!

Published Mon, May 6 2019 10:19 AM | Last Updated on Mon, May 6 2019 10:19 AM

Corporate Colleges Fees Hikes In Andhra Pradesh - Sakshi

జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఇంటర్‌లో ప్రవేశాలకు తెరలేపాయి. పదో తరగతి ఫలితాలు వెల్లడికాకుండానే విద్యార్థులకు వల విసురుతున్నాయి. తల్లిదండ్రులకు మాయమాటలుచెబుతూ విద్యార్థులను ‘బుక్‌’ చేసుకుంటున్నాయి. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు భారీగా ముడుపులు ముట్టజెప్తున్నాయి. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశాలు కల్పిస్తున్నా.. జిల్లా ఇంటర్మీయట్‌ విద్యా పర్యవేక్షణ శాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. 

విజయనగరం అర్బన్‌: పదోతరగతి ఫలితాలు వెల్లడికాకుండానే ఇంటర్‌లో ప్రవేశాలంటూ ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు జిల్లాలో హడవుడి చేస్తున్నాయి. తమ పీఆర్వోలను పల్లె, పట్టణాల్లో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఇళ్లకు పంపిస్తున్నాయి. వారి తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ప్రవేశ దరఖాస్తులను నింపిస్తున్నాయి. ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని కళాశాలలు రాయితీల పేరుతో ముందుగానే 60 శాతం ఫీజును వసూలు చేస్తున్నాయి. లేందంటే ఐడీ నంబర్‌రాదని భయపెడుతున్నాయి.

జిల్లాలో ప్రభుత్వ కళాశాలలు 22, ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలలు 72 ఉన్నాయి. మొత్తం కళాశాలల్లో మొదటి సంవత్సరానికి 26 వేల మంది విద్యార్థుల ప్రవేశం జరుగుతుంది. వీటిలో ప్రభుత్వ కళాశాలలను మినహాయించి చూస్తే 16 వేల మంది ప్రైవేటు, కార్పొరేట్‌ కళా శాలల్లోనే చదువుతున్నారు. వీరి ప్రవేశాల కోసం బేరసారాలు ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్నాయి. 

భారీ ఫీజులు...
ఐఐటీ ప్రత్యేకం పేరుతో ఎంపీసీలో ప్రవేశాలకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఏడాదికి రూ. 90 వేల నుంచి రూ.లక్ష వరకు  ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదే గ్రూప్‌లో ఏసీ క్యాంపస్‌ (రాష్ట్రంలో ఎక్కడి బ్రాంచ్‌ల్లోనైనా)లో చదువుకోదలిస్తే రూ.1.75 లక్షల వరకు ఫీజు చెల్లించాల్సిందే. సీఈసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ గ్రూప్‌ల్లో సివి ల్స్‌ ఫౌండేషన్‌ పేరుతో కొత్త కోర్సులను పరిచ యం చేస్తున్నాయి. సుమారు రూ. 1.75 వేల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నా యి. సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌తో సీఏ, సీసీటీ పేర్లు జోడించి రూ.2.25 లక్షల డిమాండ్‌ చేస్తున్నాయి.

నిబంధనలకు పాతర...
వాస్తవంగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాక జూన్‌లో ప్రవేశాలు  తీసుకోవాలి. అప్పటివరకు ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. పీఆర్వోలతో నియామకాలు చేసుకోకూడదు. ఇం టర్‌ బోర్డు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఈ నిబంధనలు అమలు కావడం లేదన్న వాదన విని పిస్తోంది. జిల్లాలోని పలు విద్యాసంస్థలు విచ్చల విడిగా ప్రవేశాలు చేస్తున్నా పట్టించుకునేవారే లేరని విద్యావేత్తలు చెబుతున్నారు.

తిరిగొస్తే డబ్బులు గోవిందా...
కార్పొరేట్‌ కళాశాలల్లో చేరే విద్యార్థులు చాలా మందికి అక్కడి పరిసరాలు నప్పవు. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. కళాశాలను విడిచి పెట్టేందుకు సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో ఫీజులో 30 శాతం చెల్లించాల్సి వస్తోందంటూ బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. పొరపాటున మొత్తం ఫీజు ఒకేసారి చెల్లిస్తే తిరిగి తెచ్చుకునేందుకు చుక్కలు చూడాల్సిందేనంటున్నారు.

పాఠశాలల నిర్వాహకులకు తాయిలాలు..
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల నిర్వాహకులకు భారీ తాయిలాలు ముట్టజెప్పి అందులో చదివే విద్యార్థులను తమ కళాశాలలో చేర్పించేందుకు కొన్ని కళాశాలల యాజమాన్యాలు ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. పాఠశాలల నిర్వాహకులకు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మేర ముడుపులు, లేదా ఆ స్థాయి బహుమతులు అందించేందుకు జిల్లాలో 100కు పైగా ఉన్నతపాఠశాలలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అదే కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి విద్యార్థుల ప్రవేశాల విషయంలో ఇచ్చిన టార్గెట్‌ పూర్తి చేసిన వారికే వేసవి సెలవుల్లో వేతనాలిచ్చే నిబంధనలు విధించాయి.  దీంతో ఆయా కళాశాలల్లోని సిబ్బంది తీవ్రఒత్తిడితో విధులు నిర్వహిస్తున్నట్టు భోగట్టా.

అన్ని చోట్లా పీఆర్వోలు
ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల యాజమాన్యాలు జిల్లా కేంద్రంతోపాటు పార్వతీపురం, సాలూరు, గజపతినరం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో పీఆర్వో (పబ్లిక్‌ రిలేషన్‌ అధికారులు)లను నియమించుకున్నాయి. ఎల్‌ఐసీ ఏజెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయులను కళాశాలలకు ఏజెంట్లుగా నియమించి వీరికి నెలకు రూ.8వేల వరకు ఏడాది పొడువునా జీతం రూపంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. పార్ట్‌టైం పీఆర్వోలకు ఒక్కో విద్యార్థితో యాజమాన్యం నిర్ణయించిన ఫీజు కట్టిస్తే 10 శాతం వరకు గిట్టుబాటవుతోంది. ఆ తాయిలాల కు ఆకర్షితులైన చాలామంది పీఆర్వోలుగా చేరి వివిధ ప్రాంతాల్లో రోజుకు వంద దరఖాస్తులు కార్పొరేట్‌ కళాశాలలకు పంపుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement