వజ్రపుకొత్తూరు: పదో తరగతి చదువుతున్న విద్యార్థులను తమ కాలేజీలో చేర్చుకునేందుకు కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు అప్పుడే వల విసురుతున్నాయి. రాయితీలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తూ తల్లిదండ్రులపై పీఆర్‌వోలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. పదోతరగతిలో మంచి గ్రేడ్ పాయింట్లు తెచ్చుకుంటే మరింత రాయితీ ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరి ఆగడాలు పెరుగుతున్నాయి. జిల్లాలో 469 ఉన్నత పాఠశాలలు ఉండగా అందులో 20 కేజీబీవీ, 14 మున్సిపల్ హైస్కూల్స్, మరో 14 ఆంధ్రప్రదేశ్ మోడల్ హైస్కూల్స్ ఉన్నాయి. ఇదికాక 193 ప్రైవేటు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఈ ఏడాది దాదాపు 63,000 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం వీరి వివరాలు సేకరించి పీఆర్‌వోలను రంగంలోకి దింపి ఇళ్లకి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి.
కొన్ని విద్యాసంస్థలైతే ఇప్పటికే తమ వద్ద ఉన్న విద్యార్థులు ఎటూ చేజారిపోకుండా 10వ తరగతి ఫీజు కట్టినపుడే.. ఇంటర్‌కు అడ్వాన్స్ ఫీజు చెల్లిస్తే అప్పటి ధరలో పదో వంతు రాయితీ ఇస్తామంటూ ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏరియాకు ఒకరు చొప్పున కమీషన్ పద్ధతిలో పీఆర్‌ఓలను నియమించి విద్యార్థుల కోసం గ్రామాల్లో జల్లెడ పడుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల మార్కుల లిస్ట్, టీసీ ఇచ్చేది లేదని తమ కళాశాలలోనే పిల్లలను ఉంచాలని ఒత్తిడి చేస్తున్నాయి. కళాశాలలో పని చేసే ఉపాధ్యాయుల నుంచి అటెండర్ల వరకు ప్రతి ఒక్కరూ నెలకు కచ్చితంగా ఇద్దరిని చేర్చాలని కార్పొరేట్, ప్రైవేటు యాజమాన్యాలు కండీషన్లు పెట్టినట్లు సమాచారం. దీంతో వీరు కూడా ఆదివారం పదోతరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌లు, రాయితీలు వివరిస్తున్నారు. పదోతరగతిలో అర్థ సంవత్సరం (సమ్మెటివ్–2) పరీక్షలు జరగక ముందే ఇంటర్ ప్రవేశాలను ప్రోత్సహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
కాకినాడ ఆర్‌ఐఓ కార్యాలయం సైతం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలలను పాఠశాలలకు వచ్చి విద్యార్థులను పలోభ పెడితే ప్రధానోపాధ్యాయులు తీవ్రంగా పరిగణించి వారిని నిరోధించాలని వజ్రపుకొత్తూరు విద్యాశాఖాధికారి పి.కృష్ణప్రసాద్ అన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురయితే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు ణిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment