సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,27,761 మంది విద్యార్థులు హాజరయ్యే ఈ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఫిబ్రవరి 1 నుంచి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 1,733 ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకుల, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని (జనరల్ కాలేజీలు 1,561, ఒకేషనల్ 172 కాలేజీలు) ఎంపీసీ విద్యార్థులు 1,59,429 మంది, బైపీసీ విద్యార్థులు 89,496 మంది, జాగ్రఫీ విద్యార్థులు 261 మంది, ఒకేషనల్‌లో ప్రథమ సంవత్సర విద్యార్థులు 42,749 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 35,925 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ కోసం 6,314 మంది అనుభవం కలిగిన జూనియర్ లెక్చరర్లను నియమించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. గతేడాది నుంచే ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపించే చర్యలను బోర్డు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ సారి కూడా అరగంట ముందుగా ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపిస్తామని తెలిపింది. ఎగ్జామినర్ మొబైల్ నంబరుకు వన్‌టైం పాస్‌వర్డ్ పంపిస్తామని దాని ఆధారంగా ప్రశ్నపత్రం డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలు నిర్వహించాలని సూచించింది. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల మార్కులను కూడా ఆ రోజు సాయంత్రమే ఆన్‌లైన్లో అప్‌లోడ్ చేయాలని బోర్డు స్పష్టంచేసింది.
ఎగ్జామినర్ల జంబ్లింగ్‌లో పొరపాట్లు
ప్రాక్టికల్ పరీక్షల విధులను అప్పగించిన ఎగ్జామినర్ల జంబ్లింగ్‌లో పొరపాట్లు దొర్లినట్లు తెలిసింది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు చెందిన లెక్చరర్లను ప్రాక్టికల్ ఎగ్జామినర్లుగా జంబ్లింగ్ చేసినప్పటికీ వారివారి కాలేజీల్లోనే సెంటర్లు పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని గమనించిన బోర్డు అధికారులు గురువారం సాయంత్రం దాన్ని సవరించే పనిలో పడినట్లు తెలిసింది. మరోవైపు ఈ నెల 28న జరిగిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు ఇంకా ఇంటర్ బోర్డుకు అందలేదు. ఆన్‌లైన్‌లో మార్కులను అదే రోజు అప్‌లోడ్ చేయాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల వల్ల కుదరలేదు.
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
Published Fri, Feb 1 2019 12:23 AM | Last Updated on Fri, Feb 1 2019 8:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment