రేపటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
అర్బన్ జిల్లాలో 23,138 మంది విద్యార్థులు..
66 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు
పరీక్ష జరిగిన రోజే మార్కుల పోస్టింగ్
విద్యారణ్యపురి : ఇంటర్‌మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు శుక్రవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షలు జరగనుండగా ఇంటర్ విద్య అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రాలు పంపించే విధానం ఈ ఏడాది నుంచి అమలులోకి వస్తోంది. ఇక బ్యాచ్‌లవారీగా విద్యార్థుల ప్రాక్టికల్స్‌పై వాల్యుయేషన్ నిర్వహించి
వెంటనే మార్కులు ఆన్‌లైన్‌లోనే పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది.
అర గంట ముందే..
ఇంటర్‌మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో పంపిస్తారు. అలా వచ్చిన ప్రశ్నాపత్రాలను పరీక్షకు అరగంట ముందుగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం కోడ్, ఎగ్జామినర్‌కు వన్‌టైం పాస్‌వర్డ్ ఇస్తారు. ఆ పాస్‌వర్డ్‌తో కోడ్ ద్వారా ప్రశ్నాపత్రం డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా పరిస్థితుల్లో ఎగ్జామినర్ విధులకు రాకపోతే ప్రత్యామ్నాయంగా మరో ఎగ్జామినర్‌కు కూడా వన్‌టైం పాస్‌వర్డ్ కేటాయిస్తారు. గతంలో పరీక్షలకు కొద్దిరోజుల ముందుగానే ప్రశ్నపత్రాలు పంపించే విధానం ఉండడంతో ప్రైవేట్ కళాశాలల యజమాన్యాలు ఏదో మొక్కుబడిగా పరీక్ష నిర్వహించి తమ విద్యార్థులకు మంచి మార్కులు వేయించుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. దీని నివారణకు ఆన్‌లైన్‌లో ప్రశ్నపత్రం పంపిస్తూ అర గంట ముందే డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని తీసుకురావడమే కాకుండా బ్యాచ్‌ల వారీగా పరీక్ష నిర్వహించి ఎప్పటికప్పుడు మార్కులను ఆన్‌లైన్‌లో పోస్టింగ్ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. తద్వారా ఒకసారి మార్కులు పోస్టింగ్ చేశాక మళ్లీ మార్చేందుకు కుదరకపోవడంతో అక్రమాలు జరగవని భావిస్తున్నారు.
సౌకర్యాల లేమితో..
ప్రతి ఏడాది జంబ్లింగ్ విధానంలో ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ అమలులోకి రాలేదు. ప్రభుత్వ కళాశాలలతో పాటు కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ల్యాబ్‌లు కూడా సరిగాలేవు. ఉన్నచోట పరికరాలు, కెమికల్స్ సరిపోను ఉండకపోవడంతో పూర్తిస్థాయిలో జంబ్లింగ్ విధానం అమలు చేయడం సాధ్యం కావడం లేదు. ఈ మేరకు అన్ని సౌకర్యాలు ఉన్న కొన్ని కళాశాలలు ఎంపిక చేసి వాటిల్లోనే ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అర్బన్ జిల్లాలో 66 కేంద్రాలు
వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు 66 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 23,138 మంది విద్యార్థులు సైన్స్, ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఈ మేరకు ప్రాక్టికల్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వరంగల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జి ఇంటర్ విద్యాధికారి కే.వీ.ఆజాద్ తెలిపారు.