కాసులు కొట్టే కాలేజీలు | sakshi special story on corporate education institutions | Sakshi
Sakshi News home page

కాసులు కొట్టే కాలేజీలు

Published Thu, Oct 19 2017 6:59 AM | Last Updated on Thu, Oct 19 2017 7:13 AM

sakshi special story on corporate education institutions

సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు నిబంధనలకు పాతరేస్తూ దశాబ్దాల తరబడి విద్యార్ధులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఎడ్యుకేషనల్‌ ట్రస్టుల మాటున ఈ కార్పొరేట్‌ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. చదువును వ్యాపార వస్తువుగా మార్చి ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌తో విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. మరోపక్క ఎడ్యుకేషన్‌ ట్రస్టు మాటున సేవా కార్యక్రమమంటూ ఆదాయ పన్నుతో సహా ఇతర పన్నులు ఎగవేస్తున్నాయి.  ఇదేదో బయటి నుంచి వినిపించే విమర్శలు కాదు. ఈ రెండు సంస్థల వ్యవహారాలపై విచారణ జరిపిన తెలంగాణ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌విభాగం తేల్చిన నిజాలు. అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపును రద్దుచేయాలని కొద్దికాలం క్రితం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. గత ఏడాదికి సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లోని కాలేజీలను క్షుణ్నంగా తనిఖీలు చేసి ఈ నివేదిక అందించింది. ఈ రెండు సంస్థల కాలేజీలలో తనిఖీలు జరిపిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు కూడా రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌ నిర్వహించి నివేదిక తయారు చేసింది. విజిలెన్స్‌ తనిఖీ నివేదికలోని ముఖ్యాంశాలు...

అడుగడుగునా అక్రమాలే...
లాభాపేక్షలేని విద్యా సంస్థలుగా రిజిస్టరైన నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు ట్యూషన్‌ ఫీజు, కోచింగ్‌ ఫీజు, హాస్టల్‌ ఫీజు... ఇలా లక్షల్లో దండుకుంటూ విద్యార్ధులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. చారిటబుల్‌ ట్రస్టులుగా పేర్కొంటున్నా ఈ రెండు సొసైటీల్లో ప్రెసిడెంట్లు, సభ్యులంతా ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. సొసైటీ బైలాల్లో  పేద విద్యార్ధులకు ఫ్రీ కోచింగ్‌ తరగతులు, కమ్యూనిటీ డెవలప్‌మెంటు ప్రాజెక్టులు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, పేదలను ఆదుకొనేందుకు చేతి వృత్తుల కేంద్రాలు, బాల్వాడీ కేంద్రాలు, వయోజన విద్యాకేంద్రాల ఏర్పాటు అంటూ వల్లెవేసిన సంస్థలు ఇందులో ఏ ఒక్కటీ ఆచరించకపోగా విద్యను డబ్బులమయం చేశాయి.

ఈ రెండు సంస్థలు ఏటా ఫీజులు, ఇతరాల పేరిట రూ.వందల కోట్ల మేర వసూలు చేస్తున్నా ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేనట్లుగా చూపుతున్నాయి. ఎడ్యుకేషనల్‌ సొసైటీ, కమిటీల పేరిట పన్నులు ఎగవేస్తున్నాయి.
శ్రీచైతన్య విద్యాసంస్థ 2010–11, 2011–12కు సంబంధించిన ఐటీ రిటర్నులు, ఆడిట్‌ రిపోర్టు కాపీలను విజిలెన్సుకు అందించింది. వాటిని పరిశీలించిన విజిలెన్సు అధికారులు నివ్వెరపోయారు. ఆడిట్‌ రిపోర్టులో 2010–11లో రూ.200 కోట్ల మేర టర్నోవర్‌ ఉన్నట్లు చూపి ఆదాయపు పన్ను రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేదని చెబుతూ పన్నులను చెల్లించలేదు. పన్నుల ఎగవేత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది.
విద్యా వ్యాపారంలో లాభాలకోసం కాలేజీలకు శాశ్వత అఫ్లియేషన్‌ కాకుండా తాత్కాలిక అఫ్లియేషన్లు తీసుకుంటున్నాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో ఫీజులపై ఇంటర్‌ బోర్డు స్పష్టమైన నిబంధనలు విధించినా ఈ కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజులుంటున్నాయి. లైబ్రరీ, లాబొరేటరీ లాంటి ఏర్పాట్లు మచ్చుకైనా లేకుండా ఇరుకైన గదుల్లో ప్రధాన రహదారుల పక్కన అపార్టుమెంట్లలో ఈ కాలేజీలను నెలకొల్పారు.
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో ట్యూషన్‌ ఫీజుల కింద పెంచిన ప్రకారం చూసినా రూ.3 వేల లోపే తీసుకోవాలి. కానీ ఈ కాలేజీలు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు పిండుతున్నాయి. హాస్టల్, ఇతర కోచింగ్‌లంటూ అదనంగా మరో 2 లక్షలకు పైగా దండుకొంటున్నాయి.
 ఇంటర్‌ ప్రవేశాలకు సంబంధించి ఈ రెండు కాలేజీలు విక్రయించిన దరఖాస్తుల సమాచారం, అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల వివరాల రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. అడ్మిషన్లు పూర్తయ్యాక కంప్యూటర్‌ ద్వారా తీసిన కాపీలపై ఆర్‌ఐఓలతో సంతకాలు చేయించుకుంటున్నాయి.
ప్రైవేట్‌ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం ఇవ్వాల్సి ఉన్నా ఈ సంస్థలు దీన్ని పాటించడం లేదు.
లాభదాయకంగా ఉండే ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంటర్‌ బోర్డు అనుమతులు లేకుండానే తప్పుడు కోడ్‌ నెంబర్లతో కాలేజీలు నిర్వహిస్తున్నాయి.
ఒక భవనంలో కాలేజీకి అనుమతి పొంది వేరే చోటుకు మార్చేస్తున్నారు. కొన్ని కాలేజీలను తనిఖీ చేయగా అక్కడ రిజిస్టర్‌లో పేర్లున్న విద్యార్ధుల్లో కొందరు వేరేచోట చదువుతున్నట్లు గుర్తించారు.
ఎంపీసీ, బైపీసీ తరగతులు తప్పించి ఆర్ట్స్‌ తరగతులను ఈ కాలేజీలు నిర్వహించడం లేదు. అవి  అంత లాభదాయకం కాకపోవటమే కారణం. కొన్ని చోట్ల ఆర్ట్స్‌ తరగతులకు అనుమతులు తీసుకొని వాటిని ఎంపీసీ, బైపీసీ సెక్షన్లుగా మార్పు చేస్తున్నాయి.
విద్యార్ధులకు ఎలాంటి వ్యాయామ విద్యను బోధించడం లేదు.  అందుకు సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం లేదు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం.
అద్దె భవనాల్లో కాలేజీలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక అనుమతులు పొందుతున్నాయి. ఇది కేవలం అయిదేళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోపు అవి సొంత భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా అద్దె భవనాల్లోనే దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి.

ఫీజులపై కమిటీ వేయాలి...
కార్పొరేట్‌ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మండల, పట్టణ, తదితరాల వారీగా అధ్యయనం చేసి ఫీజులను నిర్ణయించాలి. ఆయా సంస్థలకు వస్తున్న ఆదాయం, జీతాల చెల్లింపు, ఖర్చులను బేరీజు వేసి ఫీజులను నిర్ణయించాలి.

విద్యాశాఖలో వియ్యంకుల వారి సంస్థ మాటే వేదవాక్కు
నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పలు బ్రాంచీలు నెలకొల్పి ఫీజుల పేరిట రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏకంగా తన కేబినెట్‌ సహచరుడిగా చేసుకోవడంతో నారాయణ విద్యాసంస్థ ఆగడాలపై అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ స్వయానా వియ్యంకులు కూడా కావడంతో విద్యాశాఖలో నారాయణ సంస్థలు చెప్పిందే వేదంగా మారిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement