సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేటు ఇంటర్మీడియేట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝళిపించింది. దసరా సెలవుల్లో నిబంధనలను అతిక్రమించి తరగతులు నిర్వహించిన 50 కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు భారీగా జరిమానా విధించింది. రోజుకు రూ.లక్ష చొప్పున కొన్ని కాలేజీలకు రూ.7 లక్షల వరకు జరిమానా విధించింది. ఈ మేరకు ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించి తరగతులను నిర్వహించిన ఆ 50 కాలేజీల్లో 2, 3 మినహా మిగతావన్నీ శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఆయా కాలేజీలు జరిమానా చెల్లించేందుకు నవంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. ఆలోగా యాజమాన్యాలు జరిమానా చెల్లించకపోతే ఆ కాలేజీల అనుబంధ గుర్తింపు రద్దు చేస్తామని, ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ కాలేజీల నుంచి పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది.
బోర్డుకు ఫిర్యాదులు..
రాష్ట్రంలో గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 20 వరకు సెలవులను ప్రభుత్వం పొడిగించింది. అయితే ఆ నిబంధనలను కొన్ని కాలేజీలు అమలు చేసినా, కొన్ని కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలు అమలు చేయలేదు. వాటిపై తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు బోర్డుకు ఫిర్యాదు చేశాయి. దీంతో బోర్డు అధికారులు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించవద్దని సూచించినా యాజమాన్యాలు పట్టించుకోలేదు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు నోటీసులు జారీ చేసినా కార్పొరేట్ యాజమాన్యాలు స్పందించలేదు. దీంతో ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు సీరియస్‌గా తీసుకుని ఆయా కాలేజీలకు జరిమానా విధించింది.
50 ప్రైవేటు కాలేజీలపై కొరడా
Published Wed, Oct 30 2019 3:07 AM | Last Updated on Wed, Oct 30 2019 3:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment