పశ్చిమగోదావరి, నిడమర్రు: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలల్లో పైసా ఖర్చులేకుండా చదివేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ ద్వారా శనివారం నుంచి 2018–19 విద్యా సంవత్సరానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 2018 మార్చి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ గ్రేడ్ పాయిట్స్ సాధించిన విద్యార్థులు ఇంటర్ విద్యను కార్పొరేట్ కళాశాలల్లో చదివేందుకు ఈ ‘కార్పొరేట్ కాలేజీ’ స్కీమ్‌లో అవకాశం ఉందన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ రెండేళ్ల చదువుకు, వసతికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
ప్రభుత్వ విద్యార్థులు మాత్రమే
♦ ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీ, పురపాలక, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, నవోదయ విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖ వసతిగృహాల్లో ఈ ఏడాది పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులు.
♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులకు ప్రాధాన్యం ఉంటుంది.
♦ వీరు ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే 10వ తరగతి విద్యనభ్యసించి ఉండాలి.
♦ 2018 మార్చిలో టెన్త్ ఫలితాల్లో కనీసం జీపీఏ 7 పాయిట్స్ సాధించి ఉండాలి.
♦ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.2 లక్షలు మించి ఉండరాదు. మిగిలిన వర్గాల విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ.లక్షకు మించి ఉండకూడదు.
♦ పదో తరగతిలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఇలా..
జిల్లావ్యాప్తంగా 255 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 50 శాతం సంక్షేమ వసతి గృహాల్లో ఉండి పదో తరగతి చదివిన విద్యార్థులకు కేటాయిస్తారు. మరో 25 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు, గురుకుల పాఠశాలల్లో నివాసం ఉండి చదివినవారికి 20 శాతం, బెస్ట్ ఎవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం సీట్లు కేటాయిస్తారు.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరణ
http://jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్‌లో కార్పొరేట్ అప్లికేషన్స్ అనే కాలం క్లిక్ చేసి అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
♦ ఎంపిక చేసిన కళాశాలల్లో ప్రాధాన్యతాక్రమంలో నాలుగు కళాశాలల వరకూ విద్యార్థి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు.
♦ మెరిట్ ప్రాతిపాదికన ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సెల్‌ఫోన్ నంబర్లకు సంక్షిప్త సమాచారం (ఎస్‌ఎంఎస్) పంపుతారు.
♦ వేల మంది దరఖాస్తుదారుల్లో నుంచి ప్రతిభావంతులైన వారిని రిజర్వేషన్ కోటా మేరకు కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలతో కలసి ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. విద్యార్థులు కోరుకున్న కళాశాలలో చదివే అవకాశం కల్పిస్తారు.
♦ ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీన ధ్రువీకరణ పత్రం అందిస్తారు.
♦ ఈ నెల 21వ తేదీలోపు కేటాయించిన కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులు తప్పకుండా చేరాలని అధికారులు తెలిపారు. లేని పక్షంలో వెయింటింగ్ లిస్టులో ఉన్నవారికి ఇస్తామన్నారు.
ఏడాదికి రూ.35 వేలు
♦ ప్రముఖ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. ఏడాదికి రూ.35 వేల చొప్పున విద్య, వసతి, భోజనం, ఇతర అన్ని ఖర్చులకు కళాశాలలకు నేరుగా ఆ నగదును అందజేస్తారు. ఇంటర్ రెండేళ్లకు కలిపి రూ.70 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది. విద్యార్థికి ప్యాకెట్ మనీగా రూ.3 వేలు మంజూరు చేస్తారు.
దరఖాస్తుతోపాటు జతపరచవల్సినవి
♦ మీసేవ ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రాలు(గతంలో విద్యార్థి ప్రీ మెట్రిక్ ఉపకార వేతనం పొందేందుకు మీసేవ నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ ఉంటే సరిపోతుంది. కొత్తగా తీసుకోవల్సిన అవసరంలేదు)
♦ విద్యార్థి ఫొటో సైజ్ పొడవు 4.5, వెడల్పు 3.5 సెంటీమీర్లు ఉండాలి
♦ వికలాంగ విద్యార్థి అయితే సంబంధిత అధికారిచే జారీ చేసిన వికలాంగ ధ్రువీకరణ పత్రం
♦ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ తప్పు లేకుండా నమోదు చేసుకోవాలి
♦ విద్యార్థి కుటుంబానికి రేషన్ కార్డు ఉంటే జతపరచాలి
Comments
Please login to add a commentAdd a comment