
సాక్షి, విశాఖ సిటీ: శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల్లో తాను ఇటీవల తనిఖీలు నిర్వహించానని, అక్కడ పిల్లలు పడుతున్న ఇబ్బందులు చాలా భయంకరంగా ఉన్నాయని మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విశాఖపట్నంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కళాశాలల్లో ఉదయం 4.30 గంటలకు మొదలు అర్ధరాత్రి 11.00 గంటల వరకూ విద్యార్థులు ఉండటం వల్ల వారిపై ఒత్తిడి పెరుగుతోందన్నారు. స్టడీ అవర్స్‌ను నాలుగు గంటలు తగ్గించడంతోపాటు ఆదివారం ఒంటిపూట మాత్రమే క్లాసులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఇంటర్ బోర్డు నిబంధనలను ప్రతి కళాశాలలో తప్పనిసరిగా పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలిచ్చారని చెప్పారు. సరైన సౌకర్యాలు లేని హాస్టళ్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశామని, నెల రోజుల్లో విద్యార్థులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకపోతే వాటిని మూసివేస్తామని మంత్రి గంటా హెచ్చరించారు.