
విద్యను వ్యాపారంగా మార్చేశాయి
కార్పొరేట్ కళాశాలలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ వ్యాఖ్య
సాక్షి, గుంటూరు: కార్పొరేట్ కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని, ఫలితంగా మట్టిలో మాణిక్యాల్లాంటి ఎందరో పేద విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని, ఇది దురదృష్టకర పరిణామమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.మాతృభాషను, గ్రామీణ క్రీడలను, సంప్రదాయాలను విస్మరించకూడదని హితవు పలికారు. గతంతో పోలిస్తే ఉపాధ్యాయులకు అన్ని సౌకర్యాలు పెరిగాయని, అదే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని చెప్పారు. వారు పాఠశాలలకు సమయం కేటాయించకుండా ఇతర పనుల్లో ఉండటమే కారణమన్నారు.