వసతుల లేమిపై అఫిడవిట్ దాఖలు చేయండి
- ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు ఆదేశం
- ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల కొరతపై పిటిషన్ల విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమికి సంబంధించి పలు అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కల్పన, ఉపాధ్యాయుల జవాబుదారీతనంపై గతంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ దీపక్ మిశ్రా నే తృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా కడప తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాల లేమిపై అమికస్ క్యూరీ అశోక్ గుప్తా నేతృత్వంలోని కమిటీ సీల్డ్ కవర్‌లో ఒక నివేదికను ధర్మాసనం ముందుంచింది. దీనిపై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ప్రభుత్వ కార్యాలయాలను నూతన రాజధానికి తరలిస్తున్న నేపథ్యంలో నాలుగు వారాల గడువు కావాలని ఏపీ తరఫు న్యాయవాది అభ్యర్థించగా ధర్మాసనం సమ్మతించింది.
తెలంగాణలో టీచర్లు వెనక్కి వెళ్లారా?
తెలంగాణలో ప్రజాప్రతినిధుల వద్ద పనిచేస్తున్న అధ్యాపక సిబ్బందిని వెనక్కి పంపిం చారా? అని కోర్టు ప్రశ్నించింది. వెనక్కి పంపినట్లు అమికస్ క్యూరీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ లోపించిందని, వలస వెళ్లే కుటుంబాల పిల్లలకు వసతి గృహాల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని పిటిషనర్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫు న్యాయవాది కె.శ్రావణ్‌కుమార్ విన్నవించారు. తెలంగాణ తరఫు సీనియర్ న్యాయవాది విశ్వనాథ్ శెట్టి స్పందిస్తూ ఈ విషయంలో కోర్టు గానీ, అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీ గానీ మార్గదర్శనం చేయాలని కోరారు. 4 వారాల్లోగా వసతి గృహాల ఏర్పాటుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
పాఠశాలల్లో మౌలిక వసతుల లేమితో పాటు పర్యవేక్షణ లోపం కూడా ఉందని శ్రావణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షకు పైగా తగ్గుతోందని, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతున్నారని వివరించారు. దీనిపై తెలంగాణ న్యాయవాది మాట్లాడుతూ కారణాలను ప్రభుత్వం గుర్తించిందని, తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిందని వివరించారు. దీంతో కార్యాచరణపై అమికస్ క్యూరీ నేతృత్వంలోని కమిటీతో పాటు, పిటిషనర్ అభిప్రాయాలను తీసుకోవాలని ధర్మాసనం సూచించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.