సాక్షి, అమరావతి: విద్యార్థుల ఆత్మహత్యలపై కార్పొరేట్ కాలేజీలను రక్షించేలా ప్రభుత్వపు ఉల్టాపల్టా వ్యవహారం బుధవారం అసెంబ్లీలో బట్టబయలైంది. విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చర్చ చేపట్టాలని.. దానిపై ప్రభుత్వం తరఫున సమాధానం చెప్పాలని ప్రభుత్వం ఇంతకు ముందు నిర్ణయించి అజెండాలో చేర్చించింది. నారాయణ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుల ఒత్తిడితో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు రేగడం, కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందంటూ విమర్శలు వస్తుండడంతో.. గత కొంతకాలంగా ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన సంగతి తెలిసిందే.
నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండగా ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉండడంతో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం రక్షిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత కొంతకాలంగా అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా బయటకూడా నిలదీస్తోంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం బహిష్కరించడంతో తమ వాదనను ఏకపక్షంగా వినిపించవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో ఆ అంశాన్ని చర్చకు అజెండాలో చేర్చింది. ఈ అంశంపై ఈనెల 13వ తేదీనే సభలో చర్చ జరిపి సమాధానం చెప్పేందుకు సిద్ధమైంది.
అప్పట్లో అలా.. ఇప్పుడిలా..
అప్పట్లో ఆత్మహత్యలకు కారణం విద్యార్థులు, తల్లిదండ్రులే కారణమని విద్యాశాఖ నోట్ రూపొందించింది. ఆ నోట్‌లో కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాల పేరును కూడా కనీసం ప్రస్తావించకుండా విద్యాశాఖ జాగ్రత్త పడింది. అయితే అంతకు ముందురోజు ఆదివారం కృష్ణానదిలో బోటు మునిగి 22 మంది యాత్రికులు మరణించారు. దీంతో మరునాడు ప్రభుత్వం నిర్ణయించిన అజెండా ప్రకారం అసెంబ్లీ కార్యకలాపాలు సాగలేదు. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చ వాయిదా పడింది. ఆ రోజున అసెంబ్లీలో చర్చలో చెప్పేందుకు విద్యాశాఖ రూపొందించిన నోట్ ‘సాక్షి ’కి చేరగా ఆ మరునాడే దాని ఆధారంగా ‘ఆత్మహత్యలకు విద్యార్థులు, తల్లిదండ్రులే కారణమట’ శీర్షికతో వార్తను ప్రచురించింది. ఈ వార్తతో ప్రభుత్వ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కంగుతిన్న ప్రభుత్వం ఆరోజున జరగాల్సిన చర్చ జరగకపోవడంతో అప్పటి నోట్‌లో మార్పులు చేసింది. పాత నోట్‌లో ఆత్మహత్యలకు కారణాల్లో యాజమాన్యాలు అన్న పదం లేకపోగా తాజాగా రూపొందించిన నోట్‌లో యాజమాన్యాలను చేర్చింది. ఈ కొత్తనోట్‌తో బుధవారం జరిగిన చర్చలో మంత్రి గంటా శ్రీనివాసరావు సమాధానం చెప్పారు. ఈ ఆత్మహత్యలకు కారణాల్లో యాజమాన్యాలూ ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment