బాబు 'దొంగ' వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన 'దొంగ' వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీవ్ర దుమారం చెలరేగింది. విద్యుత్ రంగంలో మిగులు సాధించామని, మిగులు కరెంటు సాధించామని చంద్రబాబు చెబుతుండగా, అదే సమయంలో రైతులపై కేసులు పెట్టిన అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రస్తావించారు.
ఆ సందర్భంలో, దొంగలపైనే కేసులు పెట్టామని.. మంచివాళ్లపై తాము కేసులు పెట్టలేదని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. తన పాలనలో దొంగలపై కేసులుంటాయని, కచ్చితంగా దొంగలపై కేసులు ఉంటాయని చెప్పారు. ఎవరు దొంగలైతే వారిపైనే కేసులు పెడతామని, మీరు దొంగలను సపోర్ట్ చేస్తే చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. దాంతో చంద్రబాబు వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులను దొంగలతో పోలప్చడాన్ని ఖండించింది. దాంతో తన వ్యాఖ్యలకు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పాల్సి వచ్చింది.