మా పార్టీలో నేరస్తులు లేరు: చంద్రబాబు
హైదరాబాద్: తమ పార్టీలో నేరస్తులు ఎవరూలేరని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ నేరాలకు పాల్పడవద్దని తమ ఎమ్మెల్యేలకు చెప్పినట్లు తెలిపారు. తన మీద కేసులు లేవని, కోర్టులకు వెళ్లిన దాఖలాలు కూడా లేవని చెప్పారు. తమ మీద కేసులు కూడా నిలబెట్టలేకపోయారన్నారు.
శాంతి భద్రతల అంశంపై మాట్లాడుతూ మనుషులను అనాగరికంగా చంపడం చాలా బాధాకరం అన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడం అని చెప్పారు. పెట్టుబడులు రావాలన్నా, సమాజం ఆనందంగా ఉండాలన్న శాంతి భద్రతలను కాపాడాలని, కాపాడతామని చెప్పారు. నేరాల నియంత్రణకు అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలను తీసుకొస్తామన్నారు. నేరాలను పూర్తిగా అరికడతామని చంద్రబాబు చెప్పారు.