
‘కార్పొరేట్’ వల
ఇంటర్‌లో ప్రవేశాలకు కసరత్తు
పీఆర్వోల హల్‌చల్.. తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త..
ఆదిలాబాద్ టౌన్ : పదో తరగతి పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు.. ఫలితాలు కూడా వెలువడలేదు. కానీ.. ఇప్పటికే జిల్లాలో కార్పొరేట్ కళాశాల ప్రచారం జోరుగా సాగుతోంది. పదో తరగతి విద్యార్థుల వివరాలను సైతం సేకరించారు. విద్యార్థుల ఇంటికి రాజకీయ నాయకులుచేసే ప్రచారం తలదన్నేలా ఉంది. ఫోన్ చేయడం.. ఎస్సెమ్మెస్‌లు ఇంటికి వచ్చి కళాశాలల గురించి వివరించి కళాశాలల్లో చేర్పించుకునేందుకు వల పన్నుతున్నారు. పిల్లలను తమ కళాశాలల్లో చేర్పించేందుకు ఆయా మండలాలో పీఆర్వోలను నియమించుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నజరానాలు ప్రకటిస్తున్నాయి.
ప్రైవేట్ పాఠశాలలే టార్గెట్...
జిల్లాలో 40 వేల వరకు పదో తరగతి విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లిలలో ప్రైవేటు కళాశాలల్లో డేస్కాలర్స్‌కు రూ.10 వేల నుంచి 12 వేల ఫీజు వసూలు చేస్తున్నాయి. హైదరాబాద్, చుట్టు పక్కల జిల్లాల్లో ఏడాదికి 60 వేల నుంచి రూ.లక్ష వరకు ఫీజులు ఉన్నాయి. అయితే.. తమ కళాశాలల్లో చేరితే ఫీజుల్లో రాయితీ ఇస్తామంటూ విద్యార్థులకు వల వేస్తున్నారు. 9 గ్రేడింగ్ పైన వచ్చిన వారికి డిస్కౌంట్ ఇస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు.
కాగా.. కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రైవేటు పాఠశాలలనే టార్గెట్ చేసుకొని ముందుకు సాగుతున్నాయి. దీనికి ప్రిన్సిపాళ్లను మచ్చిక చేసుకొని విద్యార్థుల పేర్లు, వారి అడ్రస్‌లు సేకరించి తల్లిదండ్రులకు కళాశాలలకు సంబంధించిన సమాచారాన్ని మేసేజ్ ద్వారా, పోస్టు ద్వారా పంపిస్తున్నారు. పిల్లలను చేర్చుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకుంటున్నారు.
పీఆర్వోలకు ఆఫర్లు..
కార్పొరేట్ కళాశాలలు మండలాల వారీగా పీఆర్వోలను నియమించాయి. హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన వారితోపా టు స్థానికంగా ఉండే ప్రైవేటు పాఠశాలల టీచర్లు, కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఎల్‌ఐసీ ఏజెంట్లకు కమీషన్లు అంది స్తూ విద్యార్థులను చేర్చడానికి పావులు కదుపుతున్నాయి. ఒక్క విద్యార్థిని చేర్పిస్తే రూ.3,500 నుంచి రూ.7 వేల వరకు అందిస్తున్నాయి. టార్గెట్ పూర్తి చేసిన వారికి టూర్స్, వారి దగ్గరి బంధువుల పిల్లలకు ఫీజుల్లో రాయితీ ఆఫర్లు ఇస్తున్నాయి.
స్థానిక కళాశాలలదీ అదేతీరు..
ప్రైవేటు కళాశాలలు ఆదిలాబాద్ పట్టణంతోపాటు ఆయా మండలాల్లోని విద్యార్థులకు వల వేస్తున్నాయి. కళాశాలలో బోధించిన లెక్చరర్లకు టార్గెట్ విధిస్తున్నారు. 9.5 గ్రేడింగ్ నుంచి 9.9 గ్రేడింగ్ వచ్చిన విద్యార్థులకు ఫ్రీ సీట్లు ఇస్తామని ప్రకటిస్తున్నారు. విద్యార్థుల ఇంటికి వెళ్లి ఫీజు రాయితీ, స్కాలర్ షిప్ వచ్చే విద్యార్థులకు కేవలం రూ.500తో తమ కళాశాలల్లో అడ్మిషన్ కల్పిస్తామని అంటున్నారు. గతేడాది కూడా ఇదే విధంగా చేర్పించుకొని పరీక్షల సమయంలో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
పదో తరగతి ఫలితాలు రాక ముందు అడ్మిషన్లు తీసుకొవద్దు. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయిస్తాం. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వ కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనుభవజ్ఞులైన లెక్చర ర్లు విద్యాబోధన చేస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లో వేల ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో చేరితే మంచి విద్యతోపాటు ఉచితంగా చదుకునే అవకాశం ఉంది. - ప్రభాకర్, ఆర్‌ఐవో ఆదిలాబాద్