రాష్ట్ర ప్రభుత్వ అలసత్వంతో విద్యార్థులకు తప్పని కష్టాలు
నాలుగైదు రోజుల్లో ఇంటర్ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు
అందుకు లాంగ్ మెమోను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి
లేదంటే విద్యార్థులు స్కాలర్‌షిప్‌ను కోల్పోయే ప్రమాదం
కానీ సమైక్య సమ్మెతో ఇప్పట్లో మెమోల పంపిణీ కష్టమే
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలై నాలుగు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఇంకా అధికారిక మెమోలు అందలేదు. తాత్కాలిక మెమోలతోనే ఇంటర్ కాలేజీల్లో చేరిన 10 లక్షల మందికి పైగా విద్యార్థులు, అధికారిక మార్కుల జాబితాలు ఎప్పుడు వస్తాయోనన్న ఆందోళనలో పడ్డారు. ఎందుకంటే మరో మూడు నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే స్కాలర్‌షిప్‌ల ప్రక్రియ కోసం అధికారక మెమోలు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వారు స్కాలర్‌షిప్‌ను కోల్పోయే ప్రమాదముంది. మామూలుగానైతే ఫలితాలు ప్రకటించిన నెల రోజుల్లోనే అధికారిక మెమోలు విద్యార్థులకు చేరాలి. మరీ ఆలస్యమైనా రెండు మాసాల్లోనైనా చేరి తీరాలి. ఈ ఏడాది మే 17న పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించారు. కానీ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నాలుగు మాసాలు కావస్తున్నా ఈసారి లాంగ్ మెమోల జాడే లేదు.
నాలుగు రోజుల్లో దరఖాస్తుల ప్రక్రియ
స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో ప్రకటన వెలువడనుంది. దరఖాస్తు కోసం కచ్చితంగా అధికారిక మార్కుల జాబితాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. దీంతో లక్షలాది మంది విద్యార్థులకు ఇప్పుడు ఆందోళన మొదలైంది. ప్రభుత్వ నిర్వాకం వల్ల మార్కుల మెమోల జారీలో ఆలస్యం అవుతోంది. సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందంతా సమ్మెలో ఉండటమే ఆలస్యానికి కారణమని అధికారులంటున్నా, ఇతరత్రా అనేక కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమ్మె ఎప్పుడు విరమిస్తారన్న దానిపై స్పష్టత లేని నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మెమోలను పంపినా అవి సకాలంలో విద్యార్థులకు అందుతాయో లేదోననే గందరగోళం నెలకొంది. అందకపోతే అకారణంగా తాము నష్టపోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు.
పరీక్షల విభాగం వైఫల్యమే
మార్చి 22-ఏప్రిల్ 9 మధ్య జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు మే 17న విడుదలయ్యాయి. రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి 9,89,478 మంది పాసయ్యారు. జూన్‌లో జరిగిన అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో మరో 83,131 మంది పాసయ్యారు. ఇంటర్‌లో చేరినా వీరెవరికీ లాంగ్ మెమోలు ఇంతవరకు అందలేదు. ఫలితాలొచ్చి నాలుగు నెలలవుతున్నా అసలు ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి మెమోలు జిల్లాలకు వెళ్లనే లేదు. ఈ ఘోర వైఫల్యానికి బోర్డు అలసత్వమే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ విద్యార్థుల మెమోల ముద్రణ మే నెలకు ముందే పూర్తయి పరీక్షల విభాగానికి అందినా వాటిని వెంటనే జిల్లాలకు పంపడంలో అధికారులు జాప్యం చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు విద్యార్థుల మెమోల ముద్రణ కొంత ఆలస్యమవడంతో అన్నీ కలిపి ఒకేసారి పంపించాలనే ఆలోచనల నేపథ్యంలో జాప్యం జరిగినట్టు సమాచారం.
అంతా సమ్మెలోనే.. ఇప్పట్లో మెమోలు కష్టమే!
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతి రేకిస్తూ సీమాంధ్రలో ఆగస్టు 15 నుంచి విద్యా శాఖ ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. 21వ తేదీ నుంచి ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగారు. డీఈఓ కార్యాలయాల సిబ్బంది, పాఠశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం సమ్మెలోనే ఉండటంతో మెమోలను ఎవరికి పంపాలి, స్కూళ్లలో వాటిని విద్యార్థులకు పంపిణీ చే సే బాధ్యతను తీసుకునేది ఎవరు వంటివాటిపై గందరగోళం నెలకొంది. అధికారులు ముందుగా మేల్కొంటే సమస్య తలెత్తేదే కాదని విద్యాశాఖ వర్గాలే అంటున్నాయి.
నాలుగైదు రోజుల్లో పంపుతాం
‘‘ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో విద్యార్థులకు మెమోలు పంపిం చేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాం. స్కూళ్లలో బాధ్యులకు మెమోలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. నాలుగైదు రోజుల్లో మెమోలు విద్యార్థులకు అందేలా ఏర్పాట్లు చేస్తున్నాం’’
- మన్మథరెడ్డి, డెరైక్టర్, ప్రభుత్వ పరీక్షల విభాగం
టెన్త్ ఫలితాలు వచ్చి నాలుగు నెలలైనా అందని లాంగ్ మెమోలు
Published Fri, Sep 13 2013 3:23 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
Advertisement
Advertisement