తాము కన్న కలలు తమ పిల్లలు తీర్చాలనుకునే తల్లిదండ్రులు.. మార్కుల వేటలో తమ విద్యార్థులు రికార్డులు బద్దలు కొట్టాలనుకునే కార్పొరేట్ కళాశాలు.. నేటి విద్యార్థిని మరమనిషిలా మార్చేస్తున్నాయి. అందుకే ఇప్పటి స్టూడెంట్స్ ఆల్జీబ్రా సూత్రాలు వంట బట్టించుకున్నంత ఈజీగా జీవిత సూత్రాలు గ్రహించలేకపోతున్నారు. కెమికల్ ఈక్వేషన్స్‌లో బ్యాలెన్సింగ్ చూపుతున్న ప్రతిభ.. ప్రాక్టికల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడంలో చూపలేకపోతున్నారు. ఈ మాట చెబుతున్నది ఎవరో కాదు ఈ తరం భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న అధ్యాపకులే. ఆ తరం విద్యార్థులుగా, ఈ తరం అధ్యాపకులుగా ఉన్న పలువురు లెక్చరర్లను సాక్షి సిటీప్లస్ తరఫున సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పలకరించారు.
- స్టార్ రిపోర్టర్
పరుచూరి గోపాలకృష్ణ: గతంలో 11 ఏళ్లు లెక్చరర్‌గా పనిచేసిన నేను ఈ రోజు మిమ్మల్ని పలకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మానాన్నలు జన్మనిస్తే...ఆ జన్మ సార్థకానికి కావాల్సిన జ్ఞానాన్ని ఇచ్చేది గురువు. అలాంటి వృత్తిని ఎంచుకోవడం వెనకున్న కారణాలు చెప్పండి?
అజిత సురభి: మన పిల్లల్ని మనం చూసుకోవడంలో గొప్పలేదండి. ఇతరుల పిల్లల్ని మన పిల్లలుగా భావించి వారి భవిష్యత్తుకి పునాదులు వేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ దొరకదు కదా.
గోపాలకృష్ణ: గొప్పగా చెప్పావు తల్లీ!
రామచంద్రరావు: నా దృష్టిలో హీరో అంటే గురువే. అంతకు మించిన స్థానం మరొకటి ఉండదు. చిన్నప్పుడే టీచర్ కావాలనుకున్నా. అధ్యాపకుడిగా 20 ఏళ్ల అనుభవం సాధించాను. ప్రస్తుతం విజ్ఞాన్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా ఉన్నాను.
గోపాలకృష్ణ: అవును. గురువు మాట్లాడుతుంటే ఎంతటి వారైనా చేతులు కట్టుకుని వినాల్సిందే.
సత్యలత: ఈ వృత్తిలో ఉన్నంత సంతృప్తి మరెందులోనూ ఉండదు.
పరమశివం: 23 ఏళ్లుగా లెక్చరర్‌గా పని చేస్తున్నాను. మనిషికి తల్లి గర్భం ఎంతో క్లాస్ రూమ్ కూడా అంతే.
గోపాలకృష్ణ: శభాష్.. భలేగా చెప్పారు.
హేమలతారెడ్డి: నేను 15 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నాను. ప్రస్తుతం జాహ్నవి కాలేజీ ప్రిన్సిపాల్ చేస్తున్నాను. పిల్లల్లో ఉండే టాలెంట్ గుర్తించి ఎంకరేజ్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తాను.
గోపాలకృష్ణ: ఒకే.. మీరంతా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు. ఫ్రాంక్‌గా చెప్పండి. గవర్నమెంట్ కాలేజీలో విద్య నాణ్యత బాగుంటుందా, ప్రైవేట్‌లోనా..?
పడాల: రెండింటిలో బాగుంటుందండి. చిన్న తేడా, ప్రభుత్వ కళాశాలల్లో పిల్లలే చదువుకుంటారు. ప్రైవేట్ కాలేజీల్లో తల్లిదండ్రులు, లెక్చరర్లు దగ్గరుండి చదివిస్తారు.
రామచంద్రరావు: అవును సార్. చదువు పేరుతో తల్లిదండ్రులు, కార్పొరేట్ కాలేజీలు మూకుమ్మడిగా వేధిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటి పేరెంట్స్ పిల్లల్ని పెరగనివ్వడం లేదు, పెంచుతున్నారు. వాళ్లకు నచ్చినట్టుగా.. ప్రణాళికలు రూపొందించుకుని మరీ పిల్లలపై రుద్దుతున్నారు.
గోపాలకృష్ణ: అవును...ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎంత చదవాలో.. అన్నీ తల్లిదండ్రులే నిర్ణయిస్తున్నారు.
హేమలతారెడ్డి: ఈ తరం పిల్లలు.. ఇలా, అలా అంటూ జనరేషన్ పేరుతో వారిని దూషించడం కరెక్ట్ కాదండి. పిల్లలెప్పుడూ బంగారాలే. మనం ట్రీట్ చేసే విధానంలోనే ఉంటుంది.
గోపాలకృష్ణ: మా తరం చదువుకునే రోజుల్లో టీచర్లేమిటి, లెక్చరర్లేమిటి తేడా వచ్చినా ఊరుకునేవారు కాదు. ఒక తిట్టు మాలో పౌరుషం నింపి వెంటనే మార్కుల్లో మార్పు వచ్చేలా చేసింది. ఇప్పుడెలా ఉంది ?
అజిత సురభి: ఇప్పుడలా లేదు సార్. పిల్లలు చాలా సెన్సిటివ్‌గా మారిపోయారు. ఒకమాట అనాలన్నా భయమేస్తోంది.
జ్యోతిరాజు: తల్లిదండ్రులే భయపడుతున్నారు.
ఒక్కగానొక్క బిడ్డ వాడేమైనా చేసుకుంటే ఎలా అని గాబ రా పడుతున్నారు.
గోపాలకృష్ణ: ఫలానా విద్యార్థి భవిష్యత్తులో ఏం సాధించగలడు? అన్న విషయం వాడికి పాఠం చెప్పేవాడికే తెలుస్తుంది. పూర్వం తల్లిదండ్రులు కాలేజీకొచ్చిమరీ అడిగేవారు...‘మావాడు దేనికి పనికొస్తాడని...?’
సత్యలత: ఇప్పుడు పేరెంట్సే డిసైడ్ చేసేస్తున్నారు. ఏ ర్యాంకు రావాలో కూడా ముందే చెబుతున్నారు.
గోపాలకృష్ణ: పూర్వం తల్లిదండ్రులు సరిగ్గా చదవకపోతే ఇరగ్గొడతామని బెదిరించేవారు. ఇప్పడంతా రివర్స్ అయిపోయింది కదా !
హేమలతారెడ్డి: పిల్లలు అడక్కుండానే ఆఫర్లు ఇచ్చేస్తున్నారండి. నీకు మొదటి ర్యాంకు వస్తే.. ఐఫోన్ కొనిస్తానని, అబ్బాయిలకైతే బైక్ కొనిస్తానని ఆశ చూపించి చదివిస్తున్నారు.
రాజేశ్వరి: దానికి తోడు ఉద్యోగాల వల్ల తల్లిదండ్రులూ పిల్లలతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నారు. అది కూడా వారిపై ప్రభావం చూపుతోంది.
గోపాలకృష్ణ: కాస్త తీరిక దొరికితే సెల్‌ఫోన్లలతో బిజీ అయిపోయే విద్యార్థుల మనసుని చదువుపైకి మళ్లించడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు?
రామచంద్రరావు: సెల్‌ఫోన్ అంటే ఫోన్ చేసుకోవడం ఒక్కటే కాదు కదా! ఎంతసేపు ఫేస్‌బుక్, వాట్సప్ వాటితోనే గడుపుతున్నారు. అలాంటి వారి చేతుల్లో చూస్తే చాలా కోపం వస్తుంటుంది. ఒకటికి రెండుసార్లు చెబుతుంటాం.
గోపాలకృష్ణ: ఈ మధ్యనే విన్నాను.. పేరున్న కార్పొరేట్ కాలేజీల్లో లెక్చరర్లు తెల్లవారకుండా పిల్లలకు చదవమంటూ మేసేజ్‌లు పంపుతున్నారట?
జ్యోతిరాజు: ఉదయం నాలుగున్నరకే మొదలవుతున్నాయట.
స్వప్న: వారంతా ర్యాంకర్స్‌కి సెలక్ట్ అయిన వారై ఉంటారు.
గోపాలకృష్ణ: అంటే?
రామచంద్రారావు: అంటే క్లాస్‌లో బాగా చదివే ఓ ఐదుగురు స్టూడెంట్స్‌ని సెలక్ట్ చేసి వారికి స్పెషల్ టీచింగ్ చేస్తుంటారు. నాకు తెలిసి ఆ విద్యార్థుల స్టడీ అవర్స్ 15 గంటల వరకూ ఉంటాయి.
గోపాలకృష్ణ: అంటే వారంతా రేసుగుర్రాలా?
సత్యలత: అంతేగా సార్. వారంతా తిండి, నిద్ర, విశ్రాంతి, పండుగలు, సరదాలు వదులుకుని ర్యాంకులు సంపాదిస్తే ఆయా కాలేజీ వాళ్లు టీవీల్లో యాడ్స్ వేసుకుని ప్రచారానికి దిగుతారు.
గోపాలకృష్ణ: చూస్తున్నాను.. వన్, టు, త్రి, ఫోర్ అన్నీ ర్యాంకులు మావే అంటూ తెగ వాయించేస్తుంటాయి? నాకు తెలియక అడుగుతున్నాను. గవర్నమెంట్ కాలేజీ పిల్లలకు ర్యాంకులు రావా?
విజయసుధ: బ్రహ్మాండంగా వస్తాయి సార్. కానీ పబ్లిసిటీ ఉండదు.
గోపాలకృష్ణ: మరి వేయాలి కదా! లేదంటే గవర్నమెంట్ కళాశాలలో విద్య లేదు, ర్యాంకులు లేవనుకుంటారు కదా.
పడాలా: నేను ఒకటి చెబుతాను సార్. గవర్నమెంట్ కాలేజీలో 70 శాతం మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ప్రైవేటు కాలేజీలో 99 శాతం మార్కులు తెచ్చుకున్నవాడితో సమానం సార్.
గోపాలకృష్ణ: అంతేగా.. మనకు మనం చదువుకుంటే నాలెడ్జ్ అవుతుంది.
ఒకరి కోసం చదువుకుంటే ర్యాంకు అవుతుంది.
ఓకే.. విద్యార్థులు మారలేదు... తల్లిదండ్రులే మారారంటున్నారు, ప్రభుత్వ కళాశాలల విద్య ముందు కార్పొరేట్ కళాశాలల విద్య ఎక్కువ కాదు, పిల్లల్ని పెరగనివ్వాలి కానీ, పెంచకూడదు.. అంటూ నాతోటి లెక్చరర్లు చెప్పిన మాటలు విన్నారు కదా!
ఈ గురువులు చెప్పిన మాట పిల్లలకు కాదు, తల్లిదండ్రులకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ.
గోపాలకృష్ణ: సరే.. ఇంకా..?
అజితసురభి: మేం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాం సార్.
గోపాలకృష్ణ: ఓ.. తప్పకుండా.
అజితసురభి: సినిమాల్లో లెక్చరర్‌ని చూపించే పద్ధతిని మీరెంత వరకూ సమర్థిస్తారు?
గోపాలకృష్ణ: నేను అస్సలు సమర్థించను. నా స్టూడెంట్ అయిన ఎమ్మెస్ నారాయణకు కూడా చాలాసార్లు చెప్పాను. లెక్చరర్‌ని కించపరుస్తూ పాత్రలు చేయవద్దని. నేను మాత్రం ఇప్పటి వరకూ గురువుని తక్కువ చేస్తూ ఒక్క డైలాగ్ కూడా రాయలేదు.
హేమలతారెడ్డి: గురువుని గొప్పగా చూపించకపోయినా ఫర్వాలేదు సార్. కామెడీ క్యారెక్టర్‌ని చేయడం మాత్రం సిగ్గుచేటు.
ప్రజెంటేషన్: భువనేశ్వరి
ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
పిల్లలంటే రేసుగుర్రాలు కాదు..
Published Sat, Jan 17 2015 10:53 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement