సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటుచేసిన ‘గ్రీవెన్సెస్ రిడ్రసెల్ సిస్టమ్’ అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే.. వాటిని పరిష్కరించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను (http://bigrs. telangana.gov.in/) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌ను రూపొందించింది. వారంలో తెలుగులోనూ ఫిర్యాదులను స్వీకరించేందుకు చర్యలు చేపట్టింది. సెలవులు మొదలుకొని పరీక్ష ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్లు, మెమోలు, ఫలి తాలు, వాటిల్లో దొర్లే పొరపాట్లు తదితర 36 రకాల ఫిర్యాదులను స్వీకరించేలా ఏర్పాట్లు చేసింది.
అలాగే ఇతర సమస్యలను పేపరుపై రాసి అప్‌లోడ్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి గడువు విధించింది. సమస్య పరిష్కారమైనదీ లేనిదీ విద్యార్థి తెలుసుకునేందుకు రిఫరెన్స్ నంబర్‌ను (విద్యార్థి మొబైల్‌కు పంపనుంది) ఇవ్వనుంది. ఫిర్యాదుల పరిష్కారంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేసింది. అంతేకాదు రెండు మూడు రోజుల్లో మొబైల్ యాప్ తీసుకురానుంది. వెబ్‌సైట్‌లో విద్యార్థి తన మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారంగా వెబ్‌సైట్‌లోకి ఎంటర్ అయి ఫిర్యాదు చేయవచ్చు. విద్యార్థి తన ఫిర్యాదును అధికారులు పరిష్కరించలేదని భావిస్తే మళ్లీ ఆన్‌లైన్‌లోనే రెయిజ్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, జీమెయిల్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు: సీఎస్
మార్చిలో జరిగే పరీక్షలకు 9.65 లక్షల మంది హాజరు కానున్నారని, అందులో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. సీఎస్ స్థాయి వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నారంటే ప్రభుత్వం విద్యార్థుల విషయంలో ఎంత సీరియస్ ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, సీజీజీ డీజీ రాజేంద్ర నిమ్జే, బోర్డు అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment