
సాక్షి, అమరావతి: ఇప్పటికే పాఠశాల విద్యతోపాటు ఉన్నత విద్యా రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇక ఇంటర్మీడియెట్ విద్యను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో ప్రైవేట్ కాలేజీలదే పెత్తనం. ప్రమాణాల మేరకు నడుస్తున్న ప్రైవేట్ కాలేజీల సంఖ్య అంతంతమాత్రమే. కనీస ప్రమాణాలు పాటించని ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ కాలేజీల్లో తనిఖీల కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రైవేట్ రంగంలోని కొన్ని జూనియర్ కాలేజీలు ప్రమాణాలకు పాతరేసి, ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తేల్చింది. కనీస మౌలిక వసతులు ఉన్నా కూడా కొన్ని కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని గుర్తించింది.
న్యాయ శాఖతో సంప్రదింపులు
ప్రమాణాలు పాటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఇంటర్మీడియెట్ బోర్డు చట్టంలో వెసులుబాటు లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి కాలేజీల అనుమతులను రద్దు చేసేందుకు బోర్డు చట్టంలో సవరణలు తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన కసరత్తును చేపట్టారు. చట్టంలో ఎలాంటి సవరణలు తీసుకురావాలన్న దానిపై విద్యా శాఖ అధికారులు న్యాయ శాఖను సంప్రదిస్తున్నారని ముఖ్యమంత్రి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్ తెలిపారు. చట్టంలో సవరణలకు వీలైతే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుందని పేర్కొన్నారు. కనీస ప్రమాణాలు పాటించని 500 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, 200 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని పి.వి.రమేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment