సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్ బోర్డు ద్వారా చేపట్టిన చర్యలతో ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల అడ్డగోలు వ్యవహారాలకు అడ్డుకట్ట పడుతోంది. ఇష్టానుసారంగా ప్రవేశాలు, ఫీజుల వసూలు తతంగానికి తెరపడనుంది. అనధికారికంగా హాస్టళ్ల నిర్వహణ, బోర్డు నిబంధనల ప్రకారం కాకుండా సొంత సిలబస్ బోధన, కోచింగ్‌ల పేరిట రూ.లక్షల్లో ఫీజుల వసూలు వంటి వ్యవహారాలు ఇక సాగవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగంలో సంస్కరణలపై ప్రధానంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. విద్యారంగంలో ప్రమాణాలు పెంచేందుకు పాఠశాల, ఉన్నత విద్యలకు సంబంధించి రెండు కమిషన్లను ప్రభుత్వం నియమించింది. పాఠశాల, ఇంటర్మీడియెట్ విద్యలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు, అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు దక్కేందుకు, నిరుపేద మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగేందుకు పలు సంస్కరణలను ప్రారంభించింది.
- ఇంటర్మీడియెట్‌లో ప్రవేశాల కోసం ఇంటర్ బోర్డు ప్రకటించే షెడ్యూల్‌ను ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు గతంలో ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించేవి.
- నిబంధనల ప్రకారం కాలేజీల్లోని మొత్తం సీట్లలో షెడ్యూల్డ్ తరగతులకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29%.. అందులోబీసీ–ఎకి 7%, బీసీ–బికి 10%, బీసీ–సికి 1%, బీసీ–డికి 7%, బీసీ–ఈకి 4% చొప్పున ఇవ్వాలి. ఇక దివ్యాంగులకు 3%, ఎన్‌సీసీ, స్పోర్ట్సు కోటా కింద 5%, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3% సీట్లు కేటాయించాలి.
- ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయించాలి.
- ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు నిర్దేశిత కోటాను పక్కనపెట్టి ఇష్టానుసారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు చేపడుతున్న చర్యలతో వీటికి తెరపడనుంది.
- వచ్చే విద్యాసంవత్సరం(2020–21) నుంచి ఇంటర్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్ విధానాన్ని(ఈ–అడ్మిషన్లు) ప్రవేశపెడుతున్నట్లు ఇటీవల ఇంటర్మీడియెట్ బోర్డు సర్క్యులర్ విడుదల చేసింది. మే–జూన్ నెలల్లో ఈ ప్రవేశాలుంటాయని స్పష్టం చేసింది.
- ఆన్‌లైన్ విధానంతో ప్రతి ఇంటర్మీడియెట్ కాలేజీలోనూ ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. తద్వారా నిరుపేద మెరిట్ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
- ఈ–అడ్మిషన్ల విధానంలో ఇకపై అనుమతికి మించి విద్యార్థులను చేర్చుకోవడం సాధ్యం కాదు.
- కార్పొరేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి చెక్ పెడుతూ ప్రభుత్వం ఇటీవల జీఓ నం.57 జారీ చేసింది.
- ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం డేస్కాలర్స్ నుంచి ఏడాదికి రూ.12,500 చొప్పున మాత్రమే వసూలు చేయాలి. కానీ, బడా కాలేజీలు రూ.లక్ష దాకా దండుకుంటున్నాయి.
- ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు మించి అధికంగా వసూలు చేస్తే సదరు కాలేజీలపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
- ఏ కాలేజీలో ఎంత మేరకు ఫీజులు వసూలు చేయాలన్న విషయాన్ని ఇకపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించనుంది.
- హాల్ టికెట్ల విషయంలో విద్యార్థులను కాలేజీల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందుకే ఇంటర్ బోర్డు వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకొని, పరీక్షలకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించింది.
- కాలేజీల కోసం అనుమతులు పొంది ఇతర కోచింగ్ క్లాస్‌లు నిర్వహించడానికి వీల్లేదని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇంటర్ బోర్డు నిర్ణయించిన పాఠ్యాంశాలను బోధించాల్సిందేనని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment