
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రారంభం
పకడ్బందీగా ఏర్పాట్లు 84 కేంద్రాల్లో పరీక్ష
ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవో రాజారావు
విజయవాడ : ఇంటర్ ప్రాకిక్టల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్‌ఐవో ఆర్. రాజారావు తెలిపారు. స్థానిక మారుతీనగర్‌లోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజారావు మాట్లాడుతూ జిల్లాలో 290 ఇంటర్ కళాశాలలు, 33 వోకేషనల్ కోర్సులు కళాశాలలు కలిపి 323 కళాశాలు ఉన్నాయని వీటిలో 184 కళాశాలలను ఎంపిక చేసి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 34,441 మంది ఎంపీసీ విద్యార్థులు, 13,508 మంది బైపీసీ విద్యార్థులు, మొదటి సంవత్సరం వోకేషనల్ కోర్సు విద్యార్థులు 965 మంది, రెండో సంవత్సరం వోకేషనల్ కోర్సు విద్యార్థులు 1477 మందికి ఈఏడాది హల టిక్కెట్లు జారీ చేశామని చెప్పారు. గురువారం నుంచి 16వ తేదీ వరకు మొదటి దశ, 18 నుంచి 22వ తేదీ వరకు రెండో దశ, 23 నుంచి 27 వరకు మూడో దశ, 28 నుంచి మార్చి 4 వరకు నాలుగో దశల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్‌బోర్డు ఆర్‌ఐవో నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన డిస్టిక్ ఎగ్జామినేషన్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తానని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు మల్లయ్యస్వామి (నూజివీడు),రవికుమార్ (మువ్వ) ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల లెక్చరృర్ జి,శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ విభాగం నుంచి ఉండే హైపవర్ కమిటీ సభ్యులు, పెడన ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ బీఎస్‌ఆర్‌వీ ప్రసాద్ లు సభ్యులుగా ఉంటారని వివరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గటంల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని చెప్పారు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 102 ఆన్‌ఎయిడెడ్ కళాశాలకు ప్రభుత్వ శాఖల నుంచి అధికారులను చీఫ్ సూపరింటెండెంట్‌లుగా నియమించామన్నారు.