- పరీక్షలకు హాజరుకానున్న 9.93 లక్షలమంది విద్యార్ధులు
- 1363 పరీక్ష కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీకెమెరాలు
- -విద్యార్ధులు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్లను నమోదు చేయించుకోవాలి. హాల్ టిక్కెట్లపై ముద్రించి ఉండే ఆధార్ నెంబర్ తమదో కాదో సరిచూసుకోవాలి.
- -హాల్ టిక్కెట్‌లోని తమ పేరు, మాధ్యమం, సబ్జెక్టుల పేర్లు, ఇతర అంశాలను సరిచూసుకోవాలి. తప్పులున్నట్లయితే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాళ్ల దృష్టికి తెచ్చి వాటిని సరిచేయించుకోవాలి. హాల్ టిక్కెట్లు లేకుండా ఏ విద్యార్థిని పరీక్షకు అనుమతించరు.
- -కేంద్రాలకు పరీక్ష సమయం ఉదయం 9 గంటలకన్నా అరగంట ముందుగా 8-30 గంటలకు చేరుకోవాలి. 9 తరువాత అనుమతించరు.
- -ఓఎమ్మార్ బార్‌కోడ్ షీట్లలోని పేరు, సబ్జెక్టు, ఇతర అంశాలను సరిగా గుర్తించాలి. తప్పుడు గుర్తింపు వల్ల ఫలితాల వెల్లడిలో తప్పు ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక అభ్యర్ధులు ఓఎమ్మార్ బార్‌కోడింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే తప్పుడు ఫలితాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
- -అభ్యర్ధులు రాత, ప్రింటింగ్ మెటీరియల్‌ను, సెల్‌ఫోన్లు, పేజర్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమతో పాటు తీసుకువెళ్లరాదు.
- -పరీక్ష ముగింపు చివర్లో అభ్యర్ధులు తమ సమాధాన పత్రాలను ఇన్విజిలేటర్లకు సమర్పించి వారినుంచి హాల్‌టిక్కెట్లను తీసుకోవాలి,
- -ద్వితీయ సంవత్సరం హ్యూమానిటీస్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీ, సివిక్స్ పరీక్షలకు సంబంధించి పాత, కొత్త సిలబస్‌లతో వేర్వేరు ప్రశ్నపత్రాలను పంపిణీ చేయనున్నారు. కనుక ఆయా అభ్యర్ధులు పరీక్ష రాసేముందే అభ్యర్ధులు ప్రశ్నపత్రం తమకు సంబంధించినదో కాదో సరిచూసుకోవాలి.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్-2016 పబ్లిక్ పరీక్షలు మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1363 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు 9,93,891 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు 2వతేదీనుంచి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 3వ తేదీనుంచి ప్రారంభమవుతాయి. మార్చి 21వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి.
ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు ఈ పరీక్షలు జరుగుతాయని, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్మీడియెట్‌బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ తెలిపారు. హైదరాబాద్, విజయవాడలలో కంట్రోల్‌రూములను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో 117 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించగా వాటిలో సున్నిత 35 కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇతర కాలేజీలకు నిర్ణీత పరిధికన్నా దూరంగా ఉన్న 55 కేంద్రాలను సెల్ఫ్ పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటుచేశారు.
బాలురే అధికం
ఇంటర్మీడియెట్ ప్రధమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే 9,93,891 మంది బాలికల (4,85,758 మంది) కన్నా బాలురు (5,08,133మంది) అధికంగా ఉన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలకు 5,00,419 మందిలో బాలురు 2,51,450 మంది కాగా బాలికలు 2,48,969 మంది. ద్వితీయ సంవత్సరంలో 4,93,472 మందిలో బాలురు 2,56,683మంది, బాలికలు 2,36,789 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 13 జిల్లాల్లో జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీలను, జిల్లా కలెక్టర్లు ఛైర్మన్లుగా హైపవర్ కమిటీలను ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా, పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో 80 ఫ్లయింగ్ స్క్వాడ్లను, 65 సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటుచేశారు. పరీక్షల సమయంలో విద్యార్ధులకు ఇబ్బంది కలుగకుండా బస్సు, విద్యుత్ , వైద్యం, మంచినీరు తదితర సదుపాయాలను ఆయా విభాగాలు కల్పించనున్నాయి. జిల్లాల వారీగా ప్రత్యేక పరిశీలకులను నియమించారు.
విద్యార్ధులు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలి: