సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తంగా 4,18,402 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,56,186 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,65,971 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
వారిలో 1,26,117 మంది ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారుండగా, 39,854 మంది వార్షిక పరీక్షల్లో ఫెయిలై, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలకు 12,707 మంది హాజరవ్వగా, 7,214 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ జనరల్ విద్యార్థులు 1,42,144 మంది పరీక్షలు రాయగా.. 59,233 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 7,365 మంది పరీక్షలకు హాజరవ్వగా, 3,977 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది.
16 నాటికి మార్కుల మెమోలు, రిజిస్టర్లు..
విద్యార్థుల మార్కుల మెమోలు, రిజిస్టర్లను ఈ నెల 16వ తేదీ నాటికి పంపిస్తామని, ప్రిన్సిపాళ్లు వాటిని సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వద్ద నుంచి తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. వాటిలో ఏమైనా పొరపాట్లుంటే సంబంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా వచ్చే నెల 8లోగా ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇక విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (https://tsbie.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. రీకౌంటింగ్ కోసం ప్రతి పేపర్‌కు రూ.100 చెల్లించాలని, రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం ప్రతి పేపరుకు రూ.600 చెల్లించాలని వివరించారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణాధికారి సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేటు విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రైవేటు విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ అంతమవుతుందని ఆశించామని.. కానీ అలా జరగడం లేదని లేఖలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment