'ఇంటర్ బోర్డుకు లంచం ఇవ్వకపోవడం వల్లే'
హైదరాబాద్: 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు అందకపోవడంపై వాసవి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ బోర్డు అధికారులకు లంచం ఇవ్వకపోవడం వల్లే తమ విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయకపోవడానికి ఇంటర్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసినా ఫరవాలేదని.. తనతో పాటు బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతేడాది జూన్ నెలలోనే పర్మీషన్ ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కళాశాలను పరిశీలించడానికి వచ్చిన అధికారులు పర్మీషన్ ఇచ్చారని చెప్పారు. అఫ్లియేషన్ ఇవ్వడానికి మాత్రం లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు. దాదాపుగా రూ.2 లక్షలు అధికారులకు లంచంగా ఇచ్చినట్లు తెలిపారు. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. ఇవ్వనందుకు జూన్ నుంచి బోర్డు చుట్టూ తిప్పించుకున్నట్లు చెప్పారు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారని.. ఇప్పుడేమో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్తును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.