Halltickets
-
25 నుంచి వెబ్సైట్లో ఈ–సెట్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న నిర్వహించనున్న ఈసెట్–20 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను 25వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సెట్ కన్వీనర్ ఎం.మంజూర్‌హుస్సేన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను 56 కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 52 సెంటర్లు, ఏపీలో 4 సెంటర్లలో ఉన్నాయని వెల్లడించారు. 21, 22న వెబ్ ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి 22న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయినా చేరని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని ప్రకటించింది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా అనర్హులుగా పరిగణిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకు www.knruhs. telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. -
9.35 వరకు అనుమతి..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభం అవుతాయని, విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్ తెలిపారు. పరీక్షల నిర్ణీత సమయం తర్వాత 5 నిమిషాల వరకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా తల్లిదండ్రులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. హాల్‌టికెట్ పోగొట్టుకుంటే www. bse. telangana. gov. in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావొచ్చని తెలిపారు. పరీక్షలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తితే 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూంకు (040–23230942) ఫోన్‌చేసి తెలపాలని సూచించారు. పరీక్ష రాసేందుకు అవసరమైన రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తీసుకెళ్లాలని, ఓఎంఆర్ షీట్ తమదేనా.. కాదా అని సరి చూసుకొని పరీక్ష రాయాలన్నారు. మెయిన్ ఆన్సర్ షీట్‌పై ఉన్న సీరియల్ నంబర్‌ను మాత్రమే అడిషనల్ షీట్లు, గ్రాఫ్, మ్యాప్, బిట్ పేపర్లపై వేయాలని వివరించారు. సెల్‌ఫోన్, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు హాల్లోకి తీసుకెళ్లొద్దని, హాల్‌టికెట్ తప్ప మరే కాగితాలు వెంట తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పేరు, సంతకం, గుర్తింపు చిహ్నాలు, స్లోగన్లు జవాబు పత్రంలో ఎక్కడా రాయొద్దని సూచించారు. -
సెల్‌ఫోన్ కనిపిస్తే యాక్ట్ 25
► హాల్‌టికెట్ చూపిస్తే బస్సులో ఉచితం ► ఐడీ ఉన్నవారు తప్ప ఎవరూ కేంద్రంలో ఉండకూడదు ► రోజూ ఉదయం సీఎస్,డీఓలతో సెట్ కాన్ఫరెన్స్ ► జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఛీప్ సూపరింటెండెంట్లు మినహా తక్కిన ఏ ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ దొరికినా వారిపై యాక్ట్ 25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో మొత్తం 49,576 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో 49,073 మంది రెగ్యులర్ విద్యార్థులు, 503 మంది సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 193 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 145 ప్రభుత్వ పాఠశాలలు, 48 ప్రైవేట్ పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థీ ఖచ్చితంగా బెంచీలపై కూర్చునే పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారన్నారు. హాల్‌టికెట్ చూపిస్తే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చన్నారు. విద్యార్థులు తొలిరోజు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్లు డైన్లోడ్ చేసుకోండిలా..: హాల్ టికెట్టు లేని విద్యార్థలు http://hall17.bseap.org/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు రోజూ ఉదయం 8 నుంచి 8.20 గంటల వరకు పోలీస్స్టేషన్లలో సెట్ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలో 15 నిముషాల ముందు ప్రశ్నపత్రం బండిలు ఓపెన్ చేయాలన్నారు. మూడో అంతస్తులో కేంద్రం ఉంటే 20 నిముషాల ముందు ఓపెన్ చేయాలన్నారు. తెలుగు, ఇంగ్లీష్ పరీక్షలకు ప్రశ్నపత్రంతో పాటు బిట్ పేపర్ కూడా ఒకేసారి ఇవ్వాలన్నారు. తక్కిన పరీక్షలకు చివర అరగంట ముందు బిట్ పేపర్లు ఇవ్వాలన్నారు. 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామన్నారు. వీరిలో పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ నుంచి సభ్యులుగా ఉంటారన్నారు. యాక్ట్ 25 పక్కాగా అమలు చేయనున్నామన్నారు. పరీక్షల విధుల్లో ఉన్న ఏస్థాయి వారైనా మాస్ కాయీపింగ్, చూసిరాతలను ప్రోత్సహిస్తే జైలుశిక్ష ఉంటుందన్నారు. ఏసీ గోవిందునాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అందరికీ ఐడీ కార్డులు ఇస్తున్నామన్నారు. ఐడీ కార్డులు లేకుండా ఎవరైనా ఉంటే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. జవాబుపత్రాలు రోజూ సాయంత్రం 4 గంటల దాకా పోస్టల్ అధికారులు తీసుకోవాలని కోరారు. -
'ఇంటర్ బోర్డుకు లంచం ఇవ్వకపోవడం వల్లే'
-
'ఇంటర్ బోర్డుకు లంచం ఇవ్వకపోవడం వల్లే'
హైదరాబాద్: 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు అందకపోవడంపై వాసవి కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఇంటర్ బోర్డు అధికారులకు లంచం ఇవ్వకపోవడం వల్లే తమ విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయకపోవడానికి ఇంటర్ బోర్డు అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తనను అరెస్టు చేసినా ఫరవాలేదని.. తనతో పాటు బోర్డు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతేడాది జూన్ నెలలోనే పర్మీషన్ ఇంటర్మీడియట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. కళాశాలను పరిశీలించడానికి వచ్చిన అధికారులు పర్మీషన్ ఇచ్చారని చెప్పారు. అఫ్లియేషన్ ఇవ్వడానికి మాత్రం లంచం డిమాండ్ చేసినట్లు చెప్పారు. దాదాపుగా రూ.2 లక్షలు అధికారులకు లంచంగా ఇచ్చినట్లు తెలిపారు. మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని.. ఇవ్వనందుకు జూన్ నుంచి బోర్డు చుట్టూ తిప్పించుకున్నట్లు చెప్పారు. చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లాగిన్ ఇచ్చారని.. ఇప్పుడేమో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్తును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచడంపై అసంతృప్తి’
-
‘హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచడంపై అసంతృప్తి’
హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ విద్యార్థుల హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచడంపై ప్రయివేట్ కళాశాలల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఫీజు కట్టకున్నా, హాజరు కాకపోయినా పరీక్ష రాయొచ్చనే విధంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ ప్రయివేట్ జూనియర్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి అన్నారు. విద్యార్థులందరూ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష రాస్తే, ఇక నాణ్యమైన విద్యతో పాటు, బయోమెట్రిక్ హాజరు ఎందుకని ఆయన సోమవారమిక్కడ ప్రశ్నించారు. కాగా ఫీజులు కట్టలేదనో మరే కారణంతోనైనా విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇవ్వని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే హాల్ టికెట్లకోసం ఇంటర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని, తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోచ్చని సూచించారు. మరోవైపు ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి 19 వరకు జరగనున్నాయి. -
టీటీసీ పరీక్షకు హాల్‌టికెట్లు డౌన్లోడు చేసుకోవాలి
విద్యారణ్యపురి: టీటీసీ లోయర్, థియరీ పరీక్షలు ఈనెల 16న జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల కోసం వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో నాలుగు సెంటర్లు ఎంపిక చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. టీటీసీ పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డబ్లూడబ్లూడబ్లూ.బీఎస్ఇ తెలంగాణ.ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా 14వ తేదీవరకు డౌన్లోడు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. -
ఎల్లుండి ఎంసెట్-3 షెడ్యూల్
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్-3 నిర్వహణపై కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎల్లుండి పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయాలని కమిటీ శుక్రవారం నిర్ణయించింది. కొత్త హాల్ టికెట్లతో పరీక్షకు అనుమతి ఇస్తామని కన్వీనర్ యాదయ్య తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఎంసెట్-2కు దరఖాస్తు చేసినవారికే ఎంసెట్-3లో అవకాశం ఉంటుందన్నారు. పరీక్ష జరిగిన వారం రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. వచ్చే నెల 11న ఎంసెట్-3 నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో ఇప్పటివరకూ 34మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించిన సీఐడీ తాజా దర్యాప్తులో వారి సంఖ్యను 42గా తేల్చింది. -
నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
పేపర్ –1 పరీక్ష సమయంలో మార్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్లను ఈ నెల 13 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. 3.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈ టెట్‌ను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ నెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పరీక్ష కేంద్రాలు మారాయని పేర్కొన్నారు. గతంలో డౌన్లోడ్ హాల్‌టికెట్లు పనికిరావని, ఈ నెల 13 ఉదయం 11 గంటల తర్వాత తాజా హాల్‌టికెట్లు tstet.cgg. gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కొత్త హాల్టికెట్లలో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్లో పేర్కొన్నట్లు కాకుండా పేపర్–1 పరీక్ష సమయంలో మార్పులు చేసినట్లు తెలిపారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పేపరు-2 పరీక్ష సమయంలో ఎలాంటి మార్పు లేదని, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్ వెనక ఉన్న సూచనలను అభ్యర్థులు క్షుణ్నంగా చదవాలని సూచించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ డేటాను సేకరిస్తున్నామని, పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌లో కేటాయించిన స్థలంలో సంతకం చేయాలని, ఎడమ చేతి బొటన వేలి ముద్రలు వేయాలని చెప్పారు. నిర్ణీత పరీక్ష సమయానికి మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. -
మే9 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్ల జారీ
హైదరాబాద్: ఎంసెట్ పరీక్ష హల్ టికెట్ల జారీకి ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు బదులు ఈనెల 9వ తేదీ నుంచే తమ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 15న జరిగే పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు వెళ్లి చూసి వచ్చేందుకు వీలుగా ఈనెల 9వ తేదీ నుంచే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించినట్లు తెలిపారు. -
ఎంసెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
- ఈ నెల 8వ తేదీ నుంచి హాల్‌టికెట్లు పొందవచ్చు - గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి - నిమిషం ఆలస్యమైనా అనుమతించరు - ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్, ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని ఎంసెట్ - 2014 కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు సూచించారు. నల్లగొం డలో ఎంసెట్ నిర్వహణపై సోమవారం స్థానిక ఎన్జీ కాలేజీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంసెట్ నిర్వహణకు జిల్లా కేంద్రంలో 17 ఇంజినీరింగ్ సెం టర్లు, 8 అగ్రికల్చర్, మెడిసిన్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 8,500 మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు, 4050 అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, అగ్రికల్చర్, మెడిసిన్ మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల న్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోరని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్సైట్ నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. నిర్వహణలో ఏలాంటి అక్రమాలకు తావు లేకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీ సుల సహకారం తీసుకుంటామన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అభ్యర్థులు ఎలాంటి అక్రమాలకు పాల్పడిన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు, ఆపైన ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైటెక్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్, ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడంతో పాటు, పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.నాగేందర్‌రెడ్డి, 17 మంది పరి శీలకులు, 17మంది చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.