
సెల్‌ఫోన్ కనిపిస్తే యాక్ట్ 25
► హాల్‌టికెట్ చూపిస్తే బస్సులో ఉచితం
► ఐడీ ఉన్నవారు తప్ప ఎవరూ కేంద్రంలో ఉండకూడదు
► రోజూ ఉదయం సీఎస్,డీఓలతో సెట్ కాన్ఫరెన్స్
► జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఛీప్ సూపరింటెండెంట్లు మినహా తక్కిన ఏ ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ దొరికినా వారిపై యాక్ట్ 25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో మొత్తం 49,576 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో 49,073 మంది రెగ్యులర్ విద్యార్థులు, 503 మంది సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 193 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 145 ప్రభుత్వ పాఠశాలలు, 48 ప్రైవేట్ పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థీ ఖచ్చితంగా బెంచీలపై కూర్చునే పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారన్నారు. హాల్‌టికెట్ చూపిస్తే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చన్నారు. విద్యార్థులు తొలిరోజు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.
హాల్ టికెట్లు డైన్లోడ్ చేసుకోండిలా..: హాల్ టికెట్టు లేని విద్యార్థలు http://hall17.bseap.org/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు రోజూ ఉదయం 8 నుంచి 8.20 గంటల వరకు పోలీస్‌స్టేషన్లలో సెట్ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలో 15 నిముషాల ముందు ప్రశ్నపత్రం బండిలు ఓపెన్ చేయాలన్నారు. మూడో అంతస్తులో కేంద్రం ఉంటే 20 నిముషాల ముందు ఓపెన్ చేయాలన్నారు. తెలుగు, ఇంగ్లీష్ పరీక్షలకు ప్రశ్నపత్రంతో పాటు బిట్ పేపర్ కూడా ఒకేసారి ఇవ్వాలన్నారు. తక్కిన పరీక్షలకు చివర అరగంట ముందు బిట్ పేపర్లు ఇవ్వాలన్నారు. 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామన్నారు. వీరిలో పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ నుంచి సభ్యులుగా ఉంటారన్నారు. యాక్ట్ 25 పక్కాగా అమలు చేయనున్నామన్నారు. పరీక్షల విధుల్లో ఉన్న ఏస్థాయి వారైనా మాస్ కాయీపింగ్, చూసిరాతలను ప్రోత్సహిస్తే జైలుశిక్ష ఉంటుందన్నారు. ఏసీ గోవిందునాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అందరికీ ఐడీ కార్డులు ఇస్తున్నామన్నారు. ఐడీ కార్డులు లేకుండా ఎవరైనా ఉంటే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. జవాబుపత్రాలు రోజూ సాయంత్రం 4 గంటల దాకా పోస్టల్ అధికారులు తీసుకోవాలని కోరారు.